– ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న పరిశ్రమ వర్గాలు, అధికారులు
– అగ్ని ప్రమాదాలు పునరావృతమవుతున్నా పట్టింపు లేని యజమాన్యాలు, అధికారులు
నవతెలంగాణ-పటాన్‌చెరు
పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమ ఘోర ప్రమాదం కండ్ల ముందు నుంచి మరవకముందే ఆదివారం మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లో కెళితే.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామిక వాడలోని ఎన్వీరో వేస్ట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో ఫార్మా, ఆస్పత్రులు, రసాయనాల పరిశ్రమల నుంచి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేశారు. ఇలా పరిశ్రమలో ఆదివారం ఉదయం లారీ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను అన్‌లోడ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు వెదజిమ్ముతూ ఆ ప్రాంతమంతా మంటలు, పొగలు కమ్ముకోవడంతో పారిశ్రామిక వాడ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని పూర్వాపరాలను పరిశీలించారు. ఈ సంఘటనలో ఒక లారీ దగ్థమవటం మినహా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. పరిశ్రమలో మంటలు ఎగిసిపడటంపై షార్ట్ సర్క్యూట్, మరేదైనా కారణమా అనే కోణంలో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో ఇటు పరిశ్రమ వర్గాలు, అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదం సంఘటన మరచిపోకముందే మరో పరిశ్రమలో అలాంటి ప్రమాదమే చోటు చేసుకోవడంతో కార్మికులు భయందోళనకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదాలు పునరావృతం అవుతున్నా యజమా న్యాలు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ, కార్మాగార యాజమాన్య బాధ్యతలు, కార్మికుల రక్షణ వంటి ఆంశాలపై పరిశ్రమల శాఖ అధికారులు, ప్రభుత్వం అవలంబించే విధానాలను కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -