Saturday, November 15, 2025
E-PAPER
Homeజాతీయంమరో అప్పు

మరో అప్పు

- Advertisement -

రాజధాని కోసం మొత్తం రూ.40 వేల కోట్లు
అమరావతి : రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది. ప్రపంచ బ్యాంకు, హడ్కో, ఎబిడితోపాటు ఇతర రుణాలు ఇప్పటికే తీసుకున్న ప్రభుత్వం వేర్వేరు సంస్థల నుంచి మరో రూ.9 వేలకోట్లు తీసుకుంటోంది. దీంతో మొత్తంగా రాజధాని అమరావతి అప్పు దాదాపు రూ.40 వేలకోట్లకు చేరింది. భవిష్యత్‌లో భూమి విలువలు పెరిగితే వాటిని అమ్మి అప్పులు తీరుస్తామని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కష్టంగానే మారొచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేలకోట్లు తీసుకున్నారు. హోడ్కో నుంచి రూ.7 వేలకోట్లు, బ్యాంకుల కన్సార్టియం, వేర్వేరు సంస్థల నుంచి రూ.7 వేలకోట్లు తీసుకున్నారు.

ఇవి కాకుండా అంతకుముందు తీసుకున్న మరో రూ.5 వేలకోట్ల అప్పు కొనసాగుతోంది. దానికి ఇప్పటికీ వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు. వీటితోపాటు కొత్తగా నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌బిఎఫ్‌ఐడి) నుంచి రూ.7,500 కోట్లు తీసుకున్నారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా అందాయి. వీటితో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు కట్టాలని నిర్ణయించారు. అలాగే కొత్తగా పెనుమాక, ఉండవల్లి, కృష్ణాయపాలెం పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకూ వినియోగించనున్నారు. ఇవి కాకుండా పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.1500 కోట్లు తీసుకుంటున్నారు. వీటికి ప్రభుత్వం గ్యారంటీ కూడా ఇచ్చింది. ఇప్పటికే హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి కొత్త వడ్డీ కూడా కడుతున్నారు. ఇవి కాకుండా బాండ్ల రూపంలో మరికొన్ని రుణాలు తీసుకున్నారు. ఇన్ని రూపాల్లో అప్పులు తీసుకుంటున్న సిఆర్‌డిఎ వాటిని తీర్చేందుకు రాజధాని నుంచి వచ్చే యూజర్‌ ఛార్జీలు, ఇతరత్రా పన్నుల నుంచి చెల్లిస్తామని పేర్కొంది.

వాస్తవంగా అంత ఆదాయం రాకపోతే పట్టణాభివృద్ధిశాఖ నుంచి వీటి పన్నులు కట్టాల్సి ఉంటుంది. దీనికితోడు అదనంగా విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించారు. దీనికి ఎస్‌పివి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సిబ్బంది, ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలకు మరికొంత ఖర్చవుతుంది. దాని కోసమూ అదనంగా అప్పులు తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇప్పుడు ఏర్పాటు చేస్తే నిర్మాణాలకు సంబంధించి నిర్వహణ వ్యయం కూడా ఉంటుంది. వాస్తవంగా మొదటి దశలో చేపట్టే పనులకు రూ.64 వేలకోట్లు ఖర్చవుతాయని గతంలో అంచనా వేస్తే ప్రస్తుతం అవి రూ.లక్ష కోట్లకు చేరుతున్నాయి. పెరుగుతున్న అంచనాలతోపాటు అప్పులు కూడా పెరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -