Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌లో ఉన్నోళ్లే పేదోళ్లా?

కాంగ్రెస్‌లో ఉన్నోళ్లే పేదోళ్లా?

- Advertisement -

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లివ్వాలి
పద్ధతి మార్చుకోకపోతే డిప్యూటీ సీఎం భట్టి ఇంటిని ముట్టడిస్తాం
ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని మంత్రికి హితవు
బోనకల్‌ పాదయాత్ర ముగింపు సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌
ప్రజాపోరాటాలను ఉధృతం చేస్తాం : నున్నా

నవతెలంగాణ – బోనకల్‌
మల్లు భట్టి విక్రమార్క.. కాంగ్రెస్‌కు ఉప ముఖ్య మంత్రివా, తెలంగాణ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రివా..? సమాధానం చెప్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఉన్నవారే పేదవారా?.. మిగతా వారు పేదలు కాదా? ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పక్షపాతం మానుకోకపోతే డిప్యూటీ సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఇందిరమ్మ గ్రామ కమిటీలను రద్దు చేయాలని, గ్రామ పంచాయతీలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం లక్ష్మీపురం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు సాగింది. ఈ పాదయాత్రను సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు మాదినేని నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా కిలారు తిరుపతయ్య స్థూపానికి పోతినేని సుదర్శన్‌రావు పూలమాలవేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) జెండాను జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఎగురవేశారు. అనంతరం పోతినేని సుదర్శన్‌రావు, సీపీఐ(ఎం) మధిర డివిజన్‌ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. తహసీల్దార్‌ కార్యాలయం ముందు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ మద్దెల రమాదేవికి వినతిపత్రం అందజేశారు.

పాదయాత్ర ముగింపు సభలో పోతినేని మాట్లాడుతూ.. ఆనాడు మధిర ఎమ్మెల్యేగా ఉన్న బోడెపూడి వెంకటేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధి కోసం బాగా కృషి చేశారని తెలిపారు. ఆనాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు, నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గాల మాదిరి మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం బోడెపూడి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత మధిర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేవలం కాంగ్రెస్‌కు చెందిన వారికి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇస్తున్నారని, ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ప్రజలందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందించాలేగానీ.. కాంగ్రెస్‌లో ఉన్న వారికి మాత్రమే ఇస్తామంటే సీపీఐ(ఎం) చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పక్షపాత ధోరణి మానుకోవాల న్నారు. ప్రజలకు ఇస్తుంది ప్రజల సొమ్మేనని, సొంత సొమ్ము కాదని, అది తెలుసుకొని ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.

గోవిందాపురం ఎల్‌ గ్రామానికి చెందిన ఎర్రబోయిన నాగేశ్వరరావుని కాంగ్రెస్‌ గూండాలు అతి కిరాతకంగా హత్య చేశారని, నాగేశ్వరరావు భార్య ఉషారాణికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంటే భట్టి విక్రమార్క ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతోందన్నారు. భట్టి బుద్ధి ఎంతో నీచంగా ఉందన్నారు. తన పక్షపాతాన్ని విడనాడకపోతే పేదలందరితో కలిసి భట్టి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని లేకపోతే ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్‌ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, మాదినేని వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -