కంపా కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
తెలంగాణ స్టేట్ కంపెన్సటరీ అఫరెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కంపా) కార్యనిర్వాహక కమిటీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.367.59 కోట్ల వ్యయం చేసేందుకు ఆమోదం తెలిపింది. శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సి.సువర్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వార్షిక కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. అటవీకరణ, అటవీ రక్షణ, నేల-తేమ సంరక్షణ పనులు, వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి, టైగర్ రిజర్వుల కోర్ ప్రాంతాల నుంచి గ్రామాల స్వచ్ఛంద పునరావాసం వంటి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్య కార్యదర్శి ఎన్.క్షితిజతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



