Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిన్యూయార్క్‌లో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం!

న్యూయార్క్‌లో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం!

- Advertisement -

ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఓడించేందుకు 1950వ దశకంలో నాటి కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టు వ్యతిరేకులు సాగించిన విషప్రచారంలో పత్రికలు తమ వంతు పాత్రను పోషించాయి. కమ్యూనిస్టులు అధికారానికి వస్తే మహిళల మెడల మీద కాడి మోపి పొలాలను దున్నిస్తారని, జాతీయం చేస్తారని, సమానత్వం సాధించేందుకుగాను పొట్టిగా ఉన్న వేళ్లతో సమానం చేసేందుకు పొడుగు వేళ్లను నరికివేస్తారని, తలమీద సుత్తితో కొట్టి కొడవలితో మెడ నరికేస్తారని, ఇంకా ఏవేవో పచ్చి అబద్దాలను పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో నవంబరులో జరిగే ఎన్నికల్లో అదే జరుగుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున వామపక్ష భావజాలం కలిగిన జోహ్రాన్‌ మమ్‌దానీ అభ్యర్థి త్వాన్ని అడ్డుకునేందుకు తొలుత ఆ పార్టీలోని మితవాదులు చేయని ప్రయత్నం లేదు.దాన్ని అధిగమించాడు. ఓటమికి పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ పని చేయాలని వ్యతిరేకులు పిలుపునిచ్చారు. వాటన్నింటినీ అధిగమిస్తూ జోహ్రాన్‌ 44శాతం, అదే పార్టీకి చెందిన న్యూయార్క్‌ రాష్ట్ర మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమో స్వతంత్ర అభ్యర్థిగా 25, అదే పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌, తిరుగుబాటు అభ్యర్థి ఎరిక్‌ ఆడమ్స్‌ 7, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి కర్టిస్‌ స్లివా 12 శాతం ఓటర్ల మద్దతు కలిగి ఉన్నట్లు సియేనా సర్వే సంస్థ ప్రకటించింది.
ఈ నేపధ్యంలో జోహ్రాన్‌పై కొన్ని పత్రికలు ప్రత్యక్షదాడులకు దిగుతుంటే కొన్ని మరోవిధంగా చేస్తున్నాయి. ఫాక్స్‌ న్యూస్‌ టీవీ యాంకర్‌ ఊగిపోతూ జోహ్రాన్‌ మమ్‌దానీ, అతని అనుచరులు కమ్యూనిస్టులు, తీవ్రవాదులు వారిని దెబ్బ తీసేందుకు కమ్యూనిస్టులపై విషం చిమ్మటంలో నోటిదురుసుకు పేరు మోసిన జో మెకార్ధీని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రజాస్వామ్యం అంటే ఆత్మహత్య బంధకం కాదని గుర్తించాల్సిన దశ వచ్చిందని, తీవ్రవాదులను న్యూయార్క్‌ వంటి గొప్పనగరంలో ఎన్నిక కావటానికి అనుమతించకూడదని, నగరాన్ని నాశనం కానివ్వకూడదంటూ విరుచుకుపడ్డాడు. కమ్యూనిస్టును కాదని ప్రజాస్వామిక సోషలిస్టునని అతను చెప్పుకుంటున్నాడు, అది ఏ తరహా ప్రజాస్వామ్యం అతను ఎన్నిక కావటాన్ని సహించకూడదని, ఏదోవిధంగా అడ్డుకోవాల న్నాడు.జోహ్రాన్‌ గడ్డం ఉన్న కమలాహారిస్‌ అని నోరుపారవేసుకున్నాడు. ప్రచ్చన్న యుద్ధంలో అమెరికా గెలిచినప్పటికీ మార్క్సిజం బతికిందని దాంతో విశ్వవిద్యాల యాల్లోని టీచర్లకు ధైర్యం వచ్చిందన్నాడు. అందువలన వలస వచ్చేవారిని, సిద్ధాంతాలను ఎక్కించటాన్ని అడ్డుకోవాలి, కమ్యూనిస్టుకు ఓటువేయాలని, నగర నాశనాన్ని కోరుకొనే వారిని బయటకు నెట్టాలి. అందరం కూర్చుని కమ్యూనిస్టు ఎన్నికకాకుండా చూడాలి, అధికారికంగా నమోదు కాని, పౌరులు కాని వారు కూడా ఓట్లు వేస్తున్నారని ఆరోపించాడు. పురోగామివాదుల పట్ల మీడియాలో తిష్టవేసిన మితవాదులు ఎలా ఉన్నారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే.
