నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జిల్లా మత్స్యకారుల సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్లు/పర్సన్ ఇన్‌చార్జీల నియామకాలు తామిచ్చే తీర్పునకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ ఎండీ సహా పలువురికి సోమవారం నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. జిల్లా మత్స్యకారుల సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్లు లేదా పర్సన్ ఇన్‌చార్జీల నియామకం నేరుగా ప్రభుత్వం చేసేలా గతనెల మూడో తేదీన తెచ్చిన జీవో నెంబర్ 60 చట్ట వ్యతిరేకమంటూ హన్మకొండ జిల్లా మత్స్యకారుల సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్ బుస్స మల్లేశం, ఇతరులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ టి మాధవీదేవి విచారించారు. ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తీర్పునకు లోబడి జీవో నెంబర్ 60 అమలు ఉంటుందన్నారు.
మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరణ
రాష్ట్రంలోని పాఠశాలల్లో దశలవారీగా తెలుగును ద్వితీయ భాషగా అమలు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను సవాల్ చేసిన పిల్‌లో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఒక్క విద్యార్థి కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయలేదని గుర్తు చేసింది. ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు మినహాయింపు ఇచ్చినందున మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని సోమవారం చెప్పింది. పలు ప్రయివేట్ పాఠశాలలకు చెందిన కొందరు విద్యార్థులు వేసిన రిట్ పిటిషన్ సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపింది. స్టే కూడా ఉందని తెలియజేసింది. విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా అన్ని పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ప్రమీలా పాఠక్ వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ విచారించింది.
హెచ్‌ఎండీఏకు చివరి అవకాశం
ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలింపు నిర్ణయాన్ని సవాల్ చేసిన పిల్‌లో కౌంటర్ దాఖలు చేసేందుకు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కి హైకోర్టు ఆఖరి అవకాశం ఇచ్చింది. రెండు వారాలు గడువు ఇస్తున్నామని ప్రకటించింది. ఈసారి కౌంటర్ దాఖలు చేయని పక్షంలో తాము జరిమానా విధిస్తామని హెచ్‌ఎండీఏను హెచ్చరించింది. ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియం స్థలంలో నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం జనవరి 30న ఇచ్చిన జీవోను జి రాము అనే హైదరాబాదీ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్ డివిజన్ బెంచ్ సోమవారం విచారణ జరిపిన సందర్భంగా కౌంటర్ వేసేందుకు రెండు వారాల గడువు కావాలని హెచ్‌ఎండీఏ కోరింది. ఇందుకు పిటిషనర్ లాయర్ అభ్యంతరం చెప్పారు. రెండు వారాల సమయం ఇస్తూ హెచ్‌ఎండీఏను హైకోర్టు హెచ్చరించింది.
తీర్పునకు లోబడే జిల్లా మత్స్యకారుల పర్సన్ ఇన్‌చార్జీల నియామకం : హైకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES