Friday, October 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనాలో పెట్టుబడులు పెంచుతాం : ఆపిల్‌

చైనాలో పెట్టుబడులు పెంచుతాం : ఆపిల్‌

- Advertisement -

బీజింగ్‌ : చైనాలో పెట్టుబడులు పెంచుతామని ఆపిల్‌ కంపెనీ తెలిపింది. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఆపిల్‌ కంపెనీ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆపిల్‌ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ బుధవారం చైనా పరిశ్రమల మంత్రి లీ లెచంగ్‌తో సమావేశమయ్యారు. ఆ వివరాలను చైనా ప్రభుత్వం విడుదల చేసింది. ఆపిల్‌ కంపెనీ చైనా మార్కెట్‌లో మరిన్ని ఉత్పత్తులు ప్రవేశపెడుతుందని, చైనా సరఫరాదారులతో కలిసి అభివృద్ధి చెందుతుందని సమావేశం సందర్భంగా లీ లెచంగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపిల్‌ సహా విదేశీ కంపెనీలకు మంచి వ్యాపార వాతావరణం కల్పిస్తామని చెప్పారు. చైనా పర్యటన సందర్భంగా కుక్‌ షాంఘైలోని ఆపిల్‌ స్టోర్‌ను సందర్శించారు. చైనా గేమ్‌ డెవలపర్లతో సమావేశ మయ్యారు. కాగా ఐఫోన్ల తయారీ సంస్థ ఆపిల్‌ చైనాలో ఏ మేరకు పెట్టుబడులు పెడుతుందన్న సమాచారం ప్రభుత్వ ప్రకటనలో ఇవ్వలేదు. అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధం ఇప్పటి వరకూ ఈ కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపలేదు.

ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టవద్దంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దేశీయ దిగ్గజ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. హూవై వంటి చైనా కంపెనీలపై అమెరికా చాలా కాలం క్రితమే ఆంక్షలు విధించింది. ప్రపంచంలో అతి పెద్ద వినియోగదారుల మార్కెట్‌ అయిన చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తే అధ్యక్ష భవనం ఆగ్రహించి తమ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తుందేమోనని అనేక దేశీయ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే చైనాలో పెట్టుబడులపై అవి ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దేశీయ తయారీ రంగంలో మరో వంద బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడతామని ఆగస్టులో ట్రంప్‌కు కుక్‌ హామీ ఇచ్చారు. దీంతో ఉబ్బితబ్బిబయిన ట్రంప్‌ ఆయనకు 24 క్యారట్ల బంగారు స్టాండ్‌పై అమర్చిన ఫలకాన్ని బహుకరించారు. ఆపిల్‌ సంస్థ చైనాకు చెందిన సరఫరాదారులు, ఫ్యాక్టరీలపై ఆధారపడుతోంది. అది ఉత్పత్తి చేస్తున్న ఐఫోన్లలో చాలా వరకూ చైనాఫ్యాక్టరీలలోనే అసెంబుల్‌ అవుతున్నాయి. చైనా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో డిమాండ్‌ అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడికి ఆపిల్‌ ఎగుమతులు పెరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -