Tuesday, July 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమరో రూపంలో రైతు వ్యతిరేక నల్లచట్టాలు

మరో రూపంలో రైతు వ్యతిరేక నల్లచట్టాలు

- Advertisement -

– మహారాష్ట్రలో 760 మంది రైతులు మృతి
– 12 గంటల శ్రమ దోపిడీని అడ్డుకుంటాం
– వాగ్దానాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
– 9న దేశవ్యాప్త సమ్మెకు ఊరూవాడా కదలాలి :
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం
– 12 గంటల పని జీవో కాపీలు దహనం
– ఇబ్రహీంపట్నంలో ప్రజా సంఘాల జిల్లా సదస్సు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

మూడు నల్ల చట్టాలను ప్రజా ఉద్యమాలకు తలొగ్గి రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని మరో రూపంలో అమలు చేసేందుకు పూనుకుంటోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం అన్నారు. 12 గంటల పని విధానంపై జీవో తెస్తూ కార్మిక శ్రమదోపిడీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా స్థాయి సమావేశం ఇబ్రహీంపట్నం పాషా, నరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. ఈ సదస్సులో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌తో కలిసి తమ్మినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. మోడీ పాలనలో తెచ్చిన నల్ల చట్టాలపై పోరాటంలో 760 మంది రైతులు మృతి చెందారని తెలిపారు. వ్యవసాయ రంగంతో పాటు వివిధ వృత్తులను నాశనం చేసేందుకు విదేశీ వస్తువులపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసేందుకు అమెరికాతో మోడీ ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అన్నారు. ఇదే అమలైతే దేశంలోని వ్యాపార వర్గాలు, వ్యవసాయ రంగం, పరిశ్రమలు పూర్తిగా నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కావడం లేదన్నారు. తాను 1997లో ఎంపీగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించినట్టు గుర్తు చేశారు. నేటికి 25 ఏండ్లు పూర్తయినా పాలక ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్నా వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న రూ.12 వేలు అమలుకు నోచుకోలేదన్నారు. వ్యవసాయ కార్మికులున్న కుటుంబాలు 43 లక్షలుంటే, 5లక్షల కుటుంబాలకే ఇస్తామని, అది కూడా రూ.6వేల చొప్పున అందజేస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ప్రతి మహిళకూ నెలకు రూ.2500 ఆర్థిక సాయం ఇవ్వడం లేదన్నారు. కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని ఎందుకు మరిచిందని ప్రశ్నించారు. దేశంలో వృత్తులు దెబ్బతింటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఉద్యోగాల కల్పన అటకెక్కిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెకు ఊరూవాడా కదిలి రావాలని పిలుపునిచ్చారు.


స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) శ్రేణులకు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్టీ మూడుసార్లు ఎమ్మెల్యే సీటు గెలిచిందన్నారు. కొన్ని మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుని చక్రం తిప్పిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఒంటరి పోరు చేసేందుకైనా సిద్ధం కావాలన్నారు. ఎన్నికల్లో లౌకిక, ప్రజాతంత్ర శక్తులను కలుపుకునిపోతామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పగడాల యాదయ్య, చంద్రమోహన్‌, మధుసూదన్‌ రెడ్డి, కందుకూరి జగన్‌, సుమలత, కవిత, ప్రకాష్‌ కరత్‌, శంకర్‌, పంది జగన్‌, గణేష్‌, విజయమ్మ, సామెల్‌, ప్రణరు, నరసింహ, అంజయ్య, రామచందర్‌, జంగయ్య బుగ్గ రాములు ఎల్లేశం, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -