లేబర్ కోడ్స్ కార్మిక హక్కులకు భంగం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
రామన్నపేటలో ఉత్సాహభరితంగా యూనియన్ జిల్లా మహాసభ
నవతెలంగాణ-రామన్నపేట
కార్మికవర్గం సంఘటితంగా తిరగబడితే ఎంతటి నియంతలైనా గద్దె దిగాల్సిందేనని, ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలను చూస్తే అది అర్థం అవుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో మల్లికార్జున ఫంక్షన్‌హాల్‌లో శనివారం సీఐటీయూ జిల్లా 4వ మహాసభ ఉత్సాహభరితంగా జరిగింది. వివిధ రంగాల నుంచి 300 మంది కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. పారంభసూచికంగా అరుణపతాకాన్ని జిల్లా అధ్యక్షులు దాసరి పాండు ఆవిష్కరించగా నాయకత్వం, ప్రతినిధులు అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. పపంచాన్ని ఆయుధ సంపత్తితో శాసిస్తున్న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కార్మికుల పక్షపాతి, జోహ్రాన్ మమ్దానీ విజయం, ఇటీవల శ్రీలంక ఎన్నికల్లో దిసనాయకే విజయం పెట్టుబడిదారులకు చెంపపెట్టు లాంటిదన్నారు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నాలుగు లేబర్ కోడ్‌లు తెచ్చి హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. దేశాన్ని ఆదానీ – అంబానీలకు తాకట్టు పెడుతోందన్నారు. న్యూయార్క్, శ్రీలంక ప్రజల స్ఫూర్తితో కార్మికవర్గం మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గొరిగే సోములు, ఎండీ.పాషా పాల్గొన్నారు.



