– ఉన్నత విద్యామండలి చైర్మెన్‌కు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పవార్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అవసరమైన అధ్యాపకులను నియమించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డిని గురువారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో రామారావు పాటిల్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ కాలేజీలో తక్కువ అధ్యాపకులున్నారని తెలిపారు. దీంతో విద్యార్థులు అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26)లో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో విద్యార్థులు ప్రవేశాలను పొందారని వివరించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని గుర్తు చేశారు. ఆ జీవో ప్రకారం ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్లతోపాటు బోధనేతర సిబ్బందిని నియమించుకునేందుకు అవకాశం లేదని తెలిపారు. ఈ నియోజకవర్గం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. విద్యార్థులు ఎక్కువ మంది సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారేనని వివరించారు. ప్రభుత్వరంగంలోని విద్యాసంస్థల్లోనే చదివేందుకు ఆసక్తి చూపుతారని తెలిపారు. ఫీజులు చెల్లించి ఉన్నత విద్యను అభ్యసించే స్థోమత లేదని పేర్కొన్నారు. ఈ కాలేజీకి అవసరమైన సిబ్బందిని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై బాలకిష్టారెడ్డి సానుకూలంగా స్పందించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అధ్యాపకులను నియమించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES