Sunday, December 14, 2025
E-PAPER
Homeసోపతిపుస్తక ప్రియులకు ఆహ్వానం

పుస్తక ప్రియులకు ఆహ్వానం

- Advertisement -

బుక్‌ ఫెయిర్‌ చరిత్ర గురించి చెబుతారా?
1987లో మొదటి సారి పది స్టాల్స్‌తో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ప్రారంభించారు. అప్పట్లో కోఠీలో ఉండే పుస్తకాల దుకాణాల వాళ్లకు ఈ ఆలోచన వచ్చింది. పుస్తకాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఒక సొసైటీగా ఏర్పడి దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 370 బుక్‌ స్టాల్స్‌ వరకు పెట్టుకునే స్థాయికి హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ అభివృద్ధి చెందింది.

బుక్‌ ఫెయిర్‌ అభివృద్ధిలో కార్యదర్శిగా మీ పాత్ర ఏమిటి?
నేను మూడోసారి కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్నాను. గత మూడేండ్ల నుండి కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నాము. గతంలో కేవలం పుస్తకాల అమ్మకాలకే పరిమితమై ఉండేది. కానీ ఈ మూడేండ్లలో కొత్త కొత్త రచయితలను, వారి సాహిత్యాన్ని బుక్‌ఫెయిర్‌ ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్నాము. సుమారు 350 మంది రచయితలు మాకు బుక్‌ఫెయిర్‌ ద్వారా పరిచయమయ్యారు. అంతే కాకుండా చిన్న పిల్లలు చాలా మంది పుస్తకాలు రాస్తున్నారు. కానీ వాటిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. అలాంటి పిల్లల కోసం ప్రత్యేకంగా స్టాల్‌ ఏర్పాటు చేశాము.

ప్రస్తుతం ఎన్ని స్టాల్స్‌ పెట్టబోతున్నారు?
గత ఏడాది 364 స్టాల్స్‌ పెట్టాము. కానీ వాటిని నిర్వహించడం, ఏర్పాట్లు కల్పించడంలో కొంత ఇబ్బంది ఏర్పడింది. అందుకే ఈసారి 300 స్టాల్స్‌ వరకే పరిమితం చేయాలని మా కమిటీగా నిర్ణయించాము. గతంలో ఎదురైన కొన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్టాల్స్‌ ఏర్పాటు చేసే డిజైనింగ్‌లో కొన్ని మార్పులు చేశాము. ఇరుగ్గా ఉండడం, సందర్శకులు తిరిగేందుకు కొంత ఇబ్బందిగా వుందని ఫిర్యాదులు వచ్చాయి. అలాగే వాష్‌రూమ్స్‌కు కూడా బాగా ఇబ్బంది పడ్డారని మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ గమనించి మార్పులు చేయాలని నిర్ణయించాము. ముఖ్యంగా మొబైల్‌ వాష్‌రూమ్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించేందుకు నలుగురు మనుషులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏది ఏమైనా సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మా కమిటీ నిర్ణయించుకుంది.

బుక్‌ఫెయిర్‌ ప్రచారం కోసం ఏం చేస్తున్నారు?
గత ఏడాది బుక్‌ఫెయిర్‌కు సీఎం వచ్చారు. ఈ 37 ఏండ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌కు రాలేదు. అలాంటిది గత ఏడాది మా కమిటీ పట్టుబట్టి సీఎం గారిని ఆహ్వానించాము. ఆయన రావడం వల్ల గతం కంటే బుక్‌ఫెయిర్‌కు ప్రచారం పెరిగింది. ప్రాధాన్యం కూడా పెరిగింది. అలాగే మంత్రులు, ఇద్దరు గవర్నర్లు కూడా వచ్చారు. దీనివల్ల గత ఏడాది 12 లక్షల మంది వరకు వచ్చారు. ఈ ఏడాది 15 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది కూడా అనేక మంది ప్రముఖులను పిలుస్తున్నాము. వీరిలో రాజకీయ నాయకులు, రచయితలు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఉంటారు. వారంతా వాళ్లకు నచ్చిన పుస్తకం గురించి, స్ఫూర్తినిచ్చిన పుస్తకం గురించి పంచుకోవాలి. దీని వల్ల ఆ పుస్తకాలు చదవాలనే ఆలోచన పిల్లల్లో, యువతలో పెరుగుతుంది. అందుకే ఈ కృషి చేస్తున్నాం. అలాగే గత ఏడేండ్ల నుండి టికేట్‌ ధర పది రూపాయలే ఉంది. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది నుండి 25 రూపాయలు పెట్టాలని నిర్ణయించాము.

