భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు
రూ.195.50 మేర పెరుగుదల
జెట్ ఫ్యూయెల్ ధరలు రెట్టింపు
న్యూఢిల్లీ : దేశంలో వంటగ్యాస్ కొరత ఇప్పటికీ ఉంది. ఇది చిన్న హౌటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లపై తీ ప్రభావాన్ని చూపుతోంది. కేంద్రంలో దేశంలో వంటగ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. దేశంలోని ప్రజలు, చిన్నవ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారు మరో షాక్ ఇచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను కారణంగా చూపుతూ.. దేశంలోని వాణిజ్య సిలిండర్ ధరలను పెంచింది. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.195.50కు పెంచింది. దీంతో కొత్త ధరతో దేశంలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2వేల మార్కును దాటింది.
ఈ ధరలను ప్రభుత్వ చమురు సంస్థలు సవరించగా.. ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ధర రూ.2,078.50కు ఎగబాకింది. కోల్‌కతాలో రూ.2208.50గా, ముంబయిలో రూ.2,031గా, చెన్నైలో రూ.2246.50గా, బెంగళూరులో రూ.2161గా ధరలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,320.50కు ఎగబాకింది. డొమెస్టిక్ సిలిండర్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.భారత్‌లో జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు రెట్టింపు పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. మొదటిసారిగా రూ.2 లక్షల మార్కును దాటింది. జెట్ ఫ్యూయల్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ – ఏటీఎఫ్) ధరలు భారీగా ఎగబాకి కిలోలీటర్‌కు రూ.2.07 లక్షలకు చేరాయి. ఇది చరిత్రలోనే అత్యధికస్థాయి పెరుగుదల.
ఢిల్లీలో ఏటీఎఫ్ ధరలు రూ.1.10 లక్షలు, అంటే 114.5 శాతం పెరిగాయి. ఇలా ధరలు పెరగడం వరుసగా రెండో నెల. మార్చి 1న కూడా ధరలు 5.7 శాతం పెరిగాయి. కాగా పెరిగిన ఈ ధరల వల్ల విమానయాన సంస్థలకు భారీ భారం పడుతోంది. యుద్ధం కారణంగా కొన్ని ఎయిర్‌స్పేస్‌లు మూసివేయటంతో విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. విమాన సంస్థల ఖర్చులో సుమారు 40 శాతం వాటా ఇంధనందే ఉంటుంది.పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా విమానయాన రంగం, హౌటల్ రంగం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కమర్షియల్ సిలిండర్‌ల కొరత ఉందనీ, దీంతో హౌటళ్లు, రెస్టారెంట్లు ధరలు పెంచుతున్నాయనీ, దాని ప్రభావం పరోక్షంగా సాధారణ ప్రజలపై పడుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం చమురు ధరలు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగకపోయినా.. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
కేంద్రం మరో షాక్
- Advertisement -
- Advertisement -



