Tuesday, January 20, 2026
E-PAPER
Homeబీజినెస్వీధి కుక్కల సామూహిక హత్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న జంతు సంక్షేమ సంస్థలు

వీధి కుక్కల సామూహిక హత్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న జంతు సంక్షేమ సంస్థలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలను చట్టవిరుద్ధమైన రీతిలో వధించటాన్ని తెలంగాణ జంతు సంక్షేమ సంస్థల కార్యాచరణ కూటమి ఖండించింది, కోర్టు ఆదేశాలను తీవ్రంగా ఉల్లంఘించటంతో పాటుగా విస్తృత స్థాయి పరిపాలనా వైఫల్యం జరుగుతుందని ఆరోపించింది. విస్తృతమైన హత్యలు మరియు తీవ్ర క్రూరత్వ  సంఘటనలకు సంబంధించిన కేసులను నమోదు చేసిన నేపథ్యంలో తక్షణ ప్రభుత్వ జోక్యాన్ని కోరింది.

సభ్య సంస్థలు సంకలనం చేసిన క్షేత్ర స్థాయి నివేదికల ప్రకారం, ఈ కూటమి జనవరి 2026 మొదటి వారాల్లోనే సుమారు 500 వీధి కుక్కల హత్యను నమోదు చేసింది. అలాగే ఇటీవలి కాలంలో 10 కి పైగా తీవ్రమైన క్రూరత్వ కేసులను నమోదు చేసింది, వాటిలో కుక్కలను రాడ్‌లతో కొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో విషప్రయోగం చేయడం మరియు వాటి అవయవాలను ముక్కలు చేయడం వంటివి ఉన్నాయి. కామారెడ్డి , హన్మకొండ జిల్లాల నుండి అత్యంత తీవ్రమైన సంఘటనలు నివేదించబడ్డాయి, ఇక్కడ స్థానిక పంచాయతీ అధికారులు ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అనుసరించి వీధి కుక్కలను సామూహిక హత్యలకు ఆదేశించారు. ఈ హింస జంతువుల ప్రవర్తన వల్ల కలిగింది కాదని, మానవ నిర్లక్ష్యం మరియు దీర్ఘకాలిక పరిపాలనా వైఫల్యం వల్ల జరిగిందని ఈ కూటమి పేర్కొంది.

హైదరాబాద్‌లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) నిర్వహిస్తున్న “కుక్కల తొలగింపు కార్యక్రమాలు” జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 మరియు జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నియమాలు, 2023లను ఉల్లంఘిస్తున్నాయని కూటమి గుర్తుచేసింది. తగినంతగా పశువైద్య మౌలిక సదుపాయాలు లేకుండా కుక్కలను విచక్షణారహితంగా బంధిస్తున్నారు. ఏబీసీ కేంద్రాలకు తీసుకెళ్లబడిన జంతువులను స్టెరిలైజ్ చేయటం లేదు.  చట్ట ప్రకారం వాటిని తప్పనిసరి గా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ అలా చేయటం లేదని విశ్వసనీయ నివేదికలు సూచిస్తున్నాయి.

తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఈ చర్యలు జరుగుతున్నాయి, ఈ అంశం విచారణలో ఉన్నంత వరకు స్టెరిలైజ్ చేసిన కుక్కలను పట్టుకోవద్దని జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. వైద్య కళాశాలలు మరియు విశ్వవిద్యాలయ ప్రాంగణాలతో సహా అనేక ప్రభుత్వ సంస్థలలో కుక్కలను  పట్టుకోవడమనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ఈ కేసులో కోర్టుకు హాజరైన న్యాయవాది శ్రీ రమ్య, ఇటువంటి చర్యలు కోర్టు ధిక్కారానికి సమానమని పేర్కొన్నారు.

మానవీయ మరియు శాస్త్రీయ జంతు జనాభా నిర్వహణకు మున్సిపల్ అధికారులు తమ చట్టబద్ధమైన బాధ్యత నుండి తప్పించుకోలేరని పునరుద్ఘాటిస్తూ జనవరి 13న సుప్రీంకోర్టు చేసిన పరిశీలనను కూడా ఈ కూటమి ఎత్తి చూపింది. “ఈ రోజు మన వీధుల్లో జరుగుతున్న సంఘర్షణ జంతువుల వైఫల్యం కాదు, దశాబ్దాల సంస్థాగత నిర్లక్ష్యం ఫలితం” అని కూటమి పేర్కొంది. పనిచేయని ఏబీసీ కేంద్రాలు, ఆడిట్‌లు చేయకపోవడం మరియు ధృవీకరించబడని లేదా “ఘోస్ట్ ” స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సల ద్వారా ప్రజా నిధుల దుర్వినియోగాన్ని ఉదహరించింది. 

ప్రజా ఆందోళనను ప్రస్తావిస్తూ, ముఖ్యంగా నిర్మాణ ప్రదేశాలు , అత్యంత రద్దీ నివాస కాలనీలలో కుటుంబాలు ఎదుర్కొంటున్న నిజమైన భయాన్ని కూటమి గుర్తించింది, మానవ భద్రత మరియు జంతు సంక్షేమం పోటీ ప్రాధాన్యతలు కాదని నొక్కి చెప్పింది. “ఒక పిల్లవాడు గాయపడినప్పుడు, అది వ్యవస్థ వైఫల్యం. కుక్కలను చంపడం వల్ల భద్రతను సృష్టించ బడదు, పాలనా వ్యవస్థలు సరిగా పనిచేసినప్పుడు మాత్రమే అది సృష్టించబడుతుంది” అని వెల్లడించింది. లేబర్ సైట్‌లలో తప్పనిసరిగా క్రెచ్‌లు ఏర్పాటు చేయటం, టీకాలు వేయడం , స్టెరిలైజేషన్ ద్వారా కుక్కల జనాభాను నియంత్రించటం, వ్యర్థ నిర్వహణ నిబంధనలను కఠినంగా అమలు చేయడం కోసం పిలుపునిచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ కింది అంశాల పట్ల తక్షణ చర్యలను తీసుకోవాల్సిందిగా కూటమి కోరుతుంది:
•       అన్ని అక్రమ వధ మరియు తరలింపు కార్యకలాపాలను వెంటనే నిలిపివేయడం
•       కోర్టు ఆదేశాలు మరియు ఏబీసీ  నియమాలు, 2023 కు పూర్తిగా కట్టుబడి ఉండటం. 
•       రాష్ట్ర మరియు జిల్లా జంతు సంక్షేమం మరియు ఏబిసి పర్యవేక్షణ కమిటీల పునర్నిర్మాణం
•       అన్ని ఏబిసి  కేంద్రాల స్వతంత్ర ఆడిట్‌లు మరియు పారదర్శక పనితీరు
•       వ్యర్థాల నిర్వహణ మరియు పెంపుడు జంతువుల బ్రీడింగ్ నిబంధనలను అమలు చేయటం
అంతేకాకుండా, పెరుగుతున్న ఉల్లంఘనలు మరియు చట్టాలను పాటించకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ విషయాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి మరియు సంబంధిత విభాగాల దృష్టికి తీసుకువెళ్లడంలో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ, ఈ కూటమి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరికి విడిగా విజ్ఞప్తి చేసింది. “ఇది ఉద్యమం కాదు. మనుషుల్లాగానే జంతువులకు కూడా సుపరిపాలన, చట్టబద్ధత మరియు ప్రజా భద్రత కోసం చేస్తున్న ఒక డిమాండ్ ” అని అని కూటమి పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -