Sunday, October 12, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపాటలీపుత్రలో మరో మహాసంగ్రామం

పాటలీపుత్రలో మరో మహాసంగ్రామం

- Advertisement -

నవంబరు 6,11 తేదీల్లో బీహార్‌ శాసనసభ ఎన్నికలు జరుగుతాయని,14న ఫలితాలు వెలువడుతాయని ఎన్నికల సంఘం(ఈసి) ప్రకటించింది. దేశమంతా చాలాకాలంగా ఎదురు చూస్తున్న అతికీలకమైన రాజకీయ సమరానికి రంగం సిద్ధమైంది. ప్రత్యేక ఓట్ల సవరణ(సర్‌)పేరిట ఎన్నికల సంఘం ఈ సమయంలోనే కొత్త ప్రహసనం ప్రారంభించడం దుమారం రేపింది. సుప్రీంకోర్టు కూడా అనేక విధాల సూచనలు చేసింది. ఎట్టకేలకు సెప్టెంబరు 30న తుదిజాబితా ప్రకటించింది. 63 లక్షల ఓట్లు తొలగిస్తే 23 లక్షల ఓట్లు చేర్చినట్టు ప్రకటించింది. ఇదిగాక మరో మూడులక్షల ఓటర్లకు పైన అనర్హులుగా తొలగించింది. అయితే వారెవరూ ఎందుకు తొలగించబడ్డారనే దానిపై పారదర్శకత లేకుండా పోయింది. ఆఖరుకు సుప్రీంకోర్టు వారి పేర్లు వెల్లడించాలని కోరినా ఏవో మాటలతో కాలయాపన చేస్తున్న ఈసి ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలోకి దిగిపోయింది.

కాకుంటే అనేక దఫాలుగా ఎన్నికలు జరిపే సంప్రదాయం ఆపి ఒకటి రెండు రోజుల్లోనే ముగించాలని రాజకీయ పార్టీలన్నీ పట్టుపట్టడంతో ఎట్టకేలకు ఒప్పుకుంది. ఇక ఇప్పుడు ప్రధానమైన రెండు కూటములు ఎన్డీయే, మహాఘట్‌ బంధన్‌ హోరాహోరి పోరాటానికి సిద్ధమంటున్నాయి. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలతో పాటు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ వంటివారు కూడా పర్యటిస్తున్నారు. చెప్పాలంటే పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోడీ స్పందన ఎలా ఉంటుందా అని ప్రపంచమంతా చూస్తుంటే ఆయన బీహార్‌కు వెళ్లి ‘నా నరాల్లో రక్తం కాదు, ఆగ్రహం ప్రవహిస్తున్నది’ అన్నట్టు మాట్లా డారు. ఎన్నికలు అక్టోబరులో వస్తాయి గనకే ఇంత హడా వుడి పడ్డారని వేరే చెప్పాలా? మరికొన్ని గంటల్లో ఎన్నికల తేదీల ప్రకటన వెలువడుతుందనగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మెట్రోరైలును ప్రారంభించి ఏవో రాయితీలు ప్రకటించారు.

ఒకప్పుడు మీకు ఎన్ని రూ.లక్షలు కావాలని ఊరించి ఊసూరని పించిన మోడీ మహాశయుడు మరోసరి అదే తంతు నడిపించారు. ఏదో విధంగా బీహార్‌లో అధికారంలో కొనసాగకపోతే మిగిలినచోట్ల కూడా దెబ్బతింటామన్నది బీజేపీ, ఆరెస్సెస్‌ భయం. దేశంలో మూడుసార్లు ఏదోలా అధికారంలోకి వచ్చినా వారికి కొరుకుడుపడని రాష్ట్రాల్లో బీహార్‌ ఒకటి. అవకాశవాద ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్‌ కుమార్‌ అటూ ఇటూ మారుతుండడాన్ని ఉపయోగించుకునే వారు మనుగడ సాగిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ వచ్చిన ప్రభుత్వాలన్నిటినీ మూడుగా విభజించి చూపడం పరిపాటి. ఒంటరిగా నితీశ్‌కుమార్‌, బీజేపీతో కలసి విడిపోయిన, ఆర్‌జెడితో కలసివిడిపోయిన దశలు. అయితే ఈసారికి రాజకీయ నైతికత కోల్పోయిన ఆయన్ను ఇంటిదారి పట్టించేందుకు ప్రజలు, ప్రతిపక్ష ఇండియా వేదిక, వామపక్షాలు రంగం సిద్ధం చేసుకునేవున్నాయి. బీజేపీ కూడా ఈ క్రమంలో నితీశ్‌ను వెనక్కునెట్టి తామే పెద్దశక్తిగా కూచోవడానికి సిద్ధమైపోయింది కూడా. అయితే ఒంటరిగా పోరాడ గలిగిన సత్తా,ధైర్యం కూడా బీజేపీకి లేవు.

నితీశ్‌కు ఎదురుగాలి
2020 శాసనసభ ఎన్నికల్లో ఆర్‌జెడి 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా వస్తే బీజేపీ 74 స్థానాలతో రెండవ స్థానంలో వచ్చింది. 44 తెచ్చుకున్న జెడియు మూడోస్థానంతో ఆగిపోయింది. పైగా ఆర్‌జెడి నాయకుడు లాలూ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్‌ ప్రజామోదక నాయకుడిగా నిలబడి ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఒప్పందం మేరకు మొదట ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ నితిష్‌నే ముఖ్యమంత్రిని చేసినా తన ప్రాబల్యం తగ్గిపోవడం సహించలేకపోయారు నితీశ్‌. జాతీయ ప్రతిపక్ష కూటమి పేరిట అనేక విన్యాసాలు చేసినా చివరకు 2022లో మళ్లీ జట్టుమార్చి బీజేపీతో కలిశారు. బీజేపీ ఆయన్ను నామకార్థంగా కూచోబెట్టి చక్రం తిప్పుతున్నది. హిందూత్వ రాజకీయాలు సరేసరి. అయినా ముఖ్యమంత్రి పీఠమే పరమావధిగా భావించే నితీశ్‌ తలవంచి బతికేస్తున్నారు. గతంలోని నితీశ్‌కూ ఇప్పటికి అసలు పోలికే లేదని అందరూ అంటున్న పరిస్థితి. మొన్న ప్రధానితో జరిగిన ఒక వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగినంతసేపూ ముఖ్యమంత్రి చేతులు కట్టుకునే ఉండటం ఆయన ఆరోగ్యంపై సందే హాలను పెంచింది. బహిరంగసభల్లో ఐఏఎస్‌లను వేడుకోవడం, కాళ్లు పట్టుకోవడం వంటి విపరీతాలను చూసి జనం విస్తుపోయిన సందర్భాలున్నాయి.

సామాజిక సమీకరణలు
బీహార్‌ ఎన్నికల్లో కులం ప్రధాన పాత్ర వహిస్తుందని చెబుతుంటారు గానీ వాస్తవంలో అక్కడ పేదరికం, సామాజికన్యాయం కోసం జరిగే పోరాటం కూడా దాని వెనక ఉంటాయని గమనించాలి. భూస్వామ్య పీడన దారుణంగా కొనసాగిన రాష్ట్రమది. ఆర్‌జెడి గత ఇరవై ఏండ్లలో మధ్యలో రెండుసార్లు రెండేండ్ల చొప్పున మాత్రమే అదీ భాగస్వామిగా ఉండటం తప్ప ప్రతిపక్షంలోనే ఉంది. స్వతహాగా ముస్లిం యాదవ ఓటర్లు దానికి పునాదిగా ఉంటారని భావిస్తారు. ఈసారి ముందే మేల్కొని కుష్వానా, ధనుక్‌, మల్లా వంటి ఇతర వెనకబడిదన కులాలవారిని కూడా తనవైపు తిప్పుకోవడానికి కేంద్రీకరించి పనిచేసింది. రాష్ట్రపార్టీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చింది. ఇదే తరహాలో కాంగ్రెస్‌, బీఎస్పీలు జాతావులపై కేంద్రీకరించాయి. కొన్ని ప్రాంతాల్లో దళితుల్లో సీపీఐ(ఎంఎల్‌) పార్టీకి పట్టు కలిగివుంటుంది. ఇండియా కూటమిలో వీరందరూ భాగస్వాములుగా ఉండటం ఒకటైతే మిగిలిన చోట్ల వలెగాక ఇక్కడ ఆ కూటమి గట్టిగానే కొనసాగడం పరిస్థితిలో కీలకాంశంగా ఉంటున్నది. సోషల్‌ ఇంజనీరింగ్‌ అనే ఈ బీసీ,ఎస్సీ కులాల సమీకరణవ్యూహంతో సమిస్తిపూర్‌, ధర్బాంగా, మధుబని,కోశ్లీ మిథిలాంచల్‌ ప్రాంతం వంటి చోట కూడా ఆర్‌జెడి కూటమి పట్టు పెంచుకున్నట్టు అంచనాలు వేస్తున్నారు.

దీనికే తేజస్వి మా బాప్‌ అలయన్స్‌(ముస్లిం, యాదవ్‌, బహుజన, అగాధీ, అధీఅబది,) అని పేరు పెట్టారు. అందువల్లనే పైకి ఏమి చెప్పినా తాము నితిశ్‌ను ముందుపెట్టుకుని పోవలసిందేనని బీజేపీ నాయకులు బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. మహిళా ఒటర్లలో ఆయనకు పట్టు ఎక్కువని వారి అంచనా. దానికి తగినట్టే ఎన్నికలు రాబోతున్న వేళ నితీశ్‌ మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రకటన చేయడం వారిని నిలబెట్టుకునే ప్రయత్నం మాత్రమే. అయితే ధరలు, లైంగికదాడులు, నిరుద్యోగ తీవ్రత, మతరాజకీయాల కారణంగా అవి కాపాడలేకపోవచ్చు.సుశాశన్‌బాబు బిరుదు ధరించిన నితీశ్‌ హయాంలో ఏకంగా పద్దెనిమిది వంతెనలు కొట్టుకుపోవడం కన్నా ఇందుకు మరో ఉదాహరణ అవసరం లేదు.

మోడీని ప్రధాని అభ్యర్థిగానే ఆంగీకరించబోనని 2014లో బీరాలు పలికి కూటములు మార్చి పదవి కాపాడుకున్న నితీశ్‌, తర్వాత 2017లో ప్లేటు ఫిరాయించి ఉండకపోతే బీహార్‌లోనే గాక దేశంలో కూడా రాజ కీయాలు మరోలా ఉండేవేమో. ఇదే 2022లోనూ ఆయన పునరావృతం చేశారు. అందుకే ఆయన్ను పల్టుబాబు అని బీహార్‌ ప్రజలు నాయకులు అపహాస్యం చేస్తుంటారు.ఈ విషయంలో అతనితో పోటీ పడగలిగింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ ఇద్దరు నాయకులు మనుగడ కోసం బీజేపీని మోయకపోతే మోడీ మూడోసారి ప్రధాని కాగలిగేవారు కాదనవచ్చు. కాకపోతే ప్రసుతం ఏపీలో వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీకీ అనుకూలంగా ఉంటే బీహార్‌లో మాత్రం లాలూ యాదవ్‌ కుమారుడైన తేజస్వి యాదవ్‌ నితీశ్‌కు ప్రధాన సవాలుదారుగా ముందుకొచ్చారు. రాహుల్‌ కూడా దాదాపు అక్కడే పర్యటిస్తూ వచ్చారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనవసరంగా పట్టుపట్టి అధిక స్థానాలు తీసుకుని ఓటమిపాలై ఉండకపోతే నితీశ్‌ రాగలిగేవారు కాదు.

వామపక్షాల కీలకపాత్ర
ఉత్తర భారతదేశంలో నేరుగా బీజేపీ పాలనకు చిక్కని ఈ ఏకైక రాష్ట్రాన్ని ఈసారైనా లౌకిక శక్తుల పాలనలోకి తీసుకురావడం కీలక కర్తవ్యంగా మారింది. బీహార్‌లో ఇండియా వేదిక యథాతథంగా కొనసాగడానికి వామపక్షాల పాత్ర కూడా మరో ముఖ్యకారణం. చంద్రబాబు నాయుడు, కెేసీఆర్‌, జగన్‌, నవీన్‌ పట్నాయక్‌ వంటివారి అవకాశవాద రాజకీయాలకు పగ్గాలు వేసి లౌకిక శక్తుల ఐక్యత కొనసాగించాలంటే వామపక్షాల పాత్ర ఉండాలనేదానికి బీహార్‌ ఒక ప్రత్యేక ఉదాహరణ. సర్దుబాట్ల ఆలస్యం వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు సీపీఐ(ఎం)ఇప్పటికే ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించి ంది. వామపక్షాలకు 2020లో కూడా 4.4 శాతం ఓట్లు వచ్చాయి. ఇందులో ఎంఎల్‌ పార్టీది ప్రధాన స్థానంకాగా వారి పెద్దన్న వైఖరి వామపక్ష ఐక్యత తగినంతగా పెరగకుండా ఆటంకమవుతున్నదని సీపీఐ(ఎం)లోగడ వ్యాఖ్యానించి ఉంది. లాలూ యాదవ్‌ పాలనలో అవినీతి, ఏకపక్ష పోకడల వంటి ఆరోపణలు ఎన్ని ఉన్నా బీజేపీతో ఒకసారి కూడా పరోక్షంగానైనా చేయి కలపకపోవడం ప్రత్యేకతగా నిలిచింది.

పాట్నాతోనే పతనమా?
బీజేపీ మత రాజకీయాలు, హిందూత్వ పోకడలు మైనార్టీలను దూరం చేస్తుండగా బీహార్‌లో ఆ అవకాశం మరింత ఎక్కువగా ఉంది. మోడీ కనుకనే ఇప్పుడు సర్‌ పేరిట ఎన్నికల సంఘం ద్వారా ఓట్ల అత్యవసర తనిఖీ చేపట్టడానికి కారణమదే. దొడ్డిదారిలో పౌరసత్వ సవరణ చట్టం వర్తింపచేసి లక్షలాది మైనార్టీ ఓట్లను తొలగించడం ద్వారా మొత్తం తొంభై స్థానాల్లో ఫలితాలు తారుమారు చేయోచ్చనిది ఒక కుటిల ఎత్తుగడ. పన్నెండు లక్షలమంది దాకా వలస కార్మికులు బీహార్‌లనే ఉన్నా, స్థిరమైన ఇల్లు వంటివి ఉండడవు గనక అధికార పత్రాలన్నీ ఉండకపోవచ్చు. వారందరినీ బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన అక్రమ ముస్లిం చొరబాటుదారులుగా చూపించి ఓట్లు తీసేయడం పెద్దకుట్ర. మహారాష్ట్ర ఎన్నిక తరుణంలో చేసిన ఈ కుట్ర బీహార్‌లో ముందే ప్రారంభించారని ఓట్‌చోరీపై ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్‌గాంధీ ఆరోపణ అంతర్జాతీయంగా ప్రచారమైంది.

ఈ సమయంలో రెండు కూటములు కూడా ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదు గానీ నితీశ్‌ ఏదో విధంగా ఒప్పేసు కోవడం అనివార్యం. ఇక ఆర్‌జెడి, కాంగ్రెస్‌ వేగంగా చర్చలు ముగించి వామపక్షాలనూ ఇతర చిన్న పార్టీలనూ కలుపుకొని పోవడానికి వాస్తవిక దృక్పథం తీసుకోవాలి. ఈ క్రమం మరీ ఆలస్యమైనా అవరోధాలు వచ్చినా నష్టం తప్పదు. చిరాగ్‌పాశ్వాన్‌ లోక్‌జనశక్తి, జతిన్‌రాం మాంజీ హాం పార్టీ కూడా తమ వాటాకోసం బేరాలు చేస్తున్నాయి. ఇక ఒవైసీ మజ్లిస్‌ ఓట్లను చీల్చడం గతంలో బీజేపీకి లాభించింది. పైకి మోడీపై విమర్శలు గుప్పిస్తున్నా ఒవైసీ అదే పని చేస్తుంటారు. ఆప్‌ కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి అదనంగా ప్రశాంత్‌ కిశోర్‌ జన్‌సురాజ్‌ పార్టీ రంగ ప్రవేశం చేసి ఇప్పటికే భారీగా అభ్యర్థులను ప్రకటించింది.

ఇరుపక్షాల ఓట్లనూ చీలుస్తానని పికె హంగామా చేస్తుంటే మీడియా ఎక్కడ లేని ప్రచారమిస్తున్నది.ఆయన కూడా మతతత్వంపై ప్రత్యేక విమర్శ లేకుండా అందరి గురించి పైపైన ఏవో మాట్లాడుతూ గజిబిజి పెంచుతున్నారు.ఇవన్నీ ఎలా ఉన్నా ఓటర్లు మాత్రం నితీశ్‌ విధానాలతో, వైఫల్యాలతో, అవకాశవాదంతో విసిగిపోయిన బీహార్‌ ఓటర్లు ఖచ్చితంగా ఇంటికి పంపుతారని ఆశించవచ్చు. దేశ చరిత్రలో మొదటి నుంచి కీలక పాత్రవహించిన పాట్నా అనబడే ఒకప్పటి పాటలీపుత్రం తాజా తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం.ఇప్పుడు కూడా మోడీ పతనం బీహార్‌లో మొదలవుతుందని సీపీఐ(ఎం) కార్యదర్శి ఎంఎ బేబీ అక్కడ పర్యటించాక ప్రకటించడం గమనించదగ్గది.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -