మంత్రి తుమ్మల విజ్ఞప్తితో రాష్ట్రానికి యూరియా సరఫరా
ఉత్తర్వులను జారీ చేసిన రసాయనాలు, ఎరువుల శాఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రానికి మరో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా రానుంది. ఉత్తర్వులను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ జారీ చేసింది. మరో ఐదు ఓడల నుంచి తెలంగాణకు యూరియా కేటాయింపులు రానుంది. మొత్తం ఈ వారంలో రాష్ట్రానికి 80 వేల టన్నుల సరఫరా చేయనున్నారు. సెప్టెంబర్ నెలలో మొదటి 15 రోజుల్లో 1.4 లక్షల టన్నులు సరఫరా చేస్తారు. తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను ఈ పది రోజుల్లోనే సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను సోమవారం కోరారు. తెలంగాణ రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తెలంగాణలో సాగులో ఉన్న ప్రధాన పంటలు.. వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరం.
ఈ పది, పదిహేను రోజులు అత్యంత కీలకమైనందున.. తెలంగాణ రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కోరాం. అలాగే అంతకు ముందు నెలల్లో ఏర్పడిన యూరియా లోటును పూడ్చే విధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరాం. సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు లక్షా 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా చేశారు. రానున్న 10 రోజుల్లో మరో లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కోరగా.. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో.. విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపిన రజత్ కుమార్ మిశ్రా.. 40 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ వారంలో సరఫరా అయ్యే 40 వేల మెట్రిక్ టన్నులకు ఇది అదనం’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
వివిధ పోర్టులకు ఓడల ద్వారా తెలంగాణకు కేటాయింపులు
మంగళూరు, ఎంవీ రెక్ గ్రేస్-2700
కాకినాడ, ఎంవీ జీఎన్ రూబి-8100
కాకినాడ, ఎంవీ గ్రేస్ ఆర్మోనీ- 7800
కష్ణపట్నం, ఎంవీ ఎన్డీవర్-13000
జైగఢ్, ఎంవీ వాడి అల్బోస్టాన్-8100