Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకలెక్టరేట్లను ముట్టడించిన అంగన్‌వాడీలు

కలెక్టరేట్లను ముట్టడించిన అంగన్‌వాడీలు

- Advertisement -

అంగన్‌వాడీలకు రూ.18వేల వేతనం ఇవ్వాలి
వేతనాల పెంపుపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయించాలి
ప్రీ, ప్రైమరీ విద్యను అంగన్‌వాడీలోనే నిర్వహించాలి : తెలంగాణ అంగన్‌వాడీ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా

నవతెలంగాణ-వికారాబాద్‌/విలేకరులు
అంగన్‌వాడీలకు రూ.18వేల వేతనం ఇవ్వాలని, ప్రీ, ప్రైమరీ విద్యను అంగన్‌వాడీల్లోనే నిర్వహించాలని తెలంగాణ అంగన్‌వాడీ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే వేతనాల పెంపు నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ అంగన్‌వాడీ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ సోమవారం కలెక్టరేట్ల ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ‘సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ ఇక్కడనే ఉంటాం.. ఎలాంటి బెదిరింపులకు తలొగ్గం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు.

వికారాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టరేట్‌ ప్రధాన గేటు తోసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు డైరెక్టర్‌ కృష్ణవేణి అంగన్‌వాడీలతో చర్చించారు. వికారాబాద్‌ జిల్లాలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఒంటిపూట బడులు జిల్లా నుంచే మొదలు కావాలని, ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం ఇక్కడనే తెలపాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పట్టుపట్టారు. అంగన్‌వాడీ టీచర్లు బెదిరింపులకు భయపడరని, వేధింపులు ఆపాలని పీడీకి తెలిపారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధర్నా నుద్దేశించి జయలక్ష్మి మాట్లాడారు.

ఐసీడీఎస్‌కు సరిపడా నిధులు కేటాయించాలన్నారు. ఎన్‌ఐపీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, 2026 ఎడ్యుకేషన్‌ పాలసీని సవరించాలన్నారు. అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీఓ నెం.80ని సవరించి 2024 జులై 1 నుంచి రిటైర్మెంటయిన అందరికీ ఈ జీఓను వర్తింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, అధ్యక్షులు పి.రామకృష్ణ, జిల్లా కోశాధికారి బుస్స చంద్రయ్య, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నర్సమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు బాలమణి, బేబి, మనోహర, ప్రాజెక్టుల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రధాన గేటు ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌కు సరిపడా నిధులు కేటాయించాలన్నారు. చనిపోయిన అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌కు రూ.2లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. నిర్మల్‌లో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌కు వినతిపత్రం అందజేశారు. కుమురం భీం ఆసిఫాబాద్‌లో అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఏఓకు వినతిపత్రం అందజేశారు.

హనుమకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్‌కు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైటాయించి కలెక్టర్‌ బయటికి రావాలని నినదీస్తూ గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సుబేదారి సీఐ రంజిత్‌ కుమార్‌ అంగన్వాడీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రత్యేక పోలీసు బలగాలతో ముట్టడి చేస్తున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్‌ను అరెస్ట్‌ చేశారు. అంగన్వాడీలు ఒకసారిగా పోలీసు వ్యాన్‌ను చుట్టముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలనూ అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా అక్కడా ధర్నా కొనసాగించారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

డీడబ్ల్యుఓ స్వర్ణ లత లెనినా మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కపూట బడి, మే నెల సెలవులు ప్లానింగ్‌ చేస్తున్నామని, త్వరలోనే సర్క్యూలర్‌ వస్తుందని తెలిపారు. ఖమ్మం నగరంలోని ధర్నా చౌక్‌నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన చేశారు. అనంతరం సుమారు 2 గంటల పాటు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా సాగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను ముట్టడించి రోడ్డుపై బైటాయించారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట పాల కేంద్రం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. నారాయణపేటలో మున్సిపల్‌ పార్క్‌ నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకున్న అంగన్వాడీలు అక్కడే ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఓ శ్రీధర్‌కు వినతిపత్రం అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేసికలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ, సౌత్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -