తీవ్రంగా గాయపడిన ఉద్యోగిని
నవతెలంగాణ – బోనకల్
బోనకల్ రైల్వే స్టేషన్ లోనే రెండవ ఫ్లాట్ ఫామ్ పై విధులు నిర్వహిస్తున్న మహిళా రైల్వే ఉద్యోగినిపై గుర్తుతెలియని యువకుడు మార్బుల్ రాయితో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. బాధితురాలు మోర్ల నిరోష తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని బోనకల్ గ్రామానికి చెందిన మోర్ల నిరోష తన ఉద్యోగ విధులలో భాగంగా బుధవారం రాత్రి రైల్వే స్టేషన్ రెండో ఫ్లాట్ ఫామ్ పై విధులు నిర్వహిస్తుంది. అదే సమయంలో ట్రాక్ మెన్లు క్రాంతి, సాయి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఓ గుర్తు తెలియని వ్యక్తి సుమారు ఐదు నిమిషాల పాటు వారి వెంటపడుతూ తాను కూడా పని చేస్తానని, తనకు కూడా పని ఇవ్వాలని అడుగుతూ వెంటపడ్డాడు. దీంతో సాయి, క్రాంతి అతన్ని మందలించారు.
ఈలోగా క్రాంతి, సాయి తమ విధుల సమయం ముగియడంతో ఇంటికి వెళ్లిపోయారు. నిరోషా మాత్రమే ఫ్లాట్ ఫామ్ పై ఉన్న విషయాన్ని గమనించిన వ్యక్తి మళ్ళీ వచ్చి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఈ టైంలో ఎవరూ తిరగొద్దని మళ్ళీ మందలించింది. తరువాత అతను వెళ్లిపోయాడనుకుని భర్తతో ఫోన్ లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా వచ్చి ప్లాట్ ఫామ్ పై ఉన్న మార్బుల్ రాయితో ఆమె తలపై బలంగా కొట్టాడు. తనను ఎవరో కొట్టారని వెంటనే రావాలంటూ భర్తకు ఫోన్ లో చెప్పింది. తీవ్ర రక్తసావంతో ఆమె ప్రాణ భయంతో కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్టేషన్ లోని సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో దుండగడు పరారయ్యాడు. అనంతరం నిరోషాను సహచర ఉద్యోగులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి రైల్వే పోలీసులు, జిఆర్పిఎఫ్ పోలీసులు వెళ్లి బాధితురాలుని సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యులు నాలుగు కుట్లు వేశారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఖమ్మం రైల్వే పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం రైల్వే స్టేషన్ లో ఇటువంటి సంఘటనలు ఏనాడు చోటు చేసుకోలేదు. ఈ సంఘటన రైల్వే అధికారులను తీవ్ర కలవరపాటికి గురిచేసింది. ఆ యువకుడి ఆచూకీ కోసం రైల్వే పోలీసులు వేట ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఆ యువకుడు బోనకల్లు మండల కేంద్రంలోని తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.



