– బోర్డ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్‌కు ఐడీలను సమర్పించాలి
– సీబీఎస్‌ఈ తాజా నిర్ణయంపై వివాదం
– సమాచార భద్రత, గోప్యతపై నిపుణులు, మేధావుల ఆందోళన
న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తీసుకున్న తాజా నిర్ణయం వివాదమవుతున్నది. సీబీఎస్‌ఈ విద్యార్థులు పది, 12వ తరగతుల బోర్డు పరీక్షలకు నమోదు చేసుకునేటప్పుడు అపార్ ఐడీలను సమర్పించటం తప్పనిసరి చేసింది. ఇప్పుడు ఈ నిర్ణయంపై అందరిలోనూ అనుమానాలు, ఆందోళనలు కలుగుతున్నాయి. ముఖ్యంగా డేటా భద్రత, వ్యక్తిగత గోప్యతకు సంబంధించి తీవ్ర చర్చ నడుస్తున్నది.
అపార్ అంటే..?
ఆధార్ తరహాలో విద్యార్థుల కోసం తీసుకొచ్చిందే అపార్. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీనిని సంక్షిప్త రూపం అపార్. ఇది 12 అంకెలతో ఐడీని కలిగి ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 ద్వారా అపార్‌ను ప్రవేశపెట్టారు. ఇది విద్యార్థి ఎన్‌రోల్‌మెంట్‌కు అనుసంధానించబడిన ఒక గుర్తింపు సంఖ్య. ఇందులో విద్యార్థికి సంబంధించిన విద్యా వివరాలు ఉంటాయి. అంటే విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పటి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు సంబంధించిన సమాచారం అందులో ఉంటుంది. అంటే ఎడ్యుకేషనల్ స్కోర్స్, విజయాలు, సంబంధిత గణాంకాలు వంటివి ఉంటాయి. ఇది ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ డిజిలాకర్ ద్వారా విద్యార్థుల రిపోర్ట్ కార్డులు, రికార్డులను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
అపార్ ఐడీ నకిలీ విద్యా సర్టిఫికెట్లను అంతం చేస్తుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. సీబీఎస్‌ఈ చర్యపై నిపుణులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇది గోప్యతకు భంగం కలిగించే ప్రమాదమున్నదని వాదిస్తున్నారు. ఇందుకు వారు ‘ఆధార్’ను ఉదాహరణగా చూపుతున్నారు. ఆధార్ ద్వారా జరిగిన గోప్యత, వ్యక్తిగత సమాచార ఉల్లంఘనలను గుర్తు చేస్తున్నారు. అపార్ ఐడీని తప్పనిసరి చేయటం ద్వారా వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రత, స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ఆరోపిస్తున్నారు. తాజా పరిణామంపై సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ) వ్యవస్థాపకురాలు మిషి చౌదరి స్పందిం చారు. భారతీయులను ప్రతీరోజూ కొత్త గుర్తింపు పత్రాలను అడుగుతున్నారని తెలిపారు. ”మొదటగా ఆధార్ అన్నారు, ఇప్పుడు చిన్నారులను అపార్‌తో ముడిపెడుతున్నారు. తల్లిదండ్రులను వేధిస్తున్నారు. అపార్‌కు చట్టబద్ధత లేదు” అని మిషి చౌదరి తెలిపారు. ఇటు నిపుణులు, మేధావులు, తల్లిదండ్రుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో సీబీఎస్‌ఈ ఈ నిర్ణయంపై ఇంకా స్పందించాల్సి ఉన్నది. 2023లో కేంద్రం ప్రారంభించిన ‘వన్ నేషన్, వన్ స్టూడెంట్’ పథకం కింద పాఠశాలలు తమ వార్డుల అపార్ ఐడీలను సృష్టించడానికి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకోవాలని విద్యా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అపార్ ఐడీని పొందటానికి ఒక విద్యార్థి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, ఆధార్ నెంబర్‌తో సహా తన వ్యక్తిగత వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
‘అపార్’ తప్పనిసరి
- Advertisement -
- Advertisement -