Saturday, July 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీహెచ్‌ఎంసీ టీడీఆర్‌, బిల్డ్‌ నౌ విధానాలపై ప్రశంసలు

జీహెచ్‌ఎంసీ టీడీఆర్‌, బిల్డ్‌ నౌ విధానాలపై ప్రశంసలు

- Advertisement -

– హైదరాబాద్‌కు వచ్చిన జైపూర్‌ అభివృద్ధి సంస్థ అధికారులు
– పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసిన కమిషనర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అమలు చేస్తున్న టీడీఆర్‌, బిల్డ్‌ నౌ విధానాలను జైపూర్‌ అభివృద్ధి సంస్థ కమిషనర్‌, అధికారులు ప్రశంసించారు. గురువారం జైపూర్‌ అభివృద్ధి సంస్థ కమిషనర్‌ ఆనంది నేతృత్వంలోని ప్రణాళిక డైరెక్టర్‌ ప్రీతి గుప్తా, ఐటీ సలహాదారు ఆర్‌.కె.శర్మా, అసిస్టెంట్‌ టౌన్‌ ప్లానర్‌ రుషికేష్‌ కొల్టే, ఐటీ డిప్యూటీ డైరెక్టర్‌ పంకజ్‌ శర్మతో కూడిన బృందం హైదరాబాద్‌కు వచ్చింది. ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) పాలసీ, బిల్డ్‌ నౌ అనే ఏకీకృత భవన, లేఅవుట్‌ అనుమతి వ్యవస్థల అధ్యయనం కోసం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. వారికి అధికా రులు స్వాగతం పలికారు. ప్రధాన కార్యాలయంలో 2017లో ప్రవేశపెట్టిన నూతన టీడీఆర్‌ పాలసీ ముఖ్యాంశాలు, ప్రయోజనాలు, భవన, లేఅవుట్‌ అనుమతుల కోసం ఉద్దేశించిన ‘బిల్డ్‌ నౌ’ అనే సింగిల్‌-విండో ప్లాట్‌ఫామ్‌ గురించి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వారికి వివరించారు. ఈ విధానాల ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణ సులభతరం చేయడంతోపాటు పౌర సేవలలో పారదర్శకత, సమర్థత, బాధ్యతను పెంచినట్టు తెలిపారు. అనుమతి ప్రక్రియ సమయాన్ని తగ్గించి, పక్కాగా నిబంధనల అమలుకు వీలు కలిగిందన్నారు. జీహెచ్‌ఎంసీ విధానాలను ప్రశంసించిన బృంద సభ్యులు.. జైపూర్‌ నగర పరిపాలనను బలోపేతం చేసేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు ఇలాంటి వ్యవస్థలను అక్కడ అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో అదనపు జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ శ్రీనివాస్‌ రావు, అదనపు సీసీపీలు గంగాధర్‌, ప్రదీప్‌ కుమార్‌, ప్రతినిధుల అధ్యయన టూర్‌ సమన్వయ కర్తలు రాజ్‌ కుమార్‌, విల్సన్‌లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -