‘కార్మికలోకానికి శాపం’ ఈ కమ్యూనిస్టులు అనే శీర్షికన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన రెడ్డి రాసిన ఒక వ్యాసం డిసెంబరు పన్నెండవ తేదీ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించబడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వెనకేసుకు రావడం, ఆ విధానాలపై నికరంగా, నిస్వార్ధంగా పోరాడుతున్న కమ్యూని స్టులను విమర్శించడమే ఆ వ్యాసం ఉద్దేశ్యం. అందులో భాగంగా సహజం గానే ఇటీవల మోడీ ప్రభుత్వం చేసిన నాలుగు లేబర్‌కోడ్‌లను అసత్యాలతో ఆకాశానికేత్తేశారు. అంతిమంగా చూసినప్పుడు ఈ లేబర్‌కోడ్‌లు పచ్చి కార్మిక వ్యతిరేక మైనవే అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. పైపై అంశాలు పక్కన పెడితే, కార్మికులకు ప్రధానంగా అవసరమైనది గౌరవప్రద మయిన వేతనం, పని ప్రదేశంలో భద్రత. వీటికి యాజ మాన్యాలు ఒప్పుకోకపోవడం వల్లే కార్మికులు సంఘాలు పెట్టు కోవడం, సమ్మెలు చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వేతనం, సంఘం, సమ్మె – ఈ మూడూ కార్మికుల అస్తిత్వానికి ప్రధానం. వీటిని మోడీ ప్రభుత్వం ఈ లేబర్‌కోడ్‌ల ద్వారా కాలరాస్తోంది.
వాస్తవంగా మన దేశంలో ఎటువంటి చట్టం లేకముందే కార్మికులు అనేక సమ్మెలు చేశారు. దరిమిలా నాటి బ్రిటిష్ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ చట్టం 1926 చేసింది. ఈ చట్టం ప్రకారం ఏదైనా పరిశ్రమలో ఏడుగురు కార్మికులు కలిసి యునియన్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని కాస్తా నేడు మోడీ ప్రభుత్వం మార్చి వేసింది. కొత్త కోడ్ ప్రకారం పది శాతం కార్మికులు కానీ, వందమంది కలిస్తేనే కానీ యూనియన్ ఏర్పాటు కాదు. ఈ నిబంధన కనుగుణంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నా, ఒక వేళ ఏదైనా సమయంలో ఈ సంఖ్య తగ్గితే ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ రద్దయిపోయే నిబంధన కొత్తగా చేర్చారు. ఇది ఏ రకంగా కార్మికుల ప్రయోజనమో వ్యాస రచయితకే తెలియాలి. దీనివల్ల యూనియన్ ఏర్పాటు చేసుకోవడమే గగనమై పోతుంది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఏదైనా అత్యవసర సంస్థలో సమ్మె చేయాలంటే గతంలో పద్నాలుగు రోజుల నోటీసు ఇవ్వాలి.
నేడు దానిని అరవై రోజుల వరకు మార్చివేశారు. అలాగే నోటీసు ఇచ్చిన వెంటనే లేబరు కమీషనరు కన్సీలియేషన్ వేయాలని, అది పెండింగులో ఉండగా సమ్మె చేయరాదని షరతు విధించారు. ఒక వేళ అప్పుడు సమ్మె చేస్తే దాన్ని చట్ట విరుద్ధ సమ్మెగా పరిగణించి, సమ్మె చేసిన వారిని, ప్రోత్స హించిన వారిని కూడా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు. అంటే ఆచరణలో ఇక సమ్మె చేయడమే దుర్లభంగా మారుతుంది. ఇది కార్పొరేట్ యాజమాన్యాలకు తప్ప కార్మికులకు ఏ రకంగా ప్రయోజన కరమో అర్ధం కాని అంశమే. పోనీ ఈ లేబర్‌కోడ్‌లలో కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, జీవన ప్రమాణాలు పెంచే అంశాలమైనా ఉన్నాయా అని చూస్తే, భూతద్దం వేసి చూసినా అగుపించవు. సరికదా మరింత దిగజారుడే కనపడుతుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికుని కనీస వేతనం రోజుకు 465 రూపాయలుగా ఇటీవలే కేంద్ర లేబర్ కమిషనర్ ప్రకటించారు.
అంటే నెలకు 26 రోజులుగా భావిస్తే వచ్చే వేతనం కేవలం నెలకు 12,090 రూపాయలు. ఈ వేతనమే జీవన ప్రమాణాలు పెంచేసేదిగా వ్యాస రచయితకు కనపడడం విడ్డూరమే. కేంద్ర సంస్థల్లోనే ఇలా ఉంటే, ఇక ప్రయివేటు సంస్థల గురించి వేరే చెప్పనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన కింద పేదలకు ఇచ్చే రేషన్ కార్డు అర్హత నెలకు పదిహేను వేల రూపాయలు. మోడీ ప్రభుత్వం దారిద్య్రరేఖ కంటే తక్కువగా కనీస వేతనం నిర్ణయించి, సంపద సృష్టికర్తలయిన కార్మికులను నిష్ట దరిద్రులుగా బతకమనడం కార్మికులకే కాదు, దేశానికి కూడా శ్రేయశ్కరం కాదు. ఇలా వేతనాలు పెంచక, సంఘాలు పెట్టుకోనివ్వక, సమ్మెలు చేయనివ్వకుండా ఈ లేబర్‌కోడ్‌లు తయారు చేయడం కార్మికులను యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదిలివేయడం,ఎటువంటి హక్కులూ లేని బానిసలుగా మార్చేయడం తప్ప మరొకటి కాదు. ఫేక్టరీ చట్టం ప్రకారం భద్రతా ప్రమాణాలు తనిఖీ చేసే ఫేక్టరీ ఇన్‌స్పెక్టర్ పేరు కూడా ఫెలిసిటేటర్ గా మార్చేసి, అధికారాలన్నీ తీసేసి, కార్మికుల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా చేస్తోంది.
గిగ్ వర్కర్లకు ఏదో మేలు జరుగుతుందని భావించడం భ్రమే. ఎందుకంటే ఈ లేబర్‌కోడ్‌లలో ఎక్కడా ప్రభుత్వం వీరి సంక్షేమం కోసం రూపాయి కూడా ఇస్తుందని లేదు. ఇక్కడ కూడా యాజ మాన్యాల నుండే వసూలు చేస్తారట. అంటే తిరిగి ఆ సేవలు అందుకునే సామాన్యుల మీదే ఆ భారం పడుతుంది. శాశ్వత ఉపాధి దాదాపు లేనట్టుగా చేసి, కాంట్రాక్టు పద్ధతిని వ్యవస్తీకతం చేసేలా అనేక అంశాలు ఈ కోడ్‌లలో పొందుపరిచారు. ఇక సంక్షేమం గురించి వేరే చెప్పనవసరం లేదు. పాతికేళ్లు, ముప్ఫయి ఏండ్లు పైగా ఒక పరిశ్రమలో పని చేసి, రిటైరయిన కార్మికునికి ఈపీఎస్ పేరున ఇస్తున్న పింఛన్ అత్యధిక మందికి మూడు వేల రూపాయలకు మించి లేదు. ఇది అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇస్తున్న సామాజిక పింఛన్ నాలుగు వేల రూపాయల కంటే కూడా తక్కువ. ఈ ఈపీఎస్ పింఛన్ తొమ్మిది వేల రూపాయలకైనా పెంచాలని ఎంత మొర పెట్టుకున్నా మోడీ ప్రభుత్వంలో చలనం లేదు.
ఎన్‌పీఎస్, యూపీఎస్ పేరున కార్మికుల పొదుపు సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టి మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు దారాదత్తం చేస్తోంది. ఈ పథకాలను కార్మికుల ప్రయోజనాల కనుగుణంగా మార్చాలని ఎన్ని ఉద్యమాలు చేసినా మోడీ ప్రభుత్వం మాత్రం నుండి స్పందనే లేదు. ఇదీ! బీజేపీ సర్కార్ శ్రామికులకు ఇస్తున్న గౌరవం. కమ్యూనిస్టులు పరిశ్రమల నాశనమే విధానంగా పని చేస్తారని ఈయన ఇంకో కితాబు ఇచ్చారు. వాస్తవంగా మోడీ ప్రభుత్వ ఈ పదకొండేండ్ల కాలంలో దేశంలో ఉత్పాదక రంగం బలహీనపడింది. అధికారిక లెక్కల ప్రకారమే అనేక చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు మూతబడ్డాయి. అన్నింటికి మించి, దేశ ఆర్ధిక వ్యవస్థకు పట్టుకొమ్మగా ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మేయడమే మోడీ ప్రభుత్వ ప్రధాన విధానంగా ఉంది. రక్షణ రంగం, బ్యాంకులతో సహా సర్వం ప్రయివేట్ పరం అన్నదే ప్రభుత్వ విధానం.
తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటును కూడా తెగనమ్మేయలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ రంగ పరిరక్షణకు పోరాడుతున్న కార్మికులకు పూర్తి అండగా నిలిచింది కమ్యూనిస్టులు కాగా, ఆ వాస్తవాన్ని కూడా చూడ లేకపోవడం దృష్టిలోపం తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టులు కార్మికులను ఓట్ బ్యాంకుగా చూస్తారని మరో అపవాదు వేశారు. వాస్తవమేమిటంటే కార్మికులను కులం, మతం, ప్రాంతాల పేరున విడదీసి, వీరి ఐక్యతను విచ్చిన్నం చేసి తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నది వీరి బీజేపీ పార్టీయే. దీనికి భిన్నంగా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి, ప్రజల, దేశ ఐక్యతను కాపాడుతున్నది కమ్యూనిస్టులే. అటువంటి కమ్యూనిస్టులపై లేనిపోని నిందలు వేయడం సూర్యునిపై ఉమ్మి వేయడం లాంటిదే. వీరు చివరలో పేర్కొన్నట్లు ‘ప్రజలు సరైన సమయంలో సరైన బుద్ధి వీరికి తప్పక చెబుతారు’ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఎ.అజ శర్మ



