Friday, October 31, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఉద్యోగులు ప్రభుత్వాలకు భారమా?

ఉద్యోగులు ప్రభుత్వాలకు భారమా?

- Advertisement -

ఉద్యోగులు ముప్తై రోజులు ప్రభుత్వానికి విశ్వాసంతో విధులు నిర్వహించి ప్రతిఫలంగా వేతనం కోసం ఎదురుచూసే అమాయక జీవులు. వీరికి కుటుంబ సమస్యలు, సమాజం నుండి ఎదురయ్యే సవాళ్లు, ఇవి చాలనట్లు ప్రభుత్వ ఒత్తిడి – వీటన్నింటినీ భరిస్తూ ఎదుర్కొంటూ తమ స్థాయిలో పరిష్కరిం చుకుంటూ బాధలెన్ని ఉన్నా ముఖానికి చిరునవ్వు పులుముకుని తమ జీవనం కొనసాగిస్తుంటారు. కానీ ప్రభుత్వాలకు మాత్రం వీరి పైన కనికరం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమది ఉద్యోగ అనుకూల స్నేహపూరిత ప్రభుత్వమని చెప్పు కొచ్చారు. మొదటి పిఆర్సిలో నలభైమూడు శాతం ఫిట్మెంట్‌ ప్రకటించడం, ప్రోత్సాహకం పేరిట ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చి వారిని సంతోషపెట్టిన ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమంగా ఉద్యోగు లను దూరం పెట్టాడు. ఉద్యమ కాలంలోనూ, మొదటి ఐదేండ్లు పనికొచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు రెండోసారి గద్దెనెక్కిన తర్వాత కానివారయ్యారు.

వారితో మాట్లాడడానికి లేదా వారి సమస్యలు వినటానికి పరిష్కరించడానికి కూడా ఇష్టపడలేదు. పర్యవసానంగా ఉద్యోగ వర్గాలు ఆయనకు దూరమయ