పదేండ్లుగా నియామాకాల్లేవు
నిరుద్యోగులకు తీరని నష్టం
పాలన దెబ్బతింటోంది
సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి
తక్షణమే స్టే ఇవ్వండి : టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్ దాఖలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియకు న్యాయపరమైన అవరోధం తొలగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తరఫున అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి (లీగల్) ఆర్.సుమతి హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ బుధవారం అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన పరమేశ్ మట్టా మరో 221 మంది అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చింది. ” ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టిక్కెట్లు ఇవ్వడం కరెక్టే. ఇది యూపీపీఎస్సీ రూల్స్‌కు వ్యతిరేకమన్న వాదన తమకు వర్తించదు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే చాలా మందికి ఒకే తరహా మార్కులు రావడం సహజమే. కోఠిలో మహిళా కాలేజీ పురుషులకు విడిగా టాయిలెట్స్ లేకపోవడంతో అక్కడ పూర్తిగా మహిళలకు కేటాయింపు జరిగింది. 45 సెంటర్స్‌ను 46కు పెరగడానికి కారణం ఉంది. దివ్యాంగుల కోసం ఎంపిక చేసిన కేంద్రం ఎత్తుగా ఉన్నందున మరో కేంద్రం ఏర్పాటు జరిగింది. మూల్యాంకనం రెండుసార్లు చేశాక మార్కుల్లో వ్యత్యాసం 15 శాతం కంటే ఎక్కువ ఉంటే మూడోసారి మూల్యాంకనం జరిగింది. సింగిల్ జడ్జి ఎవరూ లేవనెత్తని అంశాల్లోకి వెళ్లారు. తీర్పు సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకం. దీనిని రద్దు చేయాలి..” అని అప్పీల్ పిటిషన్‌లో టీజీపీఎస్సీ కోరింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి.
”గత పదేండ్లుగా గ్రూప్ 1 పోస్టు నియామకాలు జరగలేదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు ఆవిరికాకుండా చేయాలి. అనేకసార్లు గ్రూప్-1 నియామకాలకు వివిధ కారణాల రీత్యా కోర్టుల్లో బ్రేక్ పడుతూ వచ్చింది. దీంతో యువత అవకాశాలు కోల్పోతున్నారు. పరిపాలనలో అత్యంత కీలకమైన స్థాయిలో అధికారుల కొరత ఏర్పడి ప్రభుత్వ పనితీరు దెబ్బతింటోంది. గ్రూప్-1 అధికారుల సేవలు రాష్ట్రానికి ఎంతగానో అవసరం. 2022 నుంచి వివాదాల దారిలోనే గ్రూప్ 1 నియామకాల వ్యవహారం ఉంది. గ్రూప్-1 నియామకాలు 2011 తర్వాత జరగలేదు. అప్పటి నుంచి నిరుద్యోగులు నియామకాలు జరుగుతాయని చెకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 2022 ఏప్రిల్‌లో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (04/2022) వెలువడింది. 503 పోస్టుల నియామకం చేయాలని నిర్ణయించింది. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మరో 60 పోస్టులు చేర్చి మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. తొలి నోటిఫికేషన్ కంటే పోస్టుల సంఖ్య పెంపు చెల్లదంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టు/సుప్రీం కోర్టుల వరకు వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే, ఈ న్యాయ వివాదాల కారణంగా గ్రూప్-1 పరీక్షల షెడ్యూల్ వాయిదా పడింది. 2024 ఫిబ్రవరి 19న వెలువడిన తొలి నోటిఫికేషన్‌కు బదులుగా కొత్త నోటిఫికేషన్ (02/2024) ప్రకారం 563 ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ చర్యలు ఉపక్రమించింది. గత ఏడాది (2024 మధ్యలో) ప్రిలిమినరీ పరీక్షలు పూర్తి అయ్యాయి.
2025 ఏప్రిల్ 9న అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అర్హులైన అభ్యర్థుల జాబితాను కమిషన్ విడుదల చేసింది. టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలను సమర్ధంగా నిర్వహించింది. మూల్యాకనం కూడా శాస్త్రీయ విధానాలతోనే నిర్వహించింది. టీజీపీఎస్సీ చర్యలు పూర్తిగా పారదర్శకంగా, చట్టపరంగానే ఉన్నాయి. నోటిఫికేషన్ దశలోనే కేసులు కొనసాగిన నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు గత ఏప్రిల్ 16న మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చనీ, అయితే, తుది ఫలితాలను ప్రకటించరాదంటూ మధ్యంతర ఆదేశాలను వెలువరించింది. ఇవి అమల్లో ఉండగానే హైకోర్టు, ఈ నెల 9వ తేదీన కీలక తీర్పును వెలువరించింది. తుది మెరిట్ లిస్టును రద్దు చేసింది. సమాధాన పత్రాలను మోడరేషన్ విధానంతో మళ్లీ మూల్యాంకనం చేయాలంది. ఈ మేరకు సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును రద్దు చేయాలి. ఈ తీర్పు వల్ల ఎంతోమంది ప్రతిభావంతులైన నిరుద్యోగుల ఆశలు అడిఆశలయ్యాయి. ఎన్నో వ్యయప్రయాసలతో టీజీపీఎస్సీ సమర్ధంగా నిర్వహించిన పరీక్షల ఫలితాలు కార్యరూపం దాల్చి ఉద్యోగ నియామక ప్రక్రియ దశలో ఆగిపోయింది. సుమారు గత 15 ఏండ్లుగా గ్రూప్-1 నియామకాలు జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత గత పదేండ్లలో నియామకాల కోసం జరిగిన ప్రయత్నాలన్నీ ఆగిపోయాయి. చివరిసారి 2011లో గ్రూప్-1 పోస్టుల భర్తీ జరిగింది. ఏండ్లుగా అభ్యర్థులు గ్రూప్-1 పోస్టులను సాధించాలని కసరత్తు చేస్తున్నారు.
పోస్టుల భర్తీ ఉపక్రమించిన ప్రతిసారీ ఏదోక వివాదంతో ఆగిపోతున్నాయి. గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2016లో వెలువడిన నోటిఫికేషన్ ఆగిపోయింది. ఆ తరువాత 2022లో వెలువడిన మరో నోటిఫికేషన్ సైతం న్యాయపరమైన కేసుల వల్ల నిలిచిపోయింది. తాజాగా గత ఏడాది వెలువడిన నోటిఫికేషన్ వరకు అభ్యర్థులకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కేసులతో జరిగిన కాలయాపన వల్ల యువత తీవ్రంగా నష్టపోతోంది. అభ్యర్థుల వయసు మీరిపోతోంది. ఎంతోమంది ఉద్యోగ నియామక అర్హతలను కోల్పోయే పరిస్థితులకు చేరుకుంటున్నారు. నిరుద్యోగ యువత అవకాశాలను కోల్పోయే పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి. నిరుద్యోగ యువతలో నిరాశ, అసహనం పెరుగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఈ జాప్యం అభ్యర్థుల భవిష్యత్‌ను సందిగ్ధంలో నెట్టే ప్రతికూల ప్రభావానికి ఆస్కారం ఉండవచ్చు. దీనికితోడు ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో ఉన్నత స్థాయి పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పాలన దెబ్బతింటోంది. గ్రూప్-1 అధికారులు రాష్ట్ర పరిపాలనకు వెన్నుముక. ఈ స్థాయి అధికారులు లేకపోవడంతో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలులో అంతరాయం ఏర్పడుతోంది.
ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ రంగాల్లో అధికారుల కొరతతో పనితీరు మందగిస్తోంది. అభ్యర్థులు అనేక దశల్లో న్యాయపరమైన సమస్యలను లేవనెత్తడంతో నియామక ప్రక్రియలో స్థిరత్వం లేకుండాపోయింది. దీని ప్రభావం సమాజంపై కూడా పడుతున్నది. కాబట్టి, ప్రధాన రిట్ అప్పీల్‌పై తుది తీర్పు వెలువరించే వరకు సెప్టెంబర్ 9 హైకోర్టు సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. నిరుద్యోగుల మానసిక వేదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కో అభ్యర్థి గ్రూప్-1 పరీక్ష కోసం సంవత్సరాల తరబడి శ్రమించారు. వాళ్ల భవిష్యత్తు అనిశ్చితిలో పడకుండా చేయాలి. ఇదొక అభ్యర్థుల సమస్యగానో, ఉద్యోగ నియామక ప్రక్రియగానో చూడకూడదనీ, పాలనపై ప్రభావం ఎంతగా ఉందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి, అభ్యర్థులకు న్యాయం జరగాలంటే సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు ఇవ్వాలి.. ” అని టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ ద్వారా హైకోర్టును కోరింది. ఈ అప్పీల్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేయనుంది.