Sunday, December 14, 2025
E-PAPER
Homeకథఅంజనమ్మ అమెరికా ప్రయాణం

అంజనమ్మ అమెరికా ప్రయాణం

- Advertisement -

ఆరోజు ఉదయం పెందలాడే నిద్ర లేచింది అంజనమ్మ. పనులు అన్ని చకచకా పూర్తి చేసింది. తీరిగ్గా పెరటి తోటలో విరగ్గాసిన వంకాయలను చూస్తూ…
”బుజ్జిముండలు ఎంత బావున్నాయో… వీటిని చక్కగా మధ్యలోకి కోసి వంకాయ పూర్ణం పెట్టుకుంటే ఎంత బావుంటుందో!” అంటూ చిన్న పిల్లలా మురిసిపోయింది.
ఒక్కో వంకాయను తెంపుతూ చీర కొంగులో వేసుకొంటూ, ఇంకేమైనా దొరుకుతాయేమోనని పొదలన్నీ వెతకసాగింది.
ఇంతలో కొడుకు కొత్తగా కొని పంపిన స్మార్ట్‌ ఫోను మోగింది. కానీ అంజనమ్మ పట్టించుకోలేదు.
ఫోను మళ్ళీ మోగింది.
”ముదనష్టపు ఫోను…” అనుకుంటూ లోపలికి వెళ్ళింది. తెంపిన వంకాయలు లోపలికి తీసుకెళ్లి పళ్ళెంలో పడబోసి ఫోను ఎత్తింది.
”హలో అమ్మ” అమెరికా నుండి కొడుకు మధుసూదన్‌.
‘ఇప్పుడు ఇంక అదేదో వీడియో కాల్‌ అంటాడు… బలవంతంగా కోడలి పలకరింపులు వినాలి. ఇంగ్లీషులో మనవడు, మనవరాలు ఏవేవో కబుర్లు చెబుతారు. వాళ్ళతో నేను ఇంగ్లీషులో మాట్లాడలేను, వాళ్ళూ తెలుగు మాట్లాడలేరు!’ అనుకుంటూ కొడుకుని బాధపెట్టడం ఇష్టం లేక..
”చెప్పురా మధు, ఎలా ఉన్నారందరూ? కులాసేనా అక్కడంతా? రోజా, పిల్లలు ఎలా ఉన్నారు?” అంటూ కుశల ప్రశ్నలు వేయసాగింది.
”మేమంతా బాగానే ఉన్నాం అమ్మ. కానీ నా దిగులంతా నీ గురించే…” నిట్టూరుస్తూ అన్నాడు మధుసూదన్‌.
”నాకేమైందిరా… దర్జాగా వుంటేనూ..!” అని కాసేపు ఇంకేవో కబుర్లు చెప్పుకొని ఫోన్‌ కట్‌ చేశారు ఇద్దరు.

నిశ్శబ్దంగా ఉంది రూమంతా. ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్‌ జరుగుతుంది. తన ప్లాన్‌ అంత వచ్చిన క్లైంట్స్‌కు వివరించి వాళ్ళ స్పందన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు మధుసూదన్‌.
కాలి బూట్ల శబ్ధం తప్ప ఇంకే అలికిడి లేదు ఆ రూములో. చుట్టు నిశ్శబ్దం. టేబుల్‌ పై ఉన్న మధుసూదన్‌ ఫోన్‌ రింగయింది. గజిబిజిగా ఫోన్‌ చేతిలోకి తీసుకొని కట్‌ చేసాడు. మళ్ళీ రింగయింది.
”సుధ… కట్‌ చేస్తుంటే ఎందుకని పదే పదే చేస్తున్నావ్‌?” చిందులు తొక్కాడు మధుసూదన్‌.
”అన్నయ్యా… అమ్మా….” ఫోనులో అవతలి నుండి చెల్లి సుధ రోదిస్తుంది.