బుక్‌ఫెయిర్‌కు ప్రభుత్వం నుండి ఏమైనా సహకారం అందుతుందా?
గత 12 ఏండ్ల నుండి ప్రభుత్వం మాకు ఎన్‌టీఆర్‌ స్టేడియంను ఫ్రీగా ఇస్తుంది. అయితే ఈ ఏడాది మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులో మీదుగా బుక్‌ఫెయిర్‌ పోస్టర్‌ కూడా ఆవిష్కరించాము. ఆ సందర్భంగా వారు ‘బుక్‌ఫెయిర్‌ ద్వారా మీరు పుస్తకాలు అమ్మడమే కాదు సమాజంలో మంచి మార్పుకు, అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి కోటి రూపాయల పుస్తకాలు మేము బుక్‌ఫెయిర్‌ ద్వారా కొని 33 రాష్ట్రాలకు పంపిణి చేస్తాము’ అని చెప్పారు. ఇది ప్రభుత్వం వైపు నుండి తీసుకున్న మంచి ప్రోత్సాహకరమైన నిర్ణయం.

సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత పుస్తకాల ప్రాధాన్యత ఏమైనా తగ్గిపోయిందంటారా?
అలాంటిది ఏమీ లేదు. అయితే సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం లేదు అనే ప్రచారం బాగా జరుగుతుంది. సోషల్‌ మీడియా ఎంత అభివృద్ధి చెందినా పుస్తకాలు చదివే వాళ్ల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది మేము ప్రత్యేకంగా పరిశీలిస్తే ఐటీ యువత సుమారు మూడున్నర నాలుగు లక్షల మంది వరకు బుక్‌ఫెయిర్‌కు వచ్చి పుస్తకాలు కొనుకొన్ని వెళ్లారు.

బుక్‌స్టాల్స్‌లో ఎలాంటి పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి?
అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. అలాగే జాతీయ స్థాయిలో పేరు పొందిన వాళ్లు కూడా మన దగ్గరకు వచ్చి స్టాల్స్‌ పెట్టుకుంటున్నారు. మన హైదరాబాద్‌ మినీ ఇండియా లాంటిది. అన్ని భాషల వాళ్లు ఇక్కడ ఉంటారు. కాబట్టి అన్ని భాషల పుస్తకాలు ఇక్కడ అమ్ముడు పోతాయి. బుక్‌ఫెయిర్‌ వద్దనే ప్రారంభంలో ఫుడ్‌ కోర్టు కూడా ఉంటుంది. అవి కూడా చాలా క్వాలిటీగా ఉండేలా చూస్తున్నాము. ఎలా పడితే అలా అమ్మడానికి వీలు లేకుండా ఈ సారి వాటి ధర కూడా మేమే నిర్ణయించాము. అలాగే ఈ ఏడాది ప్రత్యేకంగా స్టాల్స్‌ పెట్టుకున్న వాళ్లకు స్నాక్స్‌, టీ మేమే ఉచితంగా ఇస్తున్నాము. సాయంత్రం పూట చాలా బిజీగా ఉండి వాళ్లకు బటయకు వెళ్లి తినే అవకాశం ఉండదు. అందుకే మా కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రతి రోజు 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు సందర్శకులు రావొచ్చు. పుస్తక ప్రియులందరినీ ఈ సందర్భంగా మా కమిటీ తరుపున ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -