– ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్‌కు ద్వంద్వ క్లబ్‌ల యాజమాన్య ప్రయోజనాలు
– కౌన్సిలర్ సునీల్ అగర్వాల్‌పై విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు
– సింగిల్ మెంబర్ కమిటీకి మాజీ సభ్యుడు చిట్టి శ్రీధర్ ఫిర్యాదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నాయకత్వం సంక్షోభంలో పడింది. అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిపై సిఐడి కేసు ఉండగా.. ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ, కౌన్సిలర్‌పై మల్టీ క్లబ్ ఓనర్‌షిప్, విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు వస్తున్నాయి. దల్జీత్ సింగ్, బసవరాజు, సునీల్ అగర్వాల్‌పై హెచ్‌సీఏ మాజీ సభ్యుడు చిట్టి శ్రీధర్ ఏకసభ్య కమిటీ జస్టిస్ పి. నవీన్‌రావుకు ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్‌సీఏలో మరో భారీ కుదుపుకు రంగం సిద్ధమైంది.
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో క్రికెట్ స్థానంలో సిఐడి కేసులు ప్రధానంగా నిలుస్తున్నాయి. ఆ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి సిజె శ్రీనివాసరావులను సిఐడి కస్టడీలోకి తీసుకోగా… హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌లో మిగతా సభ్యులు దల్జీత్ సింగ్ (ఉపాధ్యక్షుడు), బసవరాజు (సంయుక్త కార్యదర్శి), సునీల్ కుమార్ అగర్వాల్ (కౌన్సిలర్) క్రికెట్, పరిపాలన వ్యవహారాలను చూస్తున్నారు. ఇప్పటివరకు అధ్యక్ష, కార్యదర్శితో పాటు కోశాధికారి వరకే పరిమితమైన సిఐడి విచారణ.. తాజాగా అపెక్స్ కౌన్సిల్‌లోని ఇతర సభ్యులకూ విస్తరించనుంది, హెచ్‌సీఏ మాజీ సభ్యుడు, క్లబ్ కార్యదర్శి చిట్టి శ్రీధర్ ఇటీవల హైకోర్టు నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ పి. నవీన్‌రావుకు చేసిన ఓ ఫిర్యాదే ఇందుకు కారణం. దీంతో హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు అందరూ సిఐడి కేసులో జైలుకెళ్లే ప్రమాదం కనిపిస్తోంది!. సింగిల్ మెంబర్ కమిటీకి చిట్టి శ్రీధర్ రాసిన లేఖ సారాంశం ఇలా ఉంది..
మల్టీపుల్ క్లబ్ ఓవర్‌షిప్‌తో ఎన్నికల్లో లబ్ది
సుప్రీంకోర్టు నియమిత జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ హెచ్‌సీఏలో మల్టీపుల్ క్లబ్ ఓనర్‌షిప్‌పై కొరఢా ఝులిపించింది. కుటుంబ పాలన కొనసాగతున్న 57 క్లబ్‌లపై వేటు వేశారు. అయితే, ప్రస్తుత హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్ కుటుంబం రెండు క్లబ్‌లు నడుపుతోంది. అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్రికెట్ క్లబ్‌లు దల్జీత్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ క్రికెట్ క్లబ్ తరఫున ఓసారి హెచ్‌సీఏ కార్యవర్గానికి ఎన్నికైన బసవరాజు.. ప్రభుత్వ ఉద్యోగ విరమణ అనంతరం దల్జీత్ సింగ్ కుటుంబం ఆధ్వర్యంలోని అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్‌లో ఉపాధ్యక్షుడిగా చేరాడు. ఈ మార్పులకు హెచ్‌సీఏ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. మల్టీపుల్ క్లబ్ ఓనర్‌షిప్ ప్రకారం ఈ రెండు క్లబ్‌లపై నిషేధం పడాలి. కానీ ఈ రెండు క్లబ్‌ల నుంచి ఇద్దరు సభ్యులు హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఎన్నికైన కార్యవర్గం పరిష్కరిస్తుందని ఏకసభ్య కమిటీ సూచించినా… అక్రమంగా ఎన్నికైన సభ్యులు హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీగా కొనసాగటంతో ఆ రెండు క్లబ్‌లపై మల్టీపుల్ ఓనర్‌షిప్ చర్యలు లేవని శ్రీధర్ తెలిపారు.
తండ్రి కౌన్సిలర్.. కొడుకు క్రికెటర్
హెచ్‌సీఏ అపెక్స్‌కౌన్సిల్ సభ్యుడు, కౌన్సిలర్ సునీల్ కుమార్ అగర్వాల్ నేరుగా విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నాడు. సునీల్‌కుమార్ అగర్వాల్ హెచ్‌సీఏ కౌన్సిలర్‌గా ఎన్నికైనా.. ఆయన కుమారుడు ఖుష్ అగర్వాల్ క్రికెటర్‌గా హెచ్‌సీఏ జట్ల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల ప్రకారం ఇది డైరెక్ట్ విరుద్ధ ప్రయోజనం. అయినా, సునీల్ అగర్వాల్ పదవి నుంచి తప్పుకోకుండా విరుద్శ ప్రయోజనాలు పొందుతున్నాడని శ్రీధర్ ఆరోపించారు. చట్టవిరుద్ధం, అక్రమంగా జరిగిన హెచ్‌సీఏ గత ఎన్నికలను రద్దు చేసి… నిబంధనల ప్రకారం మళ్లీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని శ్రీధర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
సిఐడి విచారణ షురూ!
హెచ్‌సీఏ మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ ఇటీవల అంబుడ్స్‌మన్, సింగిల్ మెన్ కమిటీకి చేసిన ఫిర్యాదును సిఐడి పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సిఐడి అధికారులు శ్రీధర్‌ను విచారణకు పిలిచారు. ఆరోపణలకు సంబంధించిన వివరాలతో సోమవారం సిఐడి ముందు ఆయన హాజరుకానున్నారు. ఈ వివరాలను పరిశీలించి, అవసరమైతే దల్జీత్ సింగ్, బసవరాజులపై కేసులు నమోదు చేసే అవకాశం లేకపోలేదు. కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ అంశం మాత్రం హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ వద్దే తేల్చుకోవాల్సి ఉంటుందని ఓ హెచ్‌సీఏ క్లబ్ కార్యదర్శి అన్నారు.