చిన్న చిన్న నేరాలు చేసినవారి మీద మోపిన ఆరోపణలను ఉపసంహరించాలని నేరాలు చేసిన వారిని సమర్ధిస్తున్నట్లు జోహ్రాన్‌ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తీవ్ర సమస్యలు కాని వాటి మీద కేంద్రీకరించి వేధింపులకు పాల్పడ వద్దని, చిన్న తప్పిదాలను పెద్ద నేరాలుగా చూడవద్దంటూ ఎన్నికల ప్రచారంలో పోలీసుల గురించి చెప్పిన మాటలను వక్రీకరించారు. చిన్నచిన్న తప్పిదాలకు సైతం కనీసం ఏడాది శిక్ష విధిస్తున్నప్పటికీ తగ్గటం లేదు. కనుక అలాంటివాటి నివారణకు తీసు కోవాల్సిన చర్యలను ప్రభుత్వాలు, పౌరసమాజం కూడా పరిశీలించాల్సి ఉంది. అమెరికాలో ఎవరు ఏ మూలన ఎప్పుడు తుపాకీ తీసుకొని టపటపా మంటూ జనాలను ఎందుకు కాల్చిచంపుతారో తెలియని స్థితి.పౌర భద్రతలో పోలీసులు కీలక పాత్ర పోషించాల్సి ఉందని కానీ వారు చేయాల్సినదాన్ని చేయకుండా అడ్డుకుంటున్నారని జోహ్రాన్‌ పేర్కొన్నాడు. దాన్లో భాగంగానే బతుకుతెరవు కోసం శరీరాలను అమ్ముకుంటున్నవారిని వేధించవద్దని, దాన్నొక నేరపూరిత చర్యగా చూడవద్దని 2020లో న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినపుడు చేసిన ఒక వ్యాఖ్యను పట్టుకొని ఇంకేముంది న్యూయార్క్‌ నగరాన్ని వేశ్యలతో ముంచెత్తేందుకు పూనుకున్నాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఇప్పుడు మేయర్‌ ఎన్నికల్లో ఆ ప్రస్తావన ఎక్కడా చేయలేదు. పడుపు వృత్తి న్యూయార్క్‌ నగరంలో లేదా అమెరికా దేశం ఏమిటి ప్రపంచమంతటా జోహ్రాన్‌ పుట్టక ముందే ఉంది. ప్రతి నగరంలో అలాంటి కార్యకలాపాలకు పేరుమోసిన ప్రాంతాల ఉండటం అందరికీ తెలిసిన పచ్చినిజం, న్యూయార్క్‌ నగరం దానికి మినహాయింపు కాదు. కొన్ని ప్రాంతాలలో పట్టపగలు బహిరంగంగానే అలాంటి వారు సంచరించటం బహిరంగ రహస్యం. అలాంటి వృత్తి కొనసాగాలని ఎవరూ కోరుకోరు. కొన్ని దేశాల్లో చట్టబద్దం చేసి అనుమతిస్తున్నారు. పోలీసుల వేధింపులు, మాఫియా ముఠాల బారిన పడకుండా అభాగ్యులైన యువతులకు లైసెన్సులు ఇవ్వాలని అనేక మంది తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లే, వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. యావత్‌ ప్రపంచానికి తెలిసిన బ్యాంకాక్‌లో టూరిజం పేరుతో ఏం జరుగుతున్నదో అందరికీ తెలిసిందే. అక్కడ అధికారంలో ఉన్నది కమ్యూనిస్టులు కాదు, జూదకేంద్రాలు మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నాయి.

జోహ్రాన్‌ గెలిస్తే కుటుంబాలు నాశనం అవుతాయంటూ చేస్తున్న ప్రచారం కూడా దాడిలో భాగమే. అమెరికాలో వివాహాలు, విడిపోవటాలు, అసలా బంధంతో నిమిత్తం లేకుండా పిల్లల్ని కనటం, పెంచటం ఇవన్నీ తెలిసిన వారికి జోహ్రాన్‌ మీద చేస్తున్న ప్రచారానికి కారణం మరింతగా అర్ధం అవుతుంది.మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు ఎంతో వేగంగా అంతరించిపోయాయి, దీనికి కారణం కమ్యూనిస్టులు, పురోగామివాదులా, పెండ్లయిన మరుసటి రోజే పెటా కులవుతున్న వివాహాలకు వారు కారకులా? కానే కాదు.మనకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ మరింతగా ఎదిగిన అమెరికా సమాజంలో జరుగుతున్న పరిణామాలకు కమ్యూనిస్టులు ఎలా కారణం అవుతారు? మనదేశంలో తలిదండ్రులు చేస్తున్న బలవంతపు వివాహాల వలన ఒకరినొకరు ఎలా చంపుతున్నారో ఈ రోజు ఏ టీవీ చూసినా పత్రికను చదివినా ఎక్కడో ఒక దగ్గర జరిగిన ఉదంతాల గురించి తెలియదా! సమాజ పోకడలను గమనించిన వారు కమ్యూనిస్టులైనా మరొకరైనా కుటుంబవ్యవస్థ అంతరించే అవకాశం ఉందని చెప్పి ఉండవచ్చు.అంతమాత్రాన అలా చెప్పారు గనుక వారు మేయర్‌గా గెలిస్తే లేదా అధికారానికి వస్తే కుటుంబాలను సాగనివ్వరని చెప్పటం విపరీతం తప్ప మరొకటి కాదు. అది సమాజం నిర్ణయించుకుంటుంది. వివాహంతో నిమిత్తం లేకుండా వయస్సు వచ్చిన స్త్రీ, పురుషుల సహజీవనాన్ని న్యాయ వ్యవస్థ అంగీకరిస్తున్న విషయం తెలియదా!
జోహ్రాన్‌ మమ్దానీ ముందుకు తెస్తున్న నగర, వలస కార్మికులు, కుటుంబాలు, మొత్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న గృహ, ఇతర సమస్యల గురించి ప్రత్యర్థులు, మీడియా కావాలనే మౌనం వహిస్తున్నది. ఇప్పటివరకు న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌, నగర మేయర్‌గా ఉన్నది డెమోక్రటిక్‌ పార్టీ వారే, ఆ నేతలే ఇప్పుడు పోటీలో ఉన్నారు.పౌర సమస్యల గురించి మాట్లాడితే మీరు చేసిందేమిటనే ప్రశ్నవారికి ఎదురువుతుందిగనుక తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు.అమెరికాలో ఎన్నికలు ఏవైనా డబ్బుతో కూడుకున్నవే. అభ్యర్థులకు సానుభూతి పరులు ఇస్తున్న విరాళాలు కూడా అభిమానానికి కొల బద్దగా ఓటర్లు చూస్తారు.ఆగస్టు రెండవ వారానికి జోహ్రాన్‌ 10.51లక్షల డాలర్లు వసూలు(సగటున ఒక్కో విరాళ మొత్తం 121డాలర్లు) కాగా, ప్రత్యర్థులుగా ఉన్న మాజీ గవర్నర్‌ కుమో 5.41లక్షల డాలర్లు (సగటు 646), ఎరిక్‌ ఆడమ్స్‌ 4.25లక్షలు(770),రిపబ్లికన్‌ అభ్యర్థి 4.07లక్షల డాలర్లు పొందారు. సగటు విరాళం తక్కువగా ఉండటాన్ని బట్టి జోహ్రాన్‌కు పేద, మధ్య తరగతి మద్దతు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.నగరంలో ఇళ్ల అద్దెల పెంపుదలను స్తంభింపచేయాలని, ఉచిత బస్‌ ప్రయాణం, శిశు సంరక్షణ, నగరపాలక సంస్థ ఆధ్వర్యాన లాభనష్టాలు లేని ప్రాతిపదికన నిత్యావసర వస్తు దుకాణాల నిర్వహణ, స్కూళ్లు, కాలేజీలకు సబ్సిడీ వంటి వాగ్దానాలను అమలు చేస్తానని జోహ్రాన్‌ తన ప్రణాళికలో పేర్కొన్నాడు.

ఎలాగైనా సరే వామపక్ష అభ్యర్థి గెలవకుండా చూడాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.మమ్దానీ ఓడిపోవాలంటే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి స్లివా రంగం నుంచి తప్పుకొని తనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తన మద్దతుదార్లతో ఆండ్రూ కుమో చెబుతున్నట్లు పొలిటికో పత్రిక రాసింది. మమ్దానీ నూటికి నూరుశాతం కమ్యూనిస్టు పిచ్చోడని స్వయంగా వర్ణించినందున డోనాల్డ్‌ ట్రంప్‌కు నిదరపట్టటం లేదని కుమో చెబుతున్నాడు. ఇప్పటి నుంచి నవంబరులో ఎన్నికలు జరిగేలోగా అనేక పరిణామాలు జరగవచ్చని గతవారంలో చెప్పాడు. ”అసెంబ్లీ సభ్యుడు (జోహ్రాన్‌ మమ్దానీ) ఎవరో, అతను దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, వివిధ అంశాలపై అతని వైఖరేమిటో తెలియనంతగా జనం ఉన్నారని నేను అనుకోవటం లేదు.కనుక అతని గురించి మరింతగా తెలుసుకుంటారు, అతన్ని అభిమానించటం తగ్గిస్తారు. అతని ఆకర్షణ నాటకీయంగా పడిపోనుంది ” అని చెప్పినట్లు పొలిటికో రాసింది. మమ్దానీ విజయాన్ని అడ్డుకోవాలంటే పార్టీ అభ్యర్థి కర్టిస్‌ స్లివాకు బదులు కుమోకు మద్దతివ్వాలని ట్రంప్‌, ఇతర నేతలు తమకు విశ్వాసపాత్రులుగా ఉన్న రిపబ్లికన్‌ పార్టీ వారికి చెబుతారని ఆండ్రూ కుమో లెక్కలు వేసుకుంటున్నట్లు వేరే మీడియా పేర్కొన్నది. ఆ విషయాలను స్వయంగా కుమో చెప్పినట్లు ఆడియో ఆధారం లభించినట్లు వెల్లడించింది.
తాను డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఎలాంటి సహాయం పొందటం లేదని అలాంటి ఆలోచన కూడా లేదని ఆండ్రూ కుమో చెప్పాడు. పోటీ గురించి ట్రంప్‌తో మాట్లాడినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్తలను తోసిపుచ్చాడు. గవర్నర్‌గా ఉండగా ట్రంప్‌ను వ్యతిరేకించిన కుమో ఇప్పుడు అతగాడి సాయం కోరుతున్నాడని, ట్రంప్‌తో ఉన్న సంబంధాల గురించి అవాస్తవాలు చెబుతున్నాడని జోహ్రాన్‌ విమర్శించాడు. ప్రముఖ మీడియా యజమాని జిమీ ఫింక్లెస్టయిన్‌ ఇంట్లో సమావేశమైన ట్రంప్‌ మద్దతుదార్లు పరిస్థితిని సమీక్షించి కుమో ఎలా పోటీ ఇవ్వగలడో ట్రంప్‌కు నివేదించినట్లు కూడా న్యూయార్క్‌టైమ్స్‌ రాసింది. ట్రంప్‌తో నేరుగా మాట్లాడితే ఫలితం ఉంటుందేమో అని ఒక మద్దతుదారు కుమోను అడగ్గా ట్రంప్‌కు అన్నీ తెలుసు తనకు మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయన్నాడు. అయితే అతని మద్దతుదార్లు ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు తాము ఎవరినీ మద్దతు అడిగేది లేదని మమ్దానీని ఓడించేందుకు తమ నేతే సరైన వ్యక్తి అని ప్రకటనలు చేస్తున్నారు. మమ్దానీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే తనకు మద్దతు ఇవ్వాలని మరోపోటీదారు, ప్రస్తుత డెమోక్రటిక్‌ పార్టీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ను కుమో కోరినట్లు వార్తలు. కుమోను ట్రంప్‌ బలపరుస్తున్నాడని, ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిపేందుకు కుట్ర చేస్తున్నారని మమ్దానీ ప్రతినిధి డోరా పెకీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. చివరికి ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి చెప్పలేము గానీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మమ్దానీ గురించి సర్వేలన్నీ ఇప్పటి వరకు ముందంజలో ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉన్నప్పటికీ అది ఒక్క అమెరికాలోనే కాదు యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్నదంటే అతిశయోక్తి కాదు!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad