ఏడుగురు ప్రతిపక్ష సీఎంల పదవులకు ఎసరు
రాజకీయ కక్ష సాధింపుల కోసమే 130వ రాజ్యాంగ సవరణ
కేంద్రం చేతిలో పావులుగా దర్యాప్తు సంస్థలు
పినపాక సంగమేశ్వరరావు
న్యూఢిల్లీ : ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటూ వరుసగా 30 రోజుల పాటు జైలులో ఉన్న పక్షంలో వారి పదవులను ఊడగొట్టేందుకు ఉద్దేశించిన మూడు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులను పదవుల నుంచి తప్పించేందుకే ఉద్దేశించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం మాత్రం వీటిని సమర్ధించుకుంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద బిల్లుల ప్రభావంపై సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దుర్వినియోగం చేయొచ్చు
క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, మంత్రులను పదవుల నుంచి తొలగించడానికి ఈ బిల్లులను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నదని, కేంద్రంలోని పాలక బీజేపీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని ప్రయోగించవచ్చునని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు కేవలం సభకు మాత్రమే జవాబుదారీ అనే పార్లమెంటరీ సంప్రదాయానికి ఈ బిల్లులు తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను అస్థిపరచడమే లక్ష్యంగా ఈ చట్టాలను ఉపయోగించుకోవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోడీ ప్రభుత్వం తన నిరంకుశ పాలనను ముందుకు తీసుకొని పోవడానికి చట్టపరమైన, రాజ్యాంగపరమైన చర్యలకు పాల్పడుతోందనడానికి ఈ బిల్లులు మరో ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఆరోపణలు రుజువు కాకపోయినా…
గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు జరగడానికి ముందే మోడీ ప్రభుత్వం తన ప్రయత్నాలకు అంకురార్పణ చేసింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రులను, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నేతలతో సహా దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. అయితే వారిపై వచ్చిన అభియోగాలు నేటి వరకూ న్యాయస్థానాలలో నిరూపణ కాలేదు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆ నాడు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయడం జరిగింది. అది బెయిల్ పొందడానికి సైతం వీలులేని చట్టం. దీంతో ఇరువురు ముఖ్యమంత్రులు సుమారు ఐదు నెలల పాటు జైలులోనే గడపాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ వారు నిర్బంధంలోనే ఉండి పోయారు. రాజధాని ఢిల్లీలో గతంలో చోటుచేసుకున్న ఉదంతాలను ఇవి గుర్తు చేశాయి. ఢిల్లీలో పలువురు రాష్ట్ర మంత్రులను అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో కొందరు సుమారు రెండు సంవత్సరాల పాటు కారాగారవాసం గడిపారు. ఆరోపణలకు ఆధారాలు లభించకపోవడంతో వారిపై కేసులు వీగిపోయాయి.
ఫిరాయింపులకు ప్రోత్సాహం
తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలతో 30 రోజులు జైలు జీవితం గడిపితే 31వ రోజు ఆ నేతల పదవులు వాటంతట అవే ఊడిపోతాయన్న తాజా రాజ్యాంగ సవరణ కారణంగా ఇప్పటికే పాలకులు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. ఎందుకంటే కేంద్రంలోని పాలక బీజేపీ ఇప్పటికే ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను నయానో, భయానో అస్థిరపరుస్తోంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నీరుకారుస్తోంది. డబ్బు, పదవులను ఆశ చూపో లేక కేసులను చూపి భయపెట్టో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను తమ గూటికి చేర్చుకునే దుస్సాంప్రదాయానికి ఏనాడో తెరతీశారు. ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడం సర్వసాధారణంగా మారింది. పార్టీ ఫిరాయించి తన పంచన చేరిన వారికే బీజేపీ టిక్కెట్లు కేటాయించి ఎన్నికల్లో గెలిపించుకుంటోంది. ఆ తర్వాత వారికి రాజకీయ రక్షణ కల్పిస్తోంది. లేదా పదవులు కట్టబెడుతోంది.
ఏడుగురు సీఎంలపై వేలాడుతున్న కత్తి
ఇక్కడ గమనించాల్సిన కీలక విషయమేమంటే తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న పది మంది ముఖ్యమంత్రుల్లో ఏడుగురు ప్రతిపక్ష నేతలే. ఇద్దరు బీజేపీ మిత్రపక్షాలకు చెందిన వారు కాగా ఒకరు బీజేపీ సీఎం. అంటే ఈ ఏడుగురు ప్రతిపక్ష సీఎంలు తమపై ఉన్న తీవ్రమైన క్రిమినల్ అభియోగాలతో జైలు పాలై వరుసగా 30 రోజుల అక్కడే గడిపితే పదవులు కోల్పోతారు. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉంటూ అరెస్టయిన తొలి ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాలే. లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సొరేన్ వంటి నేతలు అరెస్టులను ఎదుర్కొన్నప్పటికీ దానికి ముందే పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం తాజాగా బిల్లులు తీసుకురావడానికి కేజ్రీవాల్ జైలు నుంచి సాగించిన పాలనే కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఏదేమైనా రాబోయే చట్టం అత్యంత క్రూరమైనదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్య ఆర్టికల్ 356ను దొడ్డిదారిన తిరిగి తీసుకురావడానికి ఉద్దేశించిందేనని అర్థమవుతోంది.
నిరంకుశత్వం ప్రబలుతోందంటున్న ప్రతిపక్షం
ఏ ప్రతిపక్ష ముఖ్యమంత్రి పైన అయినా తప్పుడు కేసు బనాయించి, 30 రోజులు జైలులో ఉంచి పదవి నుంచి తొలగించే అవకాశం ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి లభిస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ 130వ రాజ్యాంగ సవరణ సంస్కరణ కాదని, ఇది ఓ చీకటి రోజని, ఎలాంటి విచారణ లేకుండా, న్యాయస్థానం శిక్ష విధించకుండా ఎన్నికైన ముఖ్యమంత్రిని, మంత్రులను పదవీచ్యుతులను చేయడం బీజేపీ కుయుక్తి మినహా మరొకటి కాదని అవి ఆరోపిస్తున్నాయి. నిరంకుశత్వం ప్రబలుతోందని, ఓట్ల దొంగతనం, రాజకీయ ప్రత్యర్ధుల అణనివేత, రాష్ట్రాల హక్కులను హరించడం వంటి చర్యలు దీనికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
193 మందిపై ఈడీ కేసులు… శిక్ష పడింది ఇద్దరికే
మనీ లాండరింగ్ ఆరోపణలతో ముడిపడి ఉన్న అవినీతి కేసులను ఈడీ విచారిస్తుంది. అయితే విచారణ నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో పార్లమెంటుకు ప్రభుత్వం అందజేసిన డేటాను చూస్తుంటే ఈ అనుమానం బలపడుతోంది. గత పది సంవత్సరాల కాలంలో ఈడీ 193 మంది రాజకీయ నాయకులపై కేసులు పెట్టింది. అయితే వీరిలో కేవలం ఇద్దరికి మాత్రమే శిక్ష పడింది. మరో మాటలో చెప్పాలంటే రాజకీయ నాయకులపై పెట్టిన కేసుల విషయంలో ఈడీ సక్సెస్ రేటు కేవలం ఒక శాతం మాత్రమే. శిక్ష విధించడానికి ముందే నిందితులను సంవత్సరాల తరబడి జైళ్లలో నిర్బంధించే విషయంలో ఈడీ ‘విజయం’ సాధిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవారు ఇటీవలే వ్యాఖ్యానించారు. చట్టాన్ని అమలు చేయడం, దానిని ఉల్లంఘించడం మధ్య చాలా తేడా ఉన్నదని మరో న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ని దుర్వినియోగపరచి రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ ధోరణిని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో విమర్శించింది కూడా. అయినప్పటికీ ఇప్పుడు చేస్తున్న ఈ కొత్త చట్టం ద్వారా ఆర్టికల్ 356ని దొడ్డిదారిన అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటోంది.
10 మంది సీఎంలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు
ఇప్పుడు పులి మీద పుట్రలా వచ్చిపడిన ఈ మూడు బిల్లులు పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులుగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రులు ఎన్నికల కమిషన్‌కు అందజేసిన అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. వీరిలో 12 మంది ముఖ్యమంత్రులు క్రిమినల్ కేసులు, 10 మంది తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. అంటే హత్యాయత్నం, కిడ్నాప్, ముడుపులు, భయపెట్టడం వంటివన్న మాట. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 89 కేసులతో మొదటి స్థానంలో ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌పై 47 కేసులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై 19 కేసులు, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై 13 కేసులు ఉన్నాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌పై ఐదు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖులపై నాలుగేసి కేసులు ఉన్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రెండు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ఒక కేసు నమోదయ్యాయి.
కేజ్రీవాల్ తరహా పాలన సాధ్యం కాదు
ఈ పరిణామాలన్నీ మోడీ ప్రభుత్వ దుర్నీతిని బయటపెడుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ఏ మాత్రం జంకడం లేదు. ప్రతిపక్ష పార్టీల నేతలను అవినీతిపరులుగా చిత్రీకరించి, అప్రదిష్టపాలు చేయడానికి ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయి. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజ్యాంగ సవరణ బిల్లులను ఈ నేపథ్యంలోనే చూడాల్సి ఉంటుంది. జైలు జీవితం గడిపిన ఇద్దరు ముఖ్యమంత్రులలో ఒకరైన అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. జైలు నుంచే పరిపాలన కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ మూడు బిల్లులు ఆమోదం పొందితే అలా చేయడం సాధ్యపడదు.
30 రోజుల జైలు ఆర్టికల్ 356కు మరో రూపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES