దానం నాగేందర్ రాజీనామా ?…కాంగ్రెస్ వ్యూహరచన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అధికార కాంగ్రెస్ వ్యూహారచన చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ స్థాయిలో మంతనాలు సాగుతున్నాయి. ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి ఈ వ్యవహారం వెళ్లినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఒకరు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ చేస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వాదనలతోపాటు క్రాస్‌ఎగ్జామినేషన్ నడుస్తున్నది. వీరందరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానం నాగేందర్ అధికారికంగా పార్టీ మారినట్టేనని న్యాయనిపుణులు చెబుతున్నట్టు తెలిసింది. ఆయన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన విషయం విదితమే. దీంతో ఆయనపై అనర్హత వేటు పడే పరిస్థితులు ఉన్నాయని సమాచారం. ఈనేపథంలో కాంగ్రెస్ అధిష్టానంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బి.మహేష్‌కుమార్‌గౌడ్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో చర్చించినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అనర్హత వేటు వేయకముందే రాజీనామా చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. తుది నిర్ణయం సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటారనే ప్రచారం కాంగ్రెస్ తరగతుల్లో జరుగుతున్నది. ఆయనతో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం.



