నవతెలంగాణ-మిరుదొడ్డి: పురపాలికలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్ తెలిపారు. దుబ్బాక పురపాలిక కార్యాలయంలో పురపాలిక చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత అధ్యక్షతన నిర్వహించిన పురపాలిక వార్షిక బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.40.38 కోట్లతో ప్రతిపాదించిన అంచనా వార్షిక బడ్జెట్‌ను పురపాలిక సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి ప్రవేశపెట్టగా, పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా ఆదాయం (సాధారణ నిధులు, గ్రాంటులు కలుపుకొని) రూ.40.38 కోట్లుగా, అంచనా వ్యయం రూ.40.17 కోట్లు, మిగులు బడ్జెట్ రూ.21 లక్షలుగా ప్రతిపాదించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ సాధారణ ఆదాయము రూ.5.48 కోట్లు, సాధారణ వ్యయము రూ. 5.48 కోట్లుగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కొరకు రూ.54.8 లక్షల సాధారణ నిధులను కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి, ప్రజల కనీస సౌకర్యాల కల్పన, మౌలిక వసతుల మెరుగుకు పురపాలిక ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఆదిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పురపాలిక అభివృద్ధికి నూతన పాలకవర్గం మరింత కృషి చేయాలని కోరారు.ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో ఉన్న సమస్యలను జిల్లా అదనపు పాలనాధికారి దృష్టికి తీసుకురాగా, వాటన్నిటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పురపాలిక కమీషనర్ రమేష్ కుమార్, పురపాలిక వైస్ చైర్మన్ ఆస సులోచన, పుర మేనేజర్ శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు, పుర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పురపాలిక వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



