Sunday, May 18, 2025
Homeజాతీయంఅప్పుల ఊబిలో ఏపీ జెన్‌కో

అప్పుల ఊబిలో ఏపీ జెన్‌కో

- Advertisement -

కోల్‌ కంపెనీలకు పేరుకుపోయిన బకాయిలు
ప్లాంట్లకు సక్రమంగా అందని బొగ్గు
ఆర్‌టిపిపిలో అడుగంటిన నిల్వలు

అమరావతి : రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ(జెన్‌కో) అప్పుల ఊబిలో కూరుకుపోయింది. బొగ్గు అందించే సంస్థలకు, సరఫరా చేసే కంపెనీలకు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది. తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. జెన్‌కో నుంచి విద్యుత్‌ను వాడుకుంటున్న డిస్కంలు నిధులను మాత్రం సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో అప్పులతోనే సంస్థను నెట్టుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం విద్యుత్‌ ఉత్పత్తిపై పడుతోందని అధికారులు చెబుతున్నారు. సుమారు రూ.30 వేల కోట్ల వరకు జెన్‌కో అప్పుల్లో ఉంది. రాష్ట్రంలో మూడు విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. విజయవాడలోని నార్లా తాతారావు థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(ఎన్‌టిటిపిఎస్‌), నెల్లూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(ఎస్‌డిఎస్‌టిపిపి), కడపలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(ఆర్‌టిపిపి) ఉన్నాయి. వీటికి తెలంగాణలోని సింగరేణి, ఒడిశాలోని మహానది బొగ్గు గనుల నుంచి బొగ్గు రావాలి. రైల్వే లైన్ల ద్వారా, షిప్‌ల ద్వారా గానీ బొగ్గు చేరుతోంది. ఈ సరఫరా చేసే కంపెనీలకు జెన్‌కో వేల కోట్లలో బకాయిలు ఉంది. ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్దమొత్తంలో బకాయిలు పెట్టలేదని అధికారులు చెబుతున్నారు. కోల్‌ కంపెనీలతో పాటు గనుల నుంచి సరఫరా చేసే కాంట్రాక్టర్లకు కూడా పెద్ద మొత్తంలో బకాయి పడింది. దీంతో ప్లాంట్లకు చేరాల్సిన బొగ్గు ఆలస్యమవుతోంది. నెల్లూరులోని కృష్ణపట్నం పోర్ట్‌ నుంచి ఆర్‌టిపిపికి సరఫరా చేసే ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు సుమారు రూ.200కోట్ల వరకు జెన్‌కో బకాయి పడి ఉంది. ఈ బకాయి పేరుకుపోవడంతో ఆ కాంట్రాక్టర్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆర్‌టిపిపికి సరఫరా తగ్గడంతో ప్లాంట్‌లో బొగ్గు నిల్వలు అడుగంటిన పరిస్థితి నెలకొంది. విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లలో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిబంధనల ప్రకారం ఉండాలి. ఎన్‌టిటిపిఎస్‌లో 10 రోజులకు, ఎస్‌డిఎస్‌టిపిఎస్‌లో 6 రోజులకు సరిపడ బొగ్గు ఉంది.ఆర్‌టిపిపిలో ఒక్క రోజుకు కూడా సరిపోయే బొగ్గు లేకపోవడం గమనార్హం. ఈ ప్లాంట్‌లో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. 210 యూనిట్లు 5తో పాటు 600 యూనిట్‌ ఒకటి ఉంది.ఒక రోజుకు 28,500 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఇక్కడ అవసరం. కానీ అక్కడ కేవలం 17,109 మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. గనుల నుంచి వచ్చిన బొగ్గును కోల్‌ స్టోరేజ్‌లో ఉంచి ప్లాంట్లలో వాడతారు. కానీ బొగ్గు లేకపోవడంతో వచ్చింది వచ్చినట్లే నేరుగా ఉపయోగిస్తున్నారు. ప్లాంట్‌ అధికారులు మాత్రం రైల్వే ర్యాకులు వస్తున్నాయని, బొగ్గు పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతున్నారు. కొరత వల్ల ప్లాంట్‌లో ఉత్పత్తి కూడా తగ్గింది. ప్లాంట్‌ సామర్ధ్యం 1650 మెగావాట్లు కాగా శనివారం 900 మెగావాట్ల ఉత్పత్తే వచ్చినట్లు సమాచారం.
తెలంగాణ బకాయిల సంగతేంటి?
తెలంగాణ ప్రభుత్వం నుంచి జెన్‌కోకు సుమారు రూ.7,703కోట్లు రావాల్సి ఉంది. రాష్ట్రవిభజన సమయంలో తెలంగాణ డిస్కమ్‌ లకు అందించిన విద్యుత్‌కు గాను ఆ రాష్ట్రం ఆ మొత్తాన్ని చెల్లించాల్సిఉంది.. పదేళ్లు దాటినా ఈ బకాయిల అంశం ఆపరిష్కతంగానే ఉంది. 10 నెలల క్రితం రెండు రాష్ట్రాల్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు పెండింగ్‌ అంశాలతో పాటు జెన్‌కో బకాయిలపై చర్చించాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యి మంత్రులు, అధికారులతో కలిసి కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. మంత్రులు, అధికారులు పలుసార్లు సమావేశమయ్యారు. అయినా ఈ బకాయిల పరిస్థితి స్పష్టత రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -