ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

In Chhattisgarh Encounter again– 8 మంది మావోయిస్టులు మృతి
– ప్రాణాలు కోల్పోయిన జవాన్‌.. మరో ముగ్గురికి గాయాలు
– నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఘటన
– ఈ ఏడాది ఇప్పటి వరకు 131 మంది మృతి
రారుపూర్‌ : ఛత్తీస్‌గడ్‌లో పోలీసులు-మావోయిస్టుల మధ్య వరుస ఎన్‌కౌంటర్లు ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా నారాయణ్‌పూర్‌ జిల్లాలోని కుతుల్‌, ఫరస్‌ భేడ, దంతెవాడ, కొడతమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలు అయినట్టు సమాచారం. కాల్పుల తీవ్రతను బట్టి చూస్తే భారీగానే మావోయిస్టులు చనిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 12 నుంచి అబూజ్‌మడ్‌ అడవుల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్‌ను చేపట్టటానికి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఉదయం 7 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైందని చెప్పారు. నితేశ్‌ అనే జవాన్‌ చనిపోగా, అయెక్క(27), కైలాశ్‌ నేతమ్‌ (33), లెఖ్రామ్‌ నేతమ్‌ (28)లకు గాయాలైనట్టు తెలిపారు. కాగా, మావోయిస్టుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
వరుస ఎన్‌కౌంటర్లతో ఛత్తీస్‌గడ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నది. గత రెండు నెలల వ్యవధిలోనే అబూజ్‌మడ్‌ అడవుల్లో వరుసగా భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. నక్సలైట్ల ఏరివేతే లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాలు నారాయణ్‌పూర్‌, కొండగావ్‌, కాంకెర్‌, దంతేవాడలకు చెందిన రిజర్వ్‌ గార్డ్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది మార్చి 27న బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఏప్రిల్‌ 2న బీజాపూర్‌లోని గంగలూరు ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్‌ 16న కంకేర్‌లో 29 మంది, ఏప్రిల్‌ 30న అబూజ్‌మడ్‌లోని టెక్‌మెటాలో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. మే 10న బీజాపూర్‌ జిల్లాలోని పీడియాలో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇలా ఈ మూడు నెలల్లోనే వందమంది వరకు మావోయిస్టులు హతమై ఉంటారన్న అంచనాలున్నాయి.మావోయిస్టుల ఏరివేత పేరుతో అడవుల్లో బలగాల మోహరింపు తీవ్రమైంది. దీంతో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య వ్యూహ, ప్రతివ్యూహాలతో ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో టెన్షన్‌ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌ అడవులను బలగాలు చుట్టుముట్టాయి. గడిచిన ఆరు నెలల్లో 11 ఎన్‌కౌంటర్లలో 119 మంది మావోయిస్టులు చనిపోయారు. 2019 నుంచి వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు అధిక సంఖ్యలో నేలకొరుగుతున్నారు. అలాగే, ఎన్‌కౌంటర్లలో మావోయిస్ట్‌ అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతుండటం వారికి మరింత ఆందోళన కలిగిస్తున్నది.2019లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 65మంది మావోయిస్టులు చనిపోయారు. 2020లో 36మంది, 2021లో 47మంది, 2022లో 30మంది, 2023లో 24మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఇప్పటివరకు 131 మంది వరకు మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతం అయ్యారని లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇదే సమయంలో 22 మంది పౌరులు, 10 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం.రెండేండ్ల క్రిందటి కేంద్ర హౌంశాఖ లెక్కల ప్రకారం.. అబూజ్‌మడ్‌ అడవుల్లో 450మంది మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, ఈ రెండు మూడేండ్లలో దాదాపు 350మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర హౌంశాఖ అంచనాల ప్రకారం ఇంకో 150 మంది మావోయిస్టులే ఉన్నట్టు అర్థమవుతున్నది. ఆ 150 మందిలో ఉన్నదంతా మావోయిస్ట్‌ పార్టీ టాప్‌ లీడర్లేనన్న ప్రచారం జరుగుతున్నది. వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలు, వయస్సురీత్య ఇబ్బంది పడుతున్నట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Spread the love