Sunday, May 25, 2025
Homeసోపతిజై భీం తరువాతమరో మంచి సినిమా

జై భీం తరువాతమరో మంచి సినిమా

- Advertisement -

”1991 చుండూరు మారణ హౌమం, 1993 చిలకలూరి పేట బస్సు దహనం, 1997 జూబ్లీ హిల్స్‌ బాంబు పేలుడు హతులందరి కథ ఒకేలా ముగిసింది. మరి హంతకుల కథ ఒకేలా ముగిసిందా?”

’23’ (ఇరవై మూడు) సినిమా ప్రారంభంలో పరిచయ వాక్యాలు. చిన్నవే అయినా అత్యంత ప్రభావం కలిగినవి.
సినిమా దర్శకుడు రాచకొండ రాజ్‌ మొదటి సినిమా మల్లేశం. తరువాత హిందీలో 8 AM మెట్రో, మలయాళంలో ‘పాక’ (నెత్తుటి ఏరు) ఇప్పుడు 23 (ఇరవై మూడు).
అమెరికాలో ఉద్యోగం వదిలి, భారత్‌కు తిరిగి వచ్చి, అప్పులు చేసి మరీ సినిమా తీసి అనేక కష్టాలు పడి రిలీజ్‌ చేసి, అప్పులు తీర్చి, మళ్ళీ అప్పులు చేసి సిన్మాలు తీస్తున్న దర్శకుడు. డబ్బు సంపాదించాలనే యావకు బదులు ప్రేక్షకులకు మంచి సినిమాలు, వీలైనంత రియల్‌ స్టోరీలు అందించాలనే తపన కనపడుతోంది.
వర్గ సమాజంలో న్యాయానికి కూడా వర్గ పక్షపాతం ఉంటుంది అని 1967 నవంబర్‌ 11న విలేకరుల సమావేశంలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ అన్నారు. న్యాయ వ్యవస్థ గురించి నిజం చెప్పినందుకు, కేరళ హైకోర్టు ఆయన్ను కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు నిర్ధారించి 1,000 రూపాయలు జరిమానా, లేదా ఒక నెల సాధారణ జైలు శిక్ష విధించింది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా నేతత్వంలోని ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది, కానీ శిక్షను 50 రూపాయల జరిమానా లేదా ఒక వారం సాధారణ జైలు శిక్షకు తగ్గించింది.
అయితే ఈ సినిమాలో న్యాయ వ్యవస్థకు వర్ణ (కుల) పక్షపాతం కూడా ఉంటుందని ధైర్యంగా, హేతుబద్ధంగా మూడు సంఘటనలను పోలుస్తూ రుజువు చేసాడు రాచకొండ. అంతే కాక కరుడుగట్టిన నేరస్తులకు, పాలకులకు ఉన్న సంబంధాన్ని కూడా చూపాడు. ఎంతో దమ్ము, ధైర్యం ఉండాలి, సినిమాలో ఈ విధంగా వాస్తవాలు చిత్రీకరించడానికి.
కవి, సినీ గీత రచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, దళిత ఉద్యమకారుడు, జననాట్య మండలి, విప్లవ రచయితల సంఘంలో పనిచేసి 1994 శాసనసభ ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ తరపున నందిగామ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కలేకూరి ప్రసాద్‌ (కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా పాట రచయిత) యొక్క రెండు నిముషాల (పాతది) వీడియో క్లిప్‌ చూపించారు. ఆ వీడియోలో తాను వ్రాసిన ”ధిక్కార పతాకాన్ని” కవితను చదువుతుంటాడు.
”ఏది సత్యం, ఏది అసత్యం, ఏది పుణ్యం, ఏది పాపం, ఓ మహాత్మా, ఓ మహర్షీ” అని శ్రీశ్రీ వ్రాసిన కవితను బ్యాక్‌ గ్రౌండ్‌లో వినిపించారు.
దర్శకుడు సినిమా కోసం బాగా వర్క్‌ చేసినట్లు కనిపిస్తున్నది. నూతన నటీనటులతో పాత్రకు తగిన నటనను రాబట్టడంలో కూడా దర్శకుడు విజయం సాధించాడు. పాత్రధారులందరూ తగిన న్యాయం చేశారు. సినిమాలో కీలక పాత్రలుగా సాగర్‌, దాసు, సుశీల పాత్రధారుల నటన ప్రశంసనీయం. యాంకర్‌ ఝాన్సీ సైకాలజీ లెక్చరర్‌గా, ఖైదీల హక్కులు కాపాడే పోలీస్‌ అధికారిగా శివ, ఖైదీ రాజు నటన కూడా బాగుంది. ప్రజా న్యాయవాది చంద్ర పాత్ర ద్వారా న్యాయవాద వత్తిలోనే కాక సమాజంలో కూడా న్యాయవాదుల బాధ్యతను చూపారు.
భావోద్యేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంట తడి పెట్టిస్తాయి. జైల్లో సైతం కుల వివక్ష, ఖైదీల దుర్భర పరిస్థితులు, చీకటి కొట్టు చక్కగా చూపారు. జైళ్ల సంస్కరణల ఆవశ్యకత చూపారు.
చుండూరు కేసులో, చిలకలూరిపేట కేసులో న్యాయస్థానం వాడిన కొలబద్ద ఒకే విధంగా లేదని సినిమా చూసిన వారికి అర్ధం అవుతుంది. నేరపూరిత ఉద్దేశం, ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్యాకాండ ఒకటైతే, చిల్లర దొంగతనం చేయబోతూ ఆకస్మాతుగా జరిగిన నేరం రెండవది.
సంగీతం, పాటలు, సౌండ్‌ మిక్సింగ్‌ బాగున్నాయి. డైలాగ్‌ డెలివరిలో సహజత్వం ఉట్టిపడుతుంది.
నేరస్తుల కోణంలో నుంచి సినిమా తీసినప్పటికీ, వివిధ అంశాలను సినిమాలో అన్ని కోణాలలో చూపెట్టారు. సినిమా కొంత డాక్యుమెంటరీ తరహాలో కూడా ఉంటుంది. ప్రధాన పాత్రధారులతో సహా 25 మంది కొత్తవారు నటించారు. ఇంత కంటే ఎక్కువ రాస్తే సినిమా చూసేటప్పుడు థ్రిల్‌ ఉండదు. ఒక్కసారి కచ్చితంగా చూసి తీరవలసిన సినిమా. ముఖ్యంగా కుల వివక్షపై పోరాడే అభ్యుదయవాదులు, కుల నిర్ములన కోరుకునే అంబేద్కరిస్టులు, న్యాయ వ్యవస్థలో కీలక పాత్రధారులైన న్యాయవాదులు మరింత కచ్చితంగా చూడవలసిన సినిమా.
– రమేష్‌ కుమార్‌ మక్కడ్‌,

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -