Thursday, April 2, 2026
E-PAPER
Homeజాతీయంకేరళంలో ఎల్డీఎఫ్‌ చారిత్రక విజయం ఖాయం

కేరళంలో ఎల్డీఎఫ్‌ చారిత్రక విజయం ఖాయం

- Advertisement -

హ్యాట్రిక్‌ దిశగా లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌
రేవంత్‌రెడ్డి ‘మూటల’ రాజకీయం.. కేరళ చైతన్యం ముందు సాగదు : బి.వెంకట్‌

తిరువనంతపురం : కేరళం రాష్ట్రంలో లెఫ్ట్‌ డెమో క్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్డీఎఫ్‌) సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని, ఏప్రిల్‌ 9న జరగబోయే ఎన్నికల్లో మూడవసారి వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏ డబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ దీమా వ్యక్తం చేశారు. బుధవారం తిరువనంతపురం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఎల్డీఎఫ్‌ అభ్యర్థి, ఏఐఏడబ్ల్యూయూ అఖిల భారత కార్యవర్గ సభ్యురాలు ఓ.ఎస్‌. అంబిక తరఫున నిర్వహించిన భారీ ఎన్నికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బి.వెంకట్‌ కాంగ్రెస్‌, బీజేపీలపై నిప్పులు చెరిగారు.

తెలంగాణ ‘మోసపూరిత’ నమూనా కేరళలో చెల్లదు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రులు తెలంగాణ నుంచి అబద్ధాల ‘మూటలు’ మోసుకొచ్చి, కేరళంలో వినిపిస్తున్న మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని వెంకట్‌ అన్నారు. అభివృద్ధికి మారుపేరైన కేరళం మోడల్‌కు, వైఫల్యాల రేవంత్‌రెడ్డి మోడల్‌కు ‘నక్కకు నాగలోకానికి’ ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజల సొమ్ముతో మలయాళ పత్రికల్లో కోట్లాది రూపాయల అబద్ధపు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన కేరళ చైతన్యాన్ని కొనలేరని హితవు పలికారు.

తెలంగాణలో మోసం – కేరళంలో వేషం
తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి ”ఆరు గ్యారంటీలు” అంటూ ప్రజలకు ఆశ చూపి, గద్దెనెక్కిన తర్వాత వాటిని అటకెక్కించిన ఘనత రేవంత్‌ రెడ్డిది.
పెన్షన్‌ మోసం : నెలకు రూ.4,000 పింఛను హామీ ఇప్పటికీ అమలు కాలేదు.
రైతు భరోసా : ఐదు విడతల్లో ఇవ్వాల్సిన రైతు భరోసాను ఇప్పటికే మూడు దఫాలు ఎగొట్టారు.
కూలీ బంధు : రూ.12000/-వ్యవసాయ కార్మికులకు ‘కూలీ బంధు’ ఇస్తామని చెప్పి, రెండేండ్లుగా కేవలం సర్వేలతో కాలయాపన చేస్తున్నారు. కోట్ల మంది ఉంటే వేవిల్లో ఇచ్చి ఓట్లు వేసిన గ్రామీణ పేదలను మోసం చేస్తున్నారు.
సొంత రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు కేరళం వచ్చి అవే అబద్ధపు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు.

రేవంత్‌ది పేదలపై బుల్డోజర్ల పాలన.. ఎల్డీఎఫ్‌ది ప్రజా సంక్షేమ పాలన
ఖమ్మం జిల్లాలో పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేసి ప్రజలను రోడ్డున పడేసిన కాంగ్రెస్‌ నమూనా ఒకవైపు.. చివరకు ఖమ్మం జిల్లా కన్నెర్ర జేస్తే సగానికి ఇస్తామని మరో సగాన్ని నడిరోడ్డు మీద వదిలేసిన చరిత్ర రేవంతరెడ్డిది. కేరళలో 5 లక్షల పక్కా ఇండ్ల్లను నిర్మించి ఒకే రోజు గృహ ప్రవేశాలు చేయించిన ఎల్డీఎఫ్‌ నమూనా మరోవైపు ఉందని గుర్తుచేశారు. ప్రజా సంక్షేమ పాలనను బుల్డోజర్‌ పాలన ఏమీ చేయలేదన్నారు. కేరళంలో కూడా అవినీతి ఆఫీస్‌ తెరవటానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరాటంగా ఉన్నారు. అక్కడ అక్రమంగా సంపాదించిన తెలంగాణ ప్రజల సొమ్మును కేరళకు తెచ్చి ఇక్కడే మకాం పెట్టారు. యూడీఎఫ్‌ వస్తే ఇక్కడ కూడా అవినీతి ఆఫీసు తెరవవచ్చనే ఆరాటపడుతున్నారు.

సామాజిక న్యాయం – దళిత రక్షణ
దళిత పూజారులు : కేరళంలో దళితులను ఆలయ పూజారులుగా నియమించి కులవివక్షపై ఎల్డీఎఫ్‌ యుద్ధం ప్రకటించింది.
దళితులపై అణచివేత : తెలంగాణలో నాగర్‌కర్నూల్‌ పసిపాప మరణం వంటి ఘటనల్లో ఆధిపత్య కులాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్దతు పలుకుతోందని ఆరోపించారు. నిటి ఆయోగ్‌ ప్రకారం దళితులకు అత్యంత రక్షణ ఉన్న రాష్ట్రం కేరళం మాత్రమేనని గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ – బీజేపీ అపవిత్ర కలయిక
అధికారం కోసం కాంగ్రెస్‌ ఏ గడ్డి తినడానికైనా సిద్ధమైందని, కేరళంలో బీజేపీతో అంటకాగుతూ రాహుల్‌గాంధీ దిగజారి మాట్లాడుతున్నారని వెంకట్‌ ధ్వజమెత్తారు. ఎల్డీఎఫ్‌ అంటే అభివృద్ధి అని, యూడీఎఫ్‌-బీజేపీ అంటే వినాశనమని ఆయన అభివర్ణించారు. ఉచిత విద్య, వైద్యం, భూమి లేని పేదలకు భూమి హక్కులు కల్పిస్తున్న ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని కేరళం ప్రజలు తిప్పికొడతారని, అబద్ధాలతో రాజకీయం చేసే కాంగ్రెస్‌-బీజేపీ అపవిత్ర కలయికకు ఇక్కడ చోటులేదని బి. వెంకట్‌ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -