Saturday, July 5, 2025
E-PAPER
Homeజాతీయంఊహించని విషాదం

ఊహించని విషాదం

- Advertisement -

– విమాన ప్రమాద ఘటనా స్థలానికి ప్రధాని మోడీ
– బ్లాక్‌ బాక్స్‌ లభ్యం.. కీలక సమాచారంపై ఉత్కంఠ
– మృతుల గుర్తింపు కోసం డీఎన్‌ఏ టెస్ట్‌
– 72 గంటల తర్వాతే బంధువులకు అప్పగింత
– ఆస్పత్రి ఎదుట పడిగాపులు
– విషాదాన్ని దిగమింగుకోలేకపోతున్న సన్నిహితులు, కుటుంబీకులు
అహ్మదాబాద్‌:
ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనాస్థలిని శుక్రవారం ప్రధాని మోడీ పరిశీలించారు. అనంతరం ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్‌ కుమార్‌ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలనూ మోడీ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర హౌంమంత్రి హర్ష్‌ సంఘవి తదితరులు ఉన్నారు.

ఇది ఊహించని పెను విషాదం: మోడీ
ఈ ప్రమాదంపై మోడీ మాట్లాడారు. ఇది ఊహించని పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనంటూ విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని, ఆ వేదనను మాటల్లోనే చెప్పలేమని అన్నారు. ఈ సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని తెలిపారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన తర్వాత మోడీ అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు.

ఘటనాస్థలానికి ఎయిరిండియా ఎండీ
మరోవైపు ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్‌ హైకమిషన్‌ అధికారులు కూడా అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 169 మంది భారత పౌరులు కాగా.. 53మంది బ్రిటన్‌వాసులు, ఇతర విదేశీయులు ఉన్నారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రయాణికుడు మాత్రం మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఈ విమానం బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయంపై కూలడంతో అందులోని 24 మంది వైద్య విద్యార్థులు చనిపోయారు.

ఏమిటీ బ్లాక్‌ బాక్స్‌..?
ప్రతి కమర్షియల్‌ విమానంలో రెండు బాక్స్‌లు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్‌ డేటాను రికార్డ్‌ చేయగా.. మరొకటి కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డుకు ఉపయోగపడుతుంది. విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు, అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ ‘మేడే’ అంటూ సమీపంలోని ఏటీసీకి పైలట్‌ ఓ సందేశాన్ని పంపుతారు. వీటితోపాటు పైలట్‌-కోపైలట్‌ల సంభాషణలన్నీ డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌)లో రికార్డవుతాయి. ఈ డీఎఫ్‌డీఆర్‌నే బ్లాక్‌బాక్స్‌గా వ్యవహరిస్తారని ఏఏఐబీ తెలిపింది.

బ్లాక్‌ బాక్స్‌ లభ్యం
అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానానికి సంబంధించి అత్యంత కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైంది. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) వెల్లడించింది. ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌరవిమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. విమానంలో కీలకంగా ఉండే బ్లాక్‌ బాక్స్‌లోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునే వీలు కలుగుతుంది.

మృతుల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు
అహ్మదాబాద్‌లో విమానం కూలిన ఘటనలో మృతుల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సివిల్‌ ఆస్పత్రిలో శవపరీక్షలు పూర్తి చేసినట్టు వైద్యాధికారులు ధ్రువీకరించారు. కుటుంబీకుల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నామని అహ్మదాబాద్‌ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ధనుంజరు ద్వివేది వెల్లడించారు. డీఎన్‌ఏ ప్రక్రియ పూర్తి చేసిన మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నామని తెలిపారు.
ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ
రషీద్‌ పటేల్‌ తన మేనల్లుడు కోసం వెతుకుతున్నాడు. ఇందుకోసం అతని సోదరి రక్త నమూనాలు ఇచ్చింది. రక్త నివేదిక వచ్చిన తరువాత మృతదేహం ఇస్తామని వైద్యులు తెలిపారు. భరూచ్‌ ప్రాంతానికి చెందిన ఆ యువకుడి వయస్సు కేవలం 25 ఏండ్లు. పై చదువుల కోసం లండన్‌ వెళ్తూ విమాన ప్రమా దంలో మరణిం చాడనిరషీద్‌ పటేల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.
పాయెల్‌ బెన్‌ తన తల్లి సరళాబెన్‌, మేనకోడలి కోసం వెతుకుతున్నాడు. విమానం కూలిన సమయంలో ఆమె వంట చేస్తోంది. ఆ సమయంలోనే ఈ విషాదకర ఘటన గురించి పాయెల్‌కు తెలిసింది. ప్రకాశ్‌ భారు.. తన అల్లుడి కోసం ఆస్పత్రి వద్ద వేచి ఉన్నాడు. తన అల్లుడిని విమానాశ్రయంలో దింపి, ఇంటికి చేరుకున్నాడు. ఇంతలోనే విమానం కూలిపోయిందనే వార్త. ఇప్పుడు ఆయన కుటుంబం సివిల్‌ ఆస్పత్రిలో రక్త నమూనాలిచ్చింది. తన అల్లుడు పదేండ్లుగా లండన్‌లో నివసిస్తున్నాడని, ప్రమాదం జరిగిన రోజు కూడా ఇండియా నుంచి మళ్లీ లండన్‌కు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని ప్రకాశ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.
నాగ్‌పూర్‌కు చెందిన మనీశ్‌ కామ్‌దార్‌ తన కుమార్తె, మనవడు, కుమార్తె అత్తగారి కోసం ఆస్పత్రి వద్ద నిరీక్షిస్తున్నాడు. ఆయన ఇమ్మిగ్రేషన్‌ అధికారులపై అవినీతి ఆరోపణలు చేశాడు. నా మనవడు రుద్ర నాగ్‌పూర్‌లో జన్మించాడు. కానీ పాస్‌పోర్ట్‌లో అతను బ్రిటీష్‌ పౌరుడిగా నమోదై ఉంది. దీనిని ఆసరాగా తీసుకుని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మా నుంచి 1000 పౌండ్లు లంచం తీసుకున్నారు. ఆ తరువాత వారిని విడిచిపెట్టారు. అయితే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించి, రుద్రను ఆపి ఉంటే, నా మనవడు ఇప్పుడు బతికి ఉండేవాడు అని మనీశ్‌ కామ్‌దార్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.
విమానం కూలిపోయిన ప్రదేశంలో ఒక కుటుంబం టీ షాపు నడుపుతోంది. ప్రమాద సమయంలో 15 ఏండ్ల బాలుడు ఆకాశ్‌ అక్కడే ఉన్నాడు. దీనితో అతను మంటల్లో చిక్కుకుని మరణించాడు. అతనిని కాపాడడానికి వెళ్లిన తల్లి కూడా మంటల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ విధంగా ఎవరిని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి.
ఇప్పటి వరకు గుర్తించింది ఆరుగురినే!

ఇప్పటివరకూ ఆరుగురి మృతదేహాల ముఖాలను గుర్తించి, వారి కుటుంబాలకు అప్పగించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం 215 మంది బాధిత కుటుంబాలు తమను సంప్రదించారని, వారి నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నట్టు చిరాగ్‌ పోలీసు అధికారి గోసాయి వివరించారు. డీఎన్‌ఏ ప్రక్రియ పూర్తిచేసేందుకు దాదాపు 72 గంటల సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. మృతదేహాలను గుర్తించాక, శవపరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -