కార్మిక క్షేత్రంలో… ఆధునికత వైపు అడుగులు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఈ ప్రపంచానికి నాగరికత నేర్పింది ఇద్దరే ఇద్దరు ..ఒకరు రైతన్న…. ఇంకొకరు నేతన్న. దేశంలో వ్యవసాయం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన వస్త్రోత్పత్తి రంగంలో ఆధునికత సంతరించుకుంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు ఇది వేదికవుతోంది. చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి, ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నేత కళాకారుల ఖిల్లా సిరిసిల్లలో వస్త్రోత్పత్తి రంగం ఆధునికత వైపు అడుగులు వేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత సిరిసిల్లలోని పలు మార్పులు చోటు చేసుకున్నాయి.చేనేత స్థానంలో మర మగ్గాలు వచ్చాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ లోకల్ టు గ్లోబల్ గా అవతరిస్తుంది.
అమెరికాకు అపెరల్ పార్క్ ఉత్పత్తులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక క్షేత్రంలో ప్రపంచ శ్రేణి వస్త్రాలు తయారవుతున్నాయి. అపెరల్ ఉత్పత్తులు నేరుగా న్యూయార్క్‌కు ఎగుమతి అవుతున్నాయి. బెంగళూరుకు చెందిన గోకుల్‌దాస్ సంస్థ.. గ్రీన్‌నీడిల్ పేరుతో ఇక్కడ అపెరల్ ఉత్పత్తులకు పరిశ్రమను ఏర్పాటు చేసింది.2022 మే నుంచి మహిళలు, పురుషులు ఉపయోగించే ఇన్నర్‌వేర్‌లు, క్రీడా దుస్తుల ఉత్పత్తులను ప్రారంభించింది. ఇటీవలే సిరిసిల్ల వస్త్రోత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునే అనుమతులు లభించగా గ్రీన్‌నీడిల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన గ్యాప్ ఆర్గానిక్ 18,000 కాటన్ బాక్సర్స్ బ్రీఫ్స్‌ను ముంబయి మీదుగా న్యూయార్క్‌కు ఎగుమతి చేశారు. అంతేకాకుండా మరో ఫ్యాక్టరీని మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, నాగేశ్వరరావు లు కలిసి ప్రారంభించారు. సిరిసిల్లలోనీ వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వ వెన్నుదన్ను నిలుస్తూ ప్రపంచశ్రేనీ వస్త్ర పరిశ్రమ గా తీర్చిదిద్దుతూనే కార్మికులకు అధిక వేతనం దక్కేలా జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రత్యేక చొరవ చూపుతుంది.
సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని చేనేత మరియు మరమగ్గాలకు “జియో ట్యాగింగ్” చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30,252 మరమగ్గాలకు మరియు 204 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతన్నలను ఋణ విముక్తి చేయడానికై లక్ష వరకు ఋణమాఫీ పథకాన్ని అమలు చేసింది.
జిల్లాలో 904 మంది చేనేత మరియు మరమగ్గాల కార్మికులకు రూ. 3.70 కోట్ల ఋణాలు మాఫీ చేయడం జరిగినది.జిల్లాలోని నేతన్నలకు నిరంతరాయంగా ఉపాది కల్పించడంతో పాటు సరైన వేతనం పొంది, ఆత్మహత్యలు నివారించి ఆత్మగౌరవంతో జీవించేలా వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రమును సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేటాయించబడుచున్నవి. దీనితో ప్రస్తుతం సిరిసిల్లలో నేత కార్మికులునెలకు సుమారు రూ. 16,000/- నుండి రూ. 20,000/- వరకు వేతనాలు పొందుచున్నారు. ఇప్పటి వరకు సిరిసిల్లకు దాదాపు రూ. 3100 కోట్ల విలువైన 60.00 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరెలు, ఆర్ వి ఎం(విద్యార్థులకు యూనిఫారమ్స్), అంగన్ వాడి చీరెలు, సంక్షేమ శాఖ ఆర్డర్స్ మొదలైన వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు కేటాయించారు.
నేతన్నకు చేయూత…
నేతన్నలను పొదుపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో “నేతన్నకు చేయూత” పథకము అమలు చేస్తున్నారు. ఇ పథకమును 2017 సంవత్సరంలో ప్రారంభించడం జరిగినది, కరోన కష్ట సమయంలో జిల్లాలోని 1801 కార్మికులకు రూ. 5.14 కోట్లు చెల్లించారు. ఇ పథకం 2022 సంవత్సరంలో తిరిగి ప్రారంభించారు. ఇ పథకములో 5933 మంది చేనేత మరియు మరమగ్గాల కార్మికులకు ప్రభుత్వ వాటా రూ. 230.01 లక్షలను మంజూరు చేయడం జరిగినది. మరమగ్గాల కార్మికులకు కూలి సర్దుబాటుకై 10% నూలు రాయితి పథకము అమలు చేయబడుచున్నది. సిరిసిల్లలోని 5374 మరమగ్గాల 10 శాతం నూలు రాయితీ డబ్బులు చెల్లించారు. రైతుల మాదిరిగానే నేత కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నేతన్న భీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4704 మంది చేనేత మరియు మరమగ్గాల కార్మికులకు నేతన్న భీమా కల్పించబడింది. ఇప్పటి వరకు 10 మంది కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున మొత్తము రూ. 50లక్షలను వారి నామిని ఖాతాలకు జమ చేయడం జరిగినది.
టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి…
టెక్స్ టైల్ పార్క్ లో అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు అనగా పరిపాలన భవనం, భోజనశాల (క్యాంటీన్), టాయిలెట్స్ మరియు 4 లైన్లు రోడ్లు సెంట్రల్ లైటింగ్ తో రహదారుల & మురికి కాలువలు, సమర్ధ శిక్షణ కేంద్రము నిర్మింపబడినవి.
టెక్స్ టైల్ పార్క్ లోని 111యూనిట్లకు 50% విద్యుత్ సబ్సిడీ క్రింద రూ. 30 కోట్లు విడుదల చేయడం జరిగినది. జిల్లాలోని మహిళలకు ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్ మరియు ఎంబ్రాయిడరీ నందు 60 రోజుల ఉచిత శిక్షణా కార్యక్రమములు ప్రారంభించబడినది.శిక్షణ పొందిన మహిళలకు అపారెల్ పార్క్ లో ఏర్పాటు చేస్తున్న గార్మెంట్ యూనిట్లలో ఉపాధి కల్పించబడుచున్నది. జుకీ కుట్టు మిషన్ల పై 2508మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగినది. కార్మికులను యజమానులుగా తీర్చిదిద్దాలనే తలంపుతో గ్రూప్ వర్క్ షెడ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. పెద్దూరులో 88 ఎకరాల స్థలంలో, మొదటి దశలో ఒక్కొక్క కార్మికునికి నాలుగు ఆధునాతన మరమగ్గాల చొప్పున 1104 మందికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన యుద్ద ప్రతిపాదకన జరుగుచున్నవి.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా అపెరల్ రంగంను ప్రోత్సహించడం కోసం పెద్దూర్ లో 60 ఎకరాల స్థలంలో అప్పారెల్ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. టి ఎస్ ఐ ఐ సి ద్వారా మౌలిక వసతుల కల్పన జరుగుతున్నవి. బెంగళూరుకు చెందిన గోకులదాస్ ఇమేజెస్ కంపనీ ప్రస్తుతం పెద్దూరు గ్రామంలో ఉన్న అప్పారెల్ పార్క్ లో అప్పారెల్ (గార్మెంట్ల) ఉత్పత్తులు కూడా ప్రారంబించబడినవి. సమర్థ్ /జూకి నందు శిక్షణ పొందబడిన మహిళలకు వారి కంపనీలో ప్రాదాన్యత ఇవ్వబడి చక్కటి ఉపాది కలిపించబడుచున్నది. సుమారు 3000 మంది మహిళలు ఉపాధి పొందుచున్నారు. టెక్స్ పోర్ట్ కంపెనీ ప్రభుత్వం ఎం ఓ యు కుదుర్చుకోబడినది. ఈ కంపెనీని ఇటీవలనే మంత్రులు ప్రారంభించారు.ఈ కంపెని ద్వారా సుమారు 2000 మంది మహిళలు ఉపాది పొందుతున్నారు.
ప్రభుత్వ ప్రత్యేక చొరవతో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి
రాష్ట్ర టెక్స్టైల్ మంత్రి కే టి ఆర్ ప్రత్యేక చొరవతో వస్త్ర పరిశ్రమ లోకల్ టు గ్లోబల్ లుగా అవతరించింది. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి చీరలతో సహా ప్రభుత్వ ఆర్డర్ లతో కార్మికులకు నిరంతరాయగా ఉపాధి లభిస్తుంది. వలసలు తగ్గాయి. వేతనం పెరగడంతో కార్మికుల జీవన ప్రమాణాలు పెరిగాయి. తాజాగా సిరిసిల్ల నుంచి అమెరికా కు అపెరల్ పార్క్ ఉత్పత్తులు వెళ్లడం శుభపరిణామం. స్థానిక యువతకు , ముఖ్యంగా మహిళలకు, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మరిన్ని లభించే అవకాశం ఉంటుంది.