”అమ్మ? అమ్మకి ఏమైంది?” కంగారు పడుతూనే మీటింగ్‌ మధ్యలోంచి లేచి రూం బయటికి వచ్చేసాడు మధుసూదన్‌.
”ఇవాళ పొద్దున అమ్మకి ఛాతిలో నొప్పి వస్తే పక్కింటి సుబ్బయ్య బాబారు ఊర్లో ఉండే ఆర్‌.ఎం.పి. డాక్టర్‌కి చూపించారట. సమస్య పెద్దదవ్వకముందే పెద్ద ఆసుపత్రికి తీసుకెళితే మంచిదని సలహా ఇవ్వడంతో అమ్మని హైదరాబాద్‌ తీసుకొచ్చారు” భోరుమంటు చెప్పసాగింది సుధ.
”అమ్మకేం కాలేదు కదా..?” మధుసూదన్‌ మాటల్లో తడబాటు.
”కేన్సర్‌ అంటున్నారు. స్టేజ్‌ త్రీ” సుధ మాటల్లో భయం స్పష్టంగా తెలుస్తోంది.
మధుసూదన్‌ ఇంకేం మాట్లాడలేదు. ఆఫీసులో వారం రోజులు సెలవు పెట్టి, దొరికిన ఫ్లైట్‌ ఎక్కి ఇండియాలో వాలిపోయాడు.
‘హాస్పిటల్‌ అడ్రసు వాట్సాప్‌ చేయి’ అన్న నోటిఫికేషన్‌తో ఫోను ఓపెన్‌ చేసింది సుధ.
‘ట్రస్ట్‌ మల్టీస్పెషలిటీ హాస్పిటల్‌. విరించి కన్సల్టెన్సీ ఆపోజిట్‌, కూకట్పల్లి.’ కీబోర్డులో టైప్‌ చేసి సెండ్‌ బటన్‌ నొక్కింది సుధ.
”కూకట్‌పల్లి వెళ్ళాలి” ఫోనులో వచ్చిన మెసేజ్‌ చూసి క్యాబ్‌ డ్రైవర్‌ తో చెప్పి కార్లో కూర్చున్నాడు మధుసూదన్‌.
హాస్పిటల్‌ కారిడార్‌లో తెల్లని గోడలు శుభ్రతతో మెరిసిపోతున్నాయి. తెల్ల రంగు సోఫాలో ముందుకు వాలి తలపట్టుక్కుర్చున్న సుధ, మధుసూదన్‌ను చూసి పరిగెత్తుకొచ్చింది.
”అన్నయ్య….” అంటూ కౌగిలించుకొని ఏడవసాగింది.
మధుసూదన్‌ ఓదారుస్తూ ఎదురుగుండా ఉన్న గ్లాస్‌ డోర్‌ నుంచి లోపల ఐసీయూలో పడుకున్న అంజనమ్మను చూస్తూ అలానే ఉండిపోయాడు కాసేపు.
”డాక్టర్‌ ఏమన్నారు? అమ్మ పరిస్థితి ఏంటి?” గుండెల్లోంచి దూసుకొస్తున్న బాధను ఆపుకుంటూ అడిగేడు మధుసూదన్‌.
”ప్రస్తుతం స్టేబుల్‌గానే ఉంది. పరవాలేదు. కానీ ట్రీట్మెంట్‌కి సహకరించట్లేదు. కీమో చేసిన ప్రయోజనాలేవి కనిపించడం లేదని అంటున్నారు” సుధ కన్నీళ్లతో చెప్పింది.
ఐసియూ లోంచి బయటికి వచ్చిన డాక్టర్‌తో పర్సనల్‌గా మాట్లాడేందుకు రూంలోకి తన వెనకే వెళ్ళాడు మధుసూదన్‌.
”ఇప్పటికే చాలా ఆలస్యమయిపోయిందండి. మాక్సిమం మూడు నాలుగు నెలలు అంతే! ఆమె వయసు, బాడీ కండీషన్‌ అన్నిటిని దష్టిలో పెట్టుకొని చాలా కేర్‌ తీసుకోవాలి. ఇక మీద ఆమెని ఒంటరిగా ఉంచకపోతేనే మంచిది” సూటిగా చెప్పేశాడు డాక్టర్‌.
మధుసూదన్‌కు మాత్రం ”ఆమెను ఇకపై ఒంటరిగా ఉంచకపోతేనే మంచిది” అనే మాటే లూప్‌లో ప్లే అవుతుంది.
ఐసీయూ నుంచి జనరల్‌ వార్డుకు షిఫ్ట్‌ చేసిన రెండో రోజుకి అంజనమ్మ ఆరోగ్యం కొంచెం పుంజుకుంది. చురుకుదనం చూపించింది.
”ఇప్పుడెలా ఉందమ్మ?” హాస్పిటల్‌ మంచం మీద వెనక్కి వాలి పడుకున్న తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు మధుసూదన్‌.
”పర్లేదు రా… కాస్త నలతగా ఉంది అంతే! ఎప్పుడూ డిశ్చార్జి చేస్తారంటా? త్వరగా ఇంటికి వెళ్లాలనుంది” అంది అంజనమ్మ.
”ఇంటికి కాదమ్మ నువ్వు నాతో అమెరికా రావాలి. ఇకపై నువ్వు మాతోనే ఉండాలి” మధుసూదన్‌ మొహంలో బాధ.
క్షణంపాటు ఏమి అర్థం కాలేదు అంజనమ్మకు, ‘మాములు జ్వరానికి వీడే అక్కడినుండి అనవసరంగా వచ్చాడనుకుంటే ఇప్పుడు నన్నూ రమ్మంటున్నాడెంటీ..?’ మనసులో మాట్లాడుకోసాగింది.
”అక్కడ అనుభవగ్యులైన డాక్టర్లు ఉంటారు. అత్యాధునిక పరికరాలతో నీకు హై స్టాండర్డ్స్‌ ట్రీట్మెంట్‌ ఇస్తారు. నువ్వే పనులు చేసుకొనక్కర్లేదు. నీకు అన్ని పనులు చేసి పెడతారు. ఇకపై నీకు ఎలాంటి కష్టం ఉండదు అమ్మ!” మధుసూదన్‌ బాధ్యతా పూరితమైన మాటలు అంజనమ్మకు అర్ధం కాలేదు.
”నేను అమెరికా వచ్చేస్తే మరి మన పెంకుటిల్లు? తులసి కోట..? పెరడు, ఆవు, దూడలు ఇవన్నీ ఎలా?” అంది. ఇన్నేళ్లు తనతో పాటే మమేకమై సావాసం చేసిన వాటిని వదిలిపెట్టడం ఇష్టం లేక.
”అవన్నీ ఎక్కడికి పోవు… ఇన్నేళ్లు వాటినే చూసుకుంటూ బతికేశావ్‌. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకోవాలి” మధుసూదన్‌ మాటల్లో పదును.
అంజనమ్మ మౌనంగా తల వంచింది. ఆరోజు సాయంత్రమే అంజనమ్మను డిశ్చార్జి చేశారు. కూతురు సుధ మొగుడు వెంటనే రావాలని ఆర్డరు వేయడంతో గతిలేక అంజనమ్మను బాధగా కౌగిలించుకొని నాలుగున్నర ఫ్లైట్‌కి బెంగళూరు వెళ్ళిపోయింది.
కొడుకుతో పాటు కారులో ఊరికి బయలుదేరింది అంజనమ్మ. రెండు రోజుల తర్వాత ఇంటి గుమ్మంలో అడుగుపెట్టగానే కొత్తగా మళ్ళీ ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపించింది.
భర్త పరంధామయ్య నాటిన మామిడి చెట్టు కొన్నేళ్లుగా తనకి మామిడి పళ్ళును ఇస్తూనే ఉంది.
