కేంద్రం అడుగుజాడల్లోనే సిద్ధరామయ్య సర్కార్
కార్మిక వ్యతిరేక నియమాలపై జోక్యం చేసుకోవాలి : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎలమారం కరీం లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ లేబర్‌కోడ్‌ల విధానాలనే కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేయడం దురదృష్టకరమని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం అన్నారు. కర్నాటక ప్రభుత్వ నోటిఫికేషన్‌లోని నియ మాలు కేంద్ర నియమాలలోని కార్మిక వ్యతిరేక విధానాలను అధిగమించే నియ మాలని పేర్కొన్నారు. ఐఎన్‌టీయూసీతో సహా కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా నిరసనకు నాయకత్వం వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందిస్తోందని విమర్శించారు. దీనిని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎలమారం కరీం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. రాహుల్‌గాంధీకి కూడా ఈ విషయంపై సమాచారం అందినట్టు తెలిపారు. కానీ కాంగ్రెస్ నాయకుల నుంచి ఎటువంటి స్పందన రాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ లేబర్‌కోడ్‌ను అమలు చేయబోమని కేరళ మాత్రమే ప్రకటించిందని, కార్మిక హక్కులను ఎలా సమర్థించాలో కేరళ ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు.
లేబర్ కోడ్‌లు మాత్రమే కాదు, కర్నాటకలోని అనేక ప్రజా వ్యతిరేక చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో, రాష్ట్రంలోని ఐటీ రంగంలో పని గంటలను 14 గంటలకు పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు. ఇటీవల బీజేపీ పాలిత ఉత్తర భారత రాష్ట్రాలకు పోటీగా కర్నాటకలో ఇండ్లు కూల్చివేశారని పేర్కొన్నారు. కోలార్ జిల్లాలోని 42,000 ఎకరాల వ్యవసాయ భూమిని అటవీ భూమిగా మార్చడానికి కూడా ప్రయత్నం జరిగిందని గుర్తు చేశారు. సార్వత్రిక సమ్మె ప్రకటించిన తరువాత కూడా దేశంలో అనేక సమస్యలు తలెత్తాయని, కేంద్ర బడ్జెట్ ప్రకటనతో కార్మికులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహం తీవ్రమైందని పేర్కొన్నారు. దేశ వ్యవహారాలను ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నారని, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరిందని వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే, ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను అమెరికా అధికారులు ప్రకటిస్తారని అన్నారు. దేశాన్ని ఇటువంటి తీవ్రమైన సమస్యల నుంచి రక్షించాలని, దేశ లౌకికవాదం ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు.



