మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు విస్తరణ
బ్రహ్మపుత్ర నది కింద రోడ్ కమ్ రైలు టన్నెల్
మ్యూజియంగా సౌత్, నార్త్ బ్లాక్‌లు
కేంద్రమంత్రివర్గ నిర్ణయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రోడ్డు, రైలు, మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్‌ఎంసీ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు.
బ్రహ్మపుత్ర నది కింద రోడ్ కమ్ రైల్ టన్నెల్
ఈశాన్య రాష్ట్రం అసోంలో బ్రహ్మపుత్ర నది కింద రెండు లైన్ల ట్విన్ ట్యూబ్ టీబీఎం రోడ్ అండర్ వాటర్ రివర్ టన్నెల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి-15లోని గోహుపూర్-నుమాలిఘర్ వరకు నాలుగు లైన్ల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ కనెక్టివిటీ నిర్మాణంలో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద 15.79 కిలోమీటర్ల రోడ్ కమ్ రైల్ టన్నెల్‌ను రూ.18,662 కోట్లతో నిర్మించనున్నారు. ఈ టన్నెల్ నిర్మాణంతో 250 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఆరు గంటలు పట్టే ప్రయాణ సమయం 20 నిమిషాలకు తగ్గనున్నది. బ్రహ్మపుత్ర నది కింద రైల్వేలైన్, నేషనల్ హైవే కోసం టన్నెల్‌ని నిర్మించనుంది.
మూడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోని 12 జిల్లాలను కవర్ చేసే మూడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు సీసీఈఏ ఆమో దం తెలిపింది. దీంతో దాదాపు 389 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్ పెరుగుతుంది. మొత్తం అంచనా వ్యయం రూ.18,509 కోట్లు కాగా, ప్రాజెక్టు 2030-31 నాటికి పూర్తవుతుంది.కసారా-మన్మాడ్ మధ్య మూడు, నాలుగు, ఢిల్లీ-అంబాల మధ్య మూడు, నాలుగు, బళ్లారి-హోస్పేట మధ్య మూడు, నాలుగు రైల్వేలైన్ల నిర్మాణం జరగనుంది.
గుజరాత్‌లో జాతీయ రహదారి 56 విస్తరణకు రూ.4,583 కోట్లు
గుజరాత్‌లో జాతీయ రహదారి 56 విస్తరణ కోసం రూ.4,583 కోట్లకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని ధమాసియా-బిటాడా-నాసర్‌పూర్-మలోథా సెక్షన్ మధ్య నాలుగు లైన్ల నిర్మాణానికి రూ.4,583.64 కోట్లను ఖర్చు చేయ నుంది. ఇందులో ధమాసియా-బిటాడా (47.46 కిలోమీటర్ల), నాసర్‌పూర్-మలోథ (60.21 కిలో మీటర్ల) మొత్తం 107.67 కిలోమీటర్ల పొడవున విస్తరణ ఉంటుంది.
మహారాష్ట్రలో జాతీయ రహదారి విస్తరణకు రూ.3,320 కోట్లు
మహారాష్ట్రలోని జాతీయ రహదారి-160ఏ విస్తరణకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని గోతి- త్రింబక్ -జవహర్-మనోర్-పాల్ఘర్ సెక్షన్ ఇంజినీరింగ్, సేకరణ, నిర్మాణం (ఈపీసీ) మోడ్‌కు సం బంధించిన పునరావాసం, అప్ గ్రేడ్ కోసం రూ.3,320.38 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయ నుంది. మొత్తం 154.635 కిలోమీటర్ల పొడవు రోడ్డు విస్తరణ చేస్తారు.
స్టార్టప్ ఇండియా 2.0కు రూ.10 వేల కార్పస్ ఫండ్
స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు వెంచర్ క్యాపిటల్ సమీకరణ ఉద్దేశ్యంతో రూ.10 వేల కార్పస్ ఫండ్‌తో స్టార్టప్ ఇండియా 2.0 ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది ఆవిష్కరణ ఆధారిత అభివృద్ధి ఎజెండాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.
రూ.లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్
మార్కెట్ ఆధారిత పట్టణ పరివర్తనను ముందు కు తీసుకెళ్లడానికి రూ.లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వ సహాయం 25 శాతం ఉంటుంది. మార్కెట్ నుంచి కనీసం 50 శాతం సేకరిస్తారు. ఇది వచ్చే ఐదేండ్లలో పట్టణ రంగంలో మొత్తం రూ.4 లక్షల కోట్ల పెట్టు బడికి దారితీస్తుందని కేంద్రప్రభుత్వం చెబుతోంది. ఈ ఫండ్ 2025-26 నుంచి 2030-31 వరకు పని చేస్తోంది. అయితే అమలు వ్యవధిని 2033-34 వరకు పొడిగించవచ్చు.
నోయిడా మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ఆమోదం
నోయిడా మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నోయిడా సెక్టార్ 142 నుంచి బొటానికల్ గార్డెన్ వరకు 11.56 కిలో మీటర్ల పొడవునా ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లతో కూడిన విస్తరణ కారిడార్‌కు గ్రీన్‌సిగల్ ఇచ్చింది. దీంతో గ్రేటర్ నోయిడా నగరంలో 61.62 కిలో మీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్ ఉంటుంది.
మ్యూజియంగా నార్త్, సౌత్ బ్లాక్‌లు
నార్త్, సౌత్ బ్లాకుల నుంచి సేవా తీర్థాలు, కర్తవ్య భవనాలుగా పేరు మార్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ”యుగే యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం”లో నార్త్, సౌత్ బ్లాక్‌లను భాగం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 95 ఏండ్ల తరువాత ఫిబ్రవరి 13న కేంద్ర ప్రభుత్వం నార్త్, సౌత్ బ్లాక్‌లను ఖాళీ చేసింది. భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వరకు 16 మంది ప్రధాన మంత్రుల నాయకత్వంలో ఏర్పడిన మంత్రివర్గాలు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలకు నార్త్, సౌత్ బ్లాక్‌ల సముదాయం సాక్ష్యంగా నిలిచింది. ఆ భవనాల మెట్లపై ఉన్న ప్రధాన మంత్రుల పాదముద్రలు దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి. సౌత్‌బ్లాక్‌లోని చాంబర్‌లో కేంద్ర మంత్రివర్గ సమావేశం చివరిసారిగా జరిగింది. బానిసత్వం నుంచి స్వేచ్ఛ వరకు, తరువాత స్వతంత్ర దేశం వరకు అనేక చారిత్రక సంఘటనలను ఈ భవనాలు చూశాయి.
మహబూబ్‌నగర్‌కు జాతీయ రహదారికి రూ.3,175 కోట్లు
హైదరాబాద్-పనాజీ ఆర్థిక కారిడార్‌లోని గూడె బేల్లూరు నుంచి మహబూబ్‌నగర్ వరకు ఉన్న జాతీయ రహదారి-167ను తెలంగాణలో రూ.3,175.08 కోట్ల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. మహబూబ్‌నగర్, నారాయణ పేట, రాయచూర్, దేవరకద్ర, హైదరాబాద్‌కు ఈ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్-పనాజీ కారిడార్‌లో భాగంగా ఈ కొత్త నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం 80.01 కిలోమీటర్ల మేర జరగనున్నది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్‌ఏఎం)లో నిర్మాణం చేస్తారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు గణనీయమైన ప్రయోజనం జరుగుతుందని కేంద్రమంత్రి అశ్వీని వైష్ణవ్ తెలిపారు. ఇది సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుందని, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తుందని వివరించారు.



