– సీబీఐకి ఫిర్యాదు చేయనున్న ఎస్బీఐ
– పార్లమెంట్‌లో మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి
న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రమోటర్ అనిల్ అంబానీపై మోసగాడు (ఫ్రాడ్)గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముద్ర వేసింది. ఈ విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి ఫిర్యాదు చేయడానికి ఎస్బీఐ సన్నద్దం అవుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. జూన్ 13న అనిల్ అంబానీని ఫ్రాడ్‌గా గుర్తించిందని మంత్రి లోకసభకు తెలిపారు. ఇదే విషయాన్ని జూన్ 24న ఆర్‌బిఐకి నివేదించిందన్నారు. దీనిపై సీబీఐ వద్ద కేసు దాఖలు చేసే ప్రక్రియలో ఉందన్నారు. ఎస్బీఐ ఫ్రాడ్‌గా గుర్తించిన విషయాన్ని జులై 1న ఆర్‌కామ్ బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది. ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31వేల కోట్లకు పైగా అప్పులు తీసుకున్నాయి. ఈ నిధులను ఆ సంస్థ అక్రమంగా వివిధ గ్రూప్ సంస్థలకు మళ్లించినట్టు గుర్తించామని ఎస్బీఐ వెల్లడించింది.
ఆర్‌కామ్‌కు అత్యధికంగా ఎస్బీఐ రూ.3,000 కోట్ల పైగా రుణాలు ఇచ్చింది. ఇందులో 2016 ఆగస్టు నాటికి రూ. 2,227.64 కోట్ల ఫండ్ బేస్డ్ ప్రిన్సిపల్ బకాయిలు, రూ. 786.52 కోట్ల నాన్ ఫండ్ బేస్డ్ బ్యాంక్ గ్యారంటీ అప్పులున్నాయి. ఇంతక్రితం 2020లోనూ ఓ సారి ఈ సంస్థను ఎస్‌బిఐ ఫ్రాడ్‌గా గుర్తించింది. సుప్రీం తీర్పు ఉత్తర్వులతో 2023 మార్చిలో దీన్ని వెనక్కి తీసుకుంది. తాజాగా మళ్లీ ఈ ఖాతాను ఫ్రాడ్‌గా గుర్తించింది.
అనిల్ అంబానీ ‘ఫ్రాడ్’
- Advertisement -
- Advertisement -