‘ఈ వేసవికి కాయలు కాసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అంటూ చెట్టు తనతో చెప్తున్నట్లు అనిపించింది అంజనమ్మకు.
భర్త చనిపోయాక పిల్లలిద్దరూ ఒక్కొకరిగా దూరమైపోయారు. తనకు తోడుగా ఉంది ఆ పెంకుటిల్లు మాత్రమే.
ఆవులు, వాటికి పుట్టిన దూడలు అంజనమ్మపై ఎంతో మమకారం పెంచుకున్నాయి. ఏరోజూ తనని కష్టపెట్టలేదు, ఒంటరిగా విడిచి పెట్టలేదు.
‘రోజు ఉదయాన్నే ఇంటి వెనుక ఉన్న పెరడు పిలుస్తుంది… అమెరికాకి వెళ్తే నన్నెవరు పిలుస్తారు?’
‘తీరొక్క పువ్వులతో రోజు పూజ గదిలో మునిగిపోయి స్వేచ్ఛగా పూజ చేసుకునే నేనూ అక్కడ ఆ ఇరుకు గదులలో చేసుకోగలనా?’
ఇక్కడ, అప్పుడే పెరడులో కాసిన తాజా కూరగాయలతో వండుకుని తినే నేను అక్కడ రోజుల తరబడి ఫ్రిడ్జ్‌లో నిలువ వుంచిన కూరలు తినగలనా?’
‘నేను అమెరికా వెళ్ళిపోతే ఈ ఆవులు, దూడలు బెంగపెట్టుకోవూ…?
‘కోళ్లన్నీ ఏమైపోతాయి? వాటిని ఎవరు చూసుకుంటారు?’ అంటూ ఆలోచనల్లో మునిగిపోయింది అంజనమ్మ.
”అమ్మా….” అన్న కొడుకు పిలుపుతో తిరిగి ఈ లోకంలోకి అడుగుపెట్టింది.
”రేపు ఉదయమే ప్రయాణం… ఇద్దరికీ రెండు టిక్కెట్లు తీశాను. పక్కింటి సుబ్బయ్య బాబాయితో మాట్లాడాను, ఆవును, దూడలను మంచి బేరానికే అమ్మేస్తాను అన్నాడు. కోళ్ళను చికెన్‌ షాప్‌లో అమ్మేయమని చెప్పేశాను.”
కొడుకు అలా చెప్తుంటే తన వొంట్లో నుండి ఒక్కో భాగం బలవంతంగా వేరు చేస్తున్నట్లుగా అనిపించింది అంజనమ్మకు.
అంజనమ్మ గుండె బరువెక్కింది, కళ్ళు నీరెక్కాయి… నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళి మంచంలో కూలబడింది.
అంజనమ్మ మొండితనం గురించి తెలిసిన మధుసూదన్‌ ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. అతనికి తెలుసు ఇవన్నీ వదిలి పెట్టి తనతో అమెరికా రావడానికి తను ఇష్టపడదని.
కానీ ఇప్పుడు తనకి వీటికన్నా తన ఆరోగ్యం ముఖ్యం. ఇక్కడ తనకి సపర్యలు చేస్తూ ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉన్న అతనంత జాగ్రత్తాగా చూసుకోరు. అని అతని అభిప్రాయం.
ఆలోచనలతోనే తెల్లారింది… కోడి కూతతో నిద్ర లేచిన మధుసూదన్‌ ఆరోజు ఫోనులో మోగాల్సిన అలారం ఆఫ్‌ చేసాడు. అప్పటికే అంజనమ్మ లేచి వరండాలో ఏకాంతంగా కూర్చొని ఉంది.
”అమ్మా…” అంజనమ్మ వెనకాలే నిలబడి పిలిచాడు మధుసూదన్‌.
”ఎప్పుడు బయలుదేరాలి మధు?” అడిగింది అంజనమ్మ.
మధుసూదన్‌ మొహంలో ఆశ్చర్యం. ఇది కలా? నిజమా? నేను భ్రమ పడడం లేదు కదా..! అని అనుకుంటూనే..
”సాయంత్రం నాలుగు గంటలకు మన ఫ్లైటు. ఇక్కడి నుండి ఒంటి గంటకు బయలుదేరితే చాలు” మధుసూదన్‌ పెదాలపై చిరు నవ్వు విరబూసింది.
అంజనమ్మ ఆఖరిసారిగా వాకిలంతా ఊడ్చి, పేడ నీళ్లతో కల్లాపు జల్లింది. అందంగా ముగ్గులు పెట్టింది. కోళ్లకు నూకలు జల్లింది.
కొట్టంలో నుండి ఆబగా తన వంకే చూస్తున్న ఆవుల దగ్గరికి వెళ్ళి చుబుకం తడిమింది. లేత దూడలను కౌగిలించుకుని ఆప్యాయంగా ఏవో కబుర్లు చెప్పింది.
‘కావల్సినంత తినండి’ అంటూ మోపెడు గడ్డి తెచ్చి వాటి ముందు పడేసింది. తౌడు కలిపిన నీళ్లను గడ్డి పక్కనే పెట్టింది.
అరవై ఏళ్ళ అంజనమ్మ చలాకీగా ఇవన్నీ చేస్తూ ఉంటే వరండాలో నిల్చొని ఆశ్చర్యపోతూ చూసాడు మధుసూదన్‌. తనతో రావడానికి అస్సలు ఒప్పుకోదు అనుకున్న అంజనమ్మ ఇంత తేలిగ్గా మారు మాట్లాడకుండా తనతో అమెరికా రావడానికి అంగీకరిస్తుంది అని అతడు కలలో కూడా ఊహించలేదు.
పాత కాటన్‌ చీరలు నాలుగు, భర్త ఫొటో ఫ్రేం, ఇంకేవో వస్తువులు సంచిలో పెట్టుకుంది.
ఎప్పడూ తాళం కప్ప ఎరుగని గుమ్మం తలుపులు బాధగా అంజనమ్మ వైపు చూస్తున్నట్టు అనిపించసాగింది ఆమెకు.
‘ఇంకెప్పటికీ రావా అంజనమ్మా…?’ అంటూ కన్నీళ్లతో తనకు వీడ్కోలు చెబుతున్నట్టుగా అనిపించింది.
గుండెల్లో బాధను దిగమింగుకుని గుమ్మం దాటింది అంజనమ్మ. మధుసూదన్‌ బలంగా పెద్ద గుమ్మం తలుపులు మూసేసాడు.
పక్కింటి వాళ్ళని, ఎదురింటివాళ్ళాని అప్పుడప్పుడు ఇంటి వైపు చూడమని చెప్పింది. చివరిసారిగా అందర్నీ పలకరించి, కడసారి వీడ్కోలు పలుకుతూ భారంగా కారు ఎక్కింది.
కిటికీ అద్దంలోంచి పూల మొక్కలు, దూడలు అంజనమ్మ వైపు బాధగా చూస్తున్నట్టు అనిపించింది.
మట్టి రోడ్డు గుండా కారు పొలిమేర దాటింది. ఊరి స్మతులను అంజనమ్మ పదిలంగా తన గుండెల్లో దాచుకుంది.
కారు వేగంగా ముందుకు సాగుతుంది…
అంజనమ్మ తనకి తెలియకుండానే కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది.
కారు విమానాశ్రయం చేరుకుంది, తను ఎక్కాల్సిన ఫ్లైట్‌ గాల్లో ఎగరడానికి సిద్ధంగా ఉంది. ఆ తరువాత కూడా చాలా విమానాలు వచ్చి, వెళ్ళిపోయాయి. అయినా అంజనమ్మ కళ్ళు తెరవలేదు.

– రాజు యెదుగిరి, 9963485370

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -