శరద్‌పవార్‌తో జతకడతామన్న అజిత్ పవార్
మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం
ముంబయి : మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది. స్థానిక ఎన్నికల్లో పవార్ కుటుంబాలు మళ్లీ చేతులు కలపనున్నట్టు తెలుస్తున్నది. బాబాయ్ శరద్‌పవార్‌తో కూటమి ఏర్పాటుకు అజిత్ పవార్ సై అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను చేశారు. రాబోయే పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ).. కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కూటమిని ఏర్పాటు చేస్తుందని వివరించారు. పింప్రి- చింఛ్వాడ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”రెండు వర్గాల మధ్య ఐక్యత అవసరం. పరివార్(కుటుంబం) కలిసి పోయింది” అని అజిత్ పవార్ అన్నారు. ”మునిసిపల్ ఎన్నికలకు అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేస్తున్న సమయంలో కలిసి పోటీ చేయాలని రెండు వర్గాలూ నిర్ణయించాయి. ఇది కుటుంబాన్ని మళ్లీ కలుపుతుంది. దీని గురించి అనేక ప్రశ్నలు తలెత్తొచ్చు.. కానీ మహారాష్ట్ర అభివృద్ధి కోసం కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. సీట్ల పంపకాల గురించి నేను స్థానిక నాయకులతో చర్చించాను. దీని గురించి త్వరలో ప్రకటన ఉంటుంది” అని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ చెప్పారు.
పూణే మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఎన్సీపీ రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయనీ, అక్కడ కూడా కూటమి ఏర్పాటుకు అవకాశాలున్నాయని చర్చ నడిచింది. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయనీ, రాబోయే పూణే ఎన్నికల కోసం శరద్‌పవార్.. ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీ (ఎంవీఏ)తో చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. మహారాష్ట్రలో పింప్రి-చింఛ్వాడ్, పూనే పుర ఎన్నికలతో సహా మొత్తం 29 మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాతి రోజే ఓట్ల లెక్కింపు ఉంటుంది. నేటితో నామినేషన్ల గడువు ముగియనున్నది. బీజేపీ, శివసేన (షిండే), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీల కూటమి ‘మహాయుతి’ పేరుతో ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వంలో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. బీజేపీ నుంచి ఫడ్నవీస్ సీఎంగా.. శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉండి, ‘మహాయుతి’లో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి అజిత్‌పవార్.. ఇప్పుడు శరద్‌పవార్‌తో కలిసి ‘స్థానికం’ కోసం కూటమి ఏర్పాటు చేస్తానని ప్రకటన చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



