న్యూఢిల్లీ : రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానికి చెందిన రూ. 3,716 కోట్ల విలువైన ఇల్లు ‘అబోడ్’ను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఇడి బుధవారం జప్తు చేసింది. బ్యాంకు మోసంతో ముడిపడి ఉన్న ఒక కేసులో ముంబయిలో ఉన్న ఈ ఇంటిని జప్తు చేయడానికి తాత్కాలిక ఉత్తర్వు జారీ చేసినట్లు ఇడి అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ తాజా ఉత్తర్వుతో ఈ కేసులో అటాచ్‌మెంట్ చేసిన ఆస్థుల మొత్తం విలువ రూ 15,700 కోట్లకు చేరుకుందని అధికారి తెలిపారు. అలాగే, త్వరలోనే ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో జరిగే ఈ కేసు రెండో దశ విచారణకు అనిల్ అంబానీ హాజరయ్యే అవకాశం ఉందని అధికారి చెప్పారు. ఈ కేసులో విచారణ కోసం మొదటిసారిగా గతేడాది ఆగస్టులో ఇడి అధికారుల ముందు అనిల్ అంబానీ హాజరయ్యారు.



