Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

- Advertisement -

శాసనసభ, మండలిలో ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం భట్టి
ఉభయ సభలు నిరవధిక వాయిదా
విభజన హామీలను విస్మరిస్తున్న కేంద్రం
పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి మన ప్రాజెక్టులను విస్మరించడం దారుణం
మిగతా పంటలకూ బోనస్‌ను పరిశీలిస్తాం
మాది ముమ్మాటికీ ప్రజా బడ్జెటే : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ద్రవ్య వినియోగ బిల్లు-2026కు ఆమోదం లభించింది. సోమవారం శాసనమండలిలోనూ, శాసనసభలోనూ ఆ బిల్లుపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసి బిల్లును ఆమోదించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం శాసనసభను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలిని చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. బిల్లుపై చర్చ సందర్భంగా సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం సభ్యులు బలాల మాట్లాడారు. అనంతరం భట్టి విక్రమార్క సమాధానమిస్తూ దేశ వృద్ధిరేటు 8 శాతం ఉండగా తెలంగాణ వృద్ధిరేటు 10.7 ఉందనీ, ఇది అభివృద్ధి కాదా అని బీజేపీ సభ్యులను ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని పక్షాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

ఫిజికల్‌ డిఫియెన్సీ 3 శాతం వరకు ఉండొచ్చని కేంద్రం అనుమతి ఇచ్చిందనీ, తెలంగాణ ఫిజికల్‌ డెఫియన్సీ 2.8 శాతంగా ఉందని తెలిపారు. తమది ముమ్మాటికీ ప్రజా బడ్జెట్‌ అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లలో పిల్లలకు అల్పాహారం పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి చదువు చెబుతున్నామనీ, ట్రాన్స్‌పోర్టు సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనైనా ఇది అమలవుతుందా? అని ప్రశ్నించారు. కుల, మత విద్వేషాలు లేకుండా చిన్నప్పటి నుంచే పిల్లలను లౌకిక విలువలతో పెరిగేలా చేసేందుకు నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యకు 13.5 శాతం నిధులు వెచ్చించబోతున్నామన్నారు. ఓయూకి ఏ ప్రభుత్వమైనా వెయ్యి కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించిదా? అని అడిగారు. ప్రతి కుటుంబానికీ ప్రతిఫలం దక్కేలా బడ్జెట్‌ రూపొందించామన్నారు.

జీఎస్టీ నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని ఎందుకు అడగట్లేదని అడిగారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌లకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర వాటా రూ.3 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టగా వాటిని క్లియర్‌ చేశామనీ, కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిను కూడా వదిలిపెట్టట్లేదని తెలిపారు. రాష్ట్రం అప్పుల విషయంలో కేంద్రాన్ని ఒప్పించి వడ్డీ రేటును కూడా తగ్గించేలా చూశామన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుండటాన్ని తప్పుబట్టారు. గ్రామసభలో నిర్ణయించాల్సిన పనులను ఢిల్లీలో కూర్చునే అధికారులు ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. వీబీఆర్‌ఏఎమ్‌జి పథకం పేరు మార్చితే ప్రజల బతుకులు మారవన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని ఆపేస్తున్నామని చెప్పే దమ్ము బీజేపీ ఎమ్మెల్యేలకు ఉందా అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చే ఆలోచనతో ముందుకెళ్తున్నామనీ, అందులో భాగంగానే నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఆటోలను కూడా బ్యాటరీ బేస్డ్‌ ఆటోలుగా మార్చుతామన్నారు. యుద్ధం కొరత వల్ల కొంత మేర గ్యాస్‌ కొరత ఏర్పడిన మాట వాస్తవమేనన్నారు. మెట్రో రైల్‌ విస్తరణ పూర్తయితే హైదరాబాద్‌ మహానగరం రూపురేఖలు మారి గ్లోబల్‌ సిటీగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజన్‌-2047 లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామనీ, మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నొక్కి చెప్పారు. ప్రపంచం నుంచి ఎవ్వరు వచ్చినా అక్కున చేర్చుకునే గుణం హైదరాబాద్‌కు ఉందని గర్వంగా చెప్పారు.

ఉర్దూ టీచర్ల భర్తీ కోసం డీఎస్సీలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల పోస్టులు మిగిలాయనీ, వాటిని డీరిజర్వేషన్‌ చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ నెలకు వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను విస్మరించడమే అతి పెద్ద తప్పిదమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలను సరిచేయడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపడుతామనీ, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒక దానికి జాతీయ హోదా వచ్చే దాకా కేంద్రంపై పోరాడేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి రావాలని కోరారు. పోలవరం వల్ల రెండు లక్షల ఎకరాల ఆదివాసీల భూములు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆహార కల్తీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామనీ, టాస్క్‌ఫోర్స్‌ నియమిస్తామని తెలిపారు. సన్నవడ్లకు ఇస్తున్నట్టుగానే మిగతా పంటలకు బోనస్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దేవాదాయ శాఖకు నిధులు కేటాయించలేదని బీజేపీ సభ్యులు అనటాన్ని తప్పుబట్టారు. మూసీ నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర ఆలయం అభివృద్ధి కోసం రూ.700 కోట్లు వెచ్చించబోతున్నామనీ, దానికి సీఎం, తాను కలిసి భూమి పూజ కూడా చేశామని తెలిపారు. భద్రాచలం ఆలయం అభివృద్ధి, పుష్కరఘాట్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా రూ.351 కోట్లు ఇవ్వబోతున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -