Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeఅంతరంగంసాంత్వన

సాంత్వన

- Advertisement -

ఒక్కోసారి మనసు చాలా బాధపడుతుంది. మరీ ముఖ్యంగా భర్తతో విడిపోవాల్సి వచ్చినా, ప్రాణ స్నేహితులు దూరమైనా మనసు పడే వేదన అంతా ఇంతా కాదు. ఆ బాధను మనసులో దాచుకోలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మనో వేధన అనుభవిస్తుంటారు చాలా మంది. అలాగని ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం మన అనుబంధాల పైనా పడుతుంది. అందుకే ఈ మనోవేదన నుంచి వీలైనంత త్వరగా బయటపడడం చాలా ముఖ్యం. ఇందుకోసం మన ఆలోచనల్లో, చేతల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవల్సి వుంటుంది.
చేతులు కాలాక ఆలకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడమంటారు పెద్దలు. కానీ చాలా మంది సమస్య వచ్చినపుడు చూసుకుందాంలే అనుకుంటారు. మరికొందరు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. ఇది చినికి చినికి గాలివానలా మారి ఇద్దరూ విడిపోయేదాకా వస్తుంది. ఇలా విడిపోయినా, తాము చేసిన పొరపాట్ల విషయంలో మాత్రం అస్సలు రియలైజ్‌ కారు. తప్పంతా అవతలి వారిదేనంటూ నిందిస్తూ మానసికంగా కుంగిపోతుంటారు. దీని వల్ల ఫలితం ఉండకపోగా మనోవేదన రెట్టింపవుతుంది. కనుక అవతలి వారిని నిందించడం మాని తాము చేసిన పొరపాట్లేంటో గుర్తెరగాలి. ఇలా స్వయంగా రియలైజ్‌ కావడం వల్ల కోపతాపాలను తగ్గించుకోవచ్చు. తద్వారా మనసులోని బాధ కూడా క్రమంగా తగ్గుతుంది. ఒకవేళ పొరపాటు అవతలి వారిదే అయినా వారు మీ నుంచి విడిపోయాక వారిపై కోపం ప్రదర్శించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకుంటే ప్రతికూల ఆలోచనల్లో నుంచి బయటపడి మానసిక సాంత్వన పొందచ్చు.
అనుబంధాన్ని తెగతెంపులు చేసుకున్నా ఆ ఆలోచనలు, అనుభవాల నుంచి బయటపడడం అంత సులువు కాదు. అయితే ఈ బాధను తమ మనసులో దాచుకోవడం వల్లే చాలా మంది ప్రశాంతతను కోల్పోతుంటారు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకో లేదంటే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనో ఒంటరిగానైనా బాధను భరిస్తారు కానీ ఇతరులతో పంచుకోరు. మనసులోని బాధ, ఆలోచనల్ని మనసుకు దగ్గరగా ఉన్న వారితో పంచుకుంటే… కొండంత భారం దిగిన భావన కలుగుతుంది. తద్వారా మీ మానసిక వేదన నుంచి బయటపడడానికి వారు సలహాలు ఇస్తారు. ఇది మీకు మరింత సానుకూలమైన అంశం అని గుర్తుపెట్టుకోండి.
మనసు ప్రతికూల ఆలోచనలు, బాధతో నిండిపోయినప్పుడు దీనిపైనా ఆసక్తి చూపలేం. కానీ ఈ సమయంలో కొన్ని అంశాలపై దృష్టి పెట్టడం వల్ల స్వయంగా మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చు. వీటిలో డైరీ రాయడం ఒకటి. ఆ క్షణం మీ మనసులో మెదిలిన ఆలోచనల్ని కాగితంపై పెట్టడంతో పాటు వాటిని ఓసారి పున:శ్చరణ చేసుకోండి. దీని వల్ల స్వయంగా రియలైజ్‌ అయి మనసులోని ప్రతికూల ఆలోచనలు క్రమంగా దూరమవుతాయి. ఇలా రోజూ ఓ పావుగంట పాటు డైరీ రాయడం వల్ల యాంగ్జైంటీ, ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు దూరమవుతాయని ఓ అధ్యయనంలో తేలింది. కనుక మానసిక ఆలోచనల్ని అదుపు చేసుకోవాలంటే ఇది చక్కటి పరిష్కార మార్గం. అలాగే మీకంటూ కొన్ని హద్దులు పెట్టుకోండి. ఎదుటివారిని నొప్పించకుండా ఉండాలని మీకు మీరే కొన్ని నియమాలు పెట్టుకోవడం, కాలానుగుణంగా వీటిని మర్చిపోకుండా కట్టుబడి ఉండడం వల్ల మనసులోని బాధలన్నీ దూరమవుతాయి. మీలో కొత్త ఉత్సాహం జనిస్తుంది. ఇదే మిమ్మల్ని సానుకూలంగా ముందుకు నడిపిస్తుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img