Sunday, May 25, 2025
Homeజాతీయంజార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

- Advertisement -


మావోయిస్టు అగ్రనేత పప్పూ లోహరా మృతి
ఆయనపై రూ.10 లక్షల రివార్డు
మరొక కీలక నేత ప్రభాత్‌ గంజ్‌ కూడా..
రాంచీ :
జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్నది. లతేహార్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, జార్ఖండ్‌ జన ముక్తి పరిషత్‌ (జేజేఎంపీ) అధినేత పప్పూ లోహరాతో పాటు మరో కీలక నాయకుడు ప్రభాత్‌ గంజ్‌ కూడా మరణించారు. ఈ ఘటనలో ఒక భద్రతా దళ సిబ్బంది కూడా గాయపడినట్టు అధికారులు చెప్తున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… లతేహార్‌లోని ఇచాబార్‌ అడవిలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురుకాల్పుల్లో పప్పూ లోహరా మృతి చెందాడు. ఈయన తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. ఇదే ఎన్‌కౌంటర్‌లో జేజేఎంపీ మరో నేత, మావోయిస్టు కీలక నాయకుడు ప్రభాత్‌ గంజ్‌ కూడా చనిపోయాడు. ప్రభాత్‌ గంజ్‌పై రూ.5 లక్షల రివార్డు ఉన్నది. కాగా, ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన ఇంకో మావోయిస్టు సజీవంగా పట్టుబడ్డాడు. పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసి ఆయన నుంచి రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు. చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేతకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇక ఛత్తీస్‌గఢ్‌లోనూ మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాల చర్యలు కొనసాగుతున్నాయి. బీజాపూర్‌ జిల్లాలో 24 మంది లొంగిపోయినట్టు అధికారులు తెలిపారు. బస్తర్‌ ప్రాంతంలో 33 మంది మావోయిస్టులు సరెండర్‌ అయ్యారని వివరించారు. వీరిలో 24 మందిపై రూ.91 లక్షల రివార్డు ఉన్నదని చెప్పారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజ్‌ కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. శుక్రవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లోనూ నలుగురు మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -