కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యంతో మరో గురుకుల విద్యార్థినీ మరణించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో చిన్నారి సంగీత మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల కోసం విద్యార్థినులను పనివారిలా మార్చి టెంట్‌హౌస్ వాహనం నుంచి కుర్చీలు దింపించారని చెప్పారు. ఆ సమయంలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడిన 8వ తరగతి విద్యార్థినీ సంగీత ప్రాణాలు కోల్పోవడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు. సంగీత తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారు ఈ ద్ణుఖం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు.
జనగణనపై 29న సమావేశం
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన పై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం కవిత రాష్ట్ర నాయకులతో సమీక్షించారు. కేంద్రం నిర్వహించే జనగణనలో బీసీ, సబ్ క్యాస్ట్ లెక్కించే కాలమ్ లేకపోవడంపై సమావేశంలో చర్చించి కేంద్రానికి నివేదించనున్నారు. అంతకు ముందు కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కవిత జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ మోసం చేసినట్టే బీసీలను మోసం చేయాలని కేంద్రంలోని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో మరో గురుకుల విద్యార్థినీ మరణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



