సర్కారు ఉత్తర్వులు
ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, అటు శాసనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలకు విప్‌లుగా అవకాశం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. శాసనమండలిలో ప్రభుత్వ విప్‌లుగా అద్దంకి దయాకర్, డాక్టర్ వెంకట్ నర్సింగ్‌రావు బల్మూర్ నియమితులయ్యారు. ఈ మేరకు సర్కారు జీవో నెంబరు 43ను జారీ చేసింది. అలాగే శాసనసభలో ప్రభుత్వ విప్‌లుగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, నకిరెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను నియమించింది. ఈమేరకు ప్రభుత్వం జీవో నెంబరు 42ను విడుదల చేసింది. ఈ ఐదుగురి నియాకాలను ధృవీకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం రాత్రి ఉత్తర్వ్యులు ఇచ్చారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని జీవో పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల తరుణంలో ప్రభుత్వ విప్‌ల నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.



