Wednesday, November 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅన్నదాత ఆగం

అన్నదాత ఆగం

- Advertisement -

– అకాల వర్షానికి తడిసిన పత్తి, మొక్కజొన్న
– తాజా వర్షంతో మరోసారి ముంపు భయం
నవతెలంగాణ-కాశిబుగ్గ

గతవారం కురిసిన మొంథా తుఫాన్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు మంగళవారం కురిసిన కుండపోత వర్షంతో మరోసారి ముంపు భయం పట్టుకుంది. అకాల వర్షానికి వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. మంగళవారం ఉదయం ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అరగంట పాటు కురిసిన ఈ కుండపోత వర్షానికి మార్కెట్‌ లో ఆరబోసిన మక్కలు నీటిలో కొట్టుకుపోయాయి. మార్కెట్‌ అధికారులు సకాలంలో పరదాలు ఇవ్వకపోవడం వల్లనే తమ ధాన్యం తడిసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 27న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా సీసీఐ, మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు మార్క్‌ఫెడ్‌ ద్వారా మక్కలు మాత్రం కొనుగోలు చేయడం లేదు. సీసీఐ కూడా నామమాత్రంగా కేవలం 2771 క్వింటాళ్లు పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. ఎనుమాముల మార్కెట్‌కు మంగళవారం మొత్తం పత్తి 5000 బస్తాలు రాగా మార్కెట్‌ అధికారులు సకాలంలో పరదాలు ఇవ్వకపోవడం వల్ల సుమారు 2000 బస్తాలు తడిసిపోయాయి. అక్టోబర్‌ మొదటి వారం నుంచి ఇప్పటివరకు కొత్త పత్తి మొత్తం 57,863 క్వింటాళ్లు రాగా గరిష్టంగా ధర రూ. 6920, కనిష్ట ధర రూ.5,000 పలకగా మోడల్‌ ధర రూ.6300 పలికింది.

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి : కౌసల్య, ఎర్రగుంట తండా, పాలకుర్తి, జనగామ
70 బస్తాల మక్కలను గత శనివారం మార్కెట్‌కు తీసుకువచ్చాను. నాలుగు రోజులుగా మార్కెట్‌లోనే మక్కలను ఆరబెట్టుకుంటున్న. ప్రయివేట్‌ వ్యాపారులు తేమశాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేస్తలేరు. ఇప్పుడు కురిసిన వర్షం వల్ల మక్కలు నీటిలో కొట్టుకుపోయాయి. తడిసిన మక్కలను ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి.

సకాలంలో పరదాలు ఇయ్యలే : లకావత్‌ సొమ్ల, బమ్మెర, పాలకుర్తి జనగామ
మూడు రోజుల క్రితం 30 బస్తాల మక్కలు తీసుకువచ్చాను. మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి మొత్తం తడిశాయి. అధికారులు సకాలంలో పరదాలు ఇవ్వకపోవడం వల్లనే పంట మొత్తం తడిసి వర్షంలో కొట్టుకుపోయింది. అధికారులు తేమ 14శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు.

ఈసారి పెట్టుబడులు వచ్చుడు కష్టమే : శ్రీశైలం, మనుగొండ, గీసుగొండ వరంగల్‌
మార్కెట్‌కు 18 బస్తాల పత్తి తీసుకువచ్చాను. ధర రూ.6700 పలికింది. ఎకరానికి 10 క్వింటాళ్లు రావలసిన పత్తి.. ఈ ఏడాది 4-5 క్వింటాళ్లు వచ్చుడే కష్టంగా ఉంది. ఒక్కో కూలీకి రూ.400 ఇచ్చి పత్తి ఏరిచ్చిన. ఏరిన కూలీ వచ్చినా చాలు అనుకుంటున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -