Sunday, November 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.50 లక్షల బీమా వర్తింపజేయండి

కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.50 లక్షల బీమా వర్తింపజేయండి

- Advertisement -

ఏడు ప్రధాన బ్యాంకులకు సింగరేణి సీఎండీ బలరామ్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.50 లక్షల ప్రమాద భీమా వర్తింపజేయాలని ఏడు ప్రధాన బ్యాంకులకు సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌ విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఎస్బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్న సింగరేణి ఎల్లవేళలా వారికి అండగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు సంస్థ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులు సానుకూలంగా స్పందించాలని కోరారు. ”ఉచిత ప్రమాద బీమా పథకం ద్వారా సింగరేణి ఉద్యోగులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, పొరుగు సేవల సిబ్బందికి రూ.40 లక్షల వరకు బీమా అందిస్తున్నాం.

ఇప్పటి వరకు వివిధ ప్రమాదాల్లో మరణించిన 34 మందికి రూ.30 కోట్ల బీమా సొమ్మును బ్యాంకుల ద్వారా అందించాం. ఇది వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించింది” అని వారికి వివరించారు. అలాగే ఒప్పంద కార్మికులకు కనీసం రూ.50 లక్షల ప్రమాద బీమా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సింగరేణి ఉద్యోగులు సహజ మరణం పొందితే కనీసం రూ.20 లక్షల టర్మ్‌ ఇన్సురెన్స్‌ ఇచ్చే విషయంలోనూ సహకరించాలని బ్యాంకులను సీఎండీ బలరామ్‌ కోరారు. సంస్థ అభ్యర్థనపై బ్యాంకర్లు సానుకూలంగా స్పందించారు. సింగరేణితో దీర్ఘకాల వాణిజ్య బంధాన్ని కొనసాగించేందుకు మెరుగైన ప్యాకేజీని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్‌ పర్సనల్‌ గౌతమ్‌ పొట్రు, జీఎం(కో ఆర్డినేషన్‌) టి.శ్రీనివాస్‌, ఏజీఎం(ఫైనాన్స్‌) చక్రవర్తి, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -