రూ. 33, 600 కోట్లతో 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులు
ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో ఏర్పాటు
చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకానికి రూ. 2,584.60 కోట్లు: కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కొత్తగా భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం నాడిక్కడ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. భవ్య పథకం కింద రూ.33,600 కోట్లతో ప్రపంచ స్థాయి 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తారు. వంద నుంచి వెయ్యి ఎకరాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో ఈ పార్కుల ఏర్పాటు జరగనుంది. భారీ స్థాయిలో ఉద్యోగాలు, పెట్టుబడులు, అవకాశాల కల్పన జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకం
చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమలయ్యే సుమారు 1500 మెగావాట్ల సామర్థ్యం గల చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన కోసం రూ.2,584.60 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో బారాబంకి నుంచి బహరాజ్ వరకు 101 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ జాతీయ రహదారి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి రూ.6,969.04 కోట్లు ఖర్చు చేయనుంది. పత్తి గిట్టుబాటు ధరల నిధికి రూ. 1,718.56 కోట్ల కేటాయింపులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2023-24 పత్తి సీజన్‌లో ఎంఎస్పీ కోసం సీసీఐకి కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజనకు ఆమోదం
- Advertisement -
- Advertisement -



