Friday, April 3, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేటలో అనుగుల రాకేష్ రెడ్డి పర్యటన

అశ్వారావుపేటలో అనుగుల రాకేష్ రెడ్డి పర్యటన

- Advertisement -

– బిఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం
– కాంగ్రెస్ వైఫల్యాలపై నిప్పులు చెరిగిన రాకేష్ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రముఖ ఆర్థికవేత్త అనుగుల రాకేష్ రెడ్డి అశ్వారావుపేట లో శుక్రవారం ఆయన పర్యటన నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఆయన పర్యటనతో స్థానిక పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సంకా ప్రసాద్ కుటుంబానికి పరామర్శ: పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు సంకా ప్రసాద్ నివాసానికి వెళ్లిన రాకేష్ రెడ్డి, ఇటీవల మరణించిన ఆయన తల్లి సంకా వరలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ తరపున పూర్తి అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు.

కాసాని నాగశేష పద్మకు ఘన సన్మానం: అనంతరం బిఆర్ఎస్ నాయకురాలు కాసాని నాగశేష పద్మ – చంద్రమోహన్ నివాసానికి వెళ్లిన రాకేష్ రెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కోసం కృషి చేస్తున్న నాగశేష పద్మను శాలువాతో సన్మానించారు. అలాగే బిఆర్ఎస్ నాయకుడు జజ్జువరపు శ్రీరామ్ మూర్తి జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

అభివృద్ధి శూన్యం –  కొత్తగా తట్ట మట్టి కూడా పోయలేదు: ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరుపై రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో మెచ్చా నాగేశ్వరరావు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని, ప్రస్తుతం మాత్రం కొత్తగా తట్టెడు మట్టి కూడా పోయలేదని ఎద్దేవా చేశారు. మాటల్లోనే అభివృద్ధి తప్ప క్షేత్రస్థాయిలో పనులు కనిపించడం లేదన్నారు.

ఆర్టీవో కార్యాలయంపై నిర్లక్ష్యం:
బిఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ఆర్టీవో కార్యాలయం మూతపడినా అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రచారాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు.

హామీల అమలులో వైఫల్యం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం లేదన్నారు. గ్రామ సభలు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా కాంగ్రెస్ ప్రచారం కోసం నిర్వహిస్తున్నారని విమర్శించారు.

ఓటమితో నిరుత్సాహం వద్దు
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు. ఓడిపోయిన వారు నిరుత్సాహపడవద్దని, ఓటమి విజయానికి పునాది అవుతుందని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

2028లో గులాబీ జెండా ఎగురుతుంది:
2028లో బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేటను మళ్లీ బిఆర్ఎస్ కంచుకోటగా మార్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -