– అసలు అది నెయ్యేకాదు
– ఎజిని పిలిపించి తదుపరి కార్యాచరణపై చర్చ
– దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం : ఏపీ
మంత్రులు పయ్యావుల, కొలుసు, నాదెండ్ల, సత్యకుమార్
అమరావతి : తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, సిబిఐ ఇచ్చిన నివేదిక, సిఐబి సమర్పించిన ఛార్జిషీటు, ప్రభుత్వానికి ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునేందుకు పరిపాలనా కమిటీని వేస్తున్నట్లు మంత్రులు పయ్యావుల కేశవ్, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. అయితే తొలుత ప్రతిపాదించిన ఏజెండాను పక్కనబెట్టి తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చించారు. తొలుత డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌తో మాట్లాడిన అనంతరం మంత్రులతోనూ మాట్లాడారు. ఛార్జిషీటు, సిఐబి ఇచ్చిన నివేదిక, అనుబంధ ఛార్జిషీట్లు పరిశీలించి ఏమి చేయాలనే అంశంపై మాట్లాడేందుకు అడ్వకేట్ జనరల్‌నూ పిలిపించారు. ఆయనతోనూ క్యాబినెట్లో వివరణ తీసుకున్నారు. సిట్ ఇచ్చిన నివేదికపై సిఎం మంత్రులకు వివరించారు. ఎక్కడ ఎలా కల్తీ చేశారు. డాక్యుమెంట్లు ఎలా మార్చారు. అధికారుల పాత్ర, తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయాలు ఉండాలన్న అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం చర్చల వివరాలను సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాకు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రను కాపాడటమే ప్రథమ ధ్యేయమని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగానే అనిల్‌కుమార్ సింఘాల్‌ను బదిలీ చేశామని తెలిపారు. అప్పటి ఛైర్మన్‌గా ఉన్న సుబ్బారెడ్డి వ్యవహారం తేల్చేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో విచారించిన సిట్ ఛార్జిషీటు, అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసిందని, ఒక నివేదికను 11పేజీల్లో ప్రభుత్వానికి సమర్పించిందని పేర్కొన్నారు. కోర్టు ఛార్జిషీటును అధికారికంగా కాగ్నిజెన్స్‌లోకి తీసుకున్న తరువాత అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. సమర్పించిన నివేదికలో తిరుమలకు సరఫరా చేసిన ట్యాంకర్లలోనూ, టిన్లలోనూ అసలు నెయ్యిలేదని తెలిపారు. నెయ్యి సరఫరా, టెండర్ల నిబంధనల సడలింపు, నాణ్యతాలోపాలు, తప్పుడు పత్రాల సమర్పణ వంటి తీవ్రమైన అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందన్నారు. 2019 తరువాత టెండర్లకు, నాణ్యతా పరిశీలనకు అనవసర సడలింపులు ఇచ్చారని, రూ.250 కోట్ల టర్నోవర్ స్థాయిని రూ.150 కోట్లకు తగ్గించారని పేర్కొన్నారు. పాలు కొనుగోలు చేయలేకపోయినా అర్హత కల్పించడం వంటి చర్యలు ఉద్దేశపూర్వకంగా చేశారని వివరించారు. నెయ్యి నమూనాలను పరిశీలించిన ఎన్‌డిడిబి, సిఎఎల్‌ఎఫ్ ల్యాడ్ నివేదికల్లో కల్తీపదార్థాలు, సోయాబీన్, సన్‌ఫ్లవర్ రేప్‌సీడ్, కాటన్‌సీడ్, షిప్‌అయిల్, బీఫ్‌టాలో, లార్డ్ మొదలైనవి ఉండేందుకు అవకాశం ఉన్నట్లు తేలిందన్నారు. సిటిఆర్‌ఎఫ్‌ఐ ల్యాడ్ ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోలేదని సుమారు రూ.58 లక్షల లీటర్ల వరకూ కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు నివేదికలో వెల్లడించారని తెలిపారు. టెండర్లలో పాల్గొన్న పలు సంస్థలు తప్పుడు పత్రాలతో వేర్వేరు సంస్థల పేర్లతో టెండర్లలో పాల్గొన్నాయని వివరించారు. దీనిపై అప్పటి ఎఈఓ ధర్మారెడ్డి, అనిల్‌కుమార్ సింఘాల్, బాలాజీ వంటి సీనియర్ అధికారుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయని పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని క్యాబినెట్లో నిర్ణయించినట్ల తెలిపారు. దీన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు స్వల్పకాలిక పరిపాలనా కమిటీని వేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ నిర్ణీత కాలవ్యవథిలో విచారణ పూర్తిచేసి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుందని తెలిపారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తిరుమల దేవస్థానం పవిత్రతకు భంగంగ కలిగించిన కల్తీ నెయ్యి వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించి అక్కడకు వచ్చేవారి మనోభావాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు.
వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ సృష్టికి విరుద్ధంగా పాలు లేకుండా నెయ్యి తయారు చేశారని అన్నారు. సిట్ వేదికలో అప్పటి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది సూచించలేదని, దీనిపై ప్రభుత్వ ఏర్పాటు చేసే కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పయ్యావుల సమాధానం ఇచ్చారు. కల్తీ జరిగింది నిజమని, ఏ రూపాల్లో జరిగిందనేది నివేదికల్లో ఉందని, అయితే ఛార్జిషీటు పూర్తిగా పరిశీలించి న్యాయపరమైన సలహాల అనంతరం ముందుకు వెళతామని తెలిపారు.
‘లడ్డు’పై మరో కమిటీ
- Advertisement -
- Advertisement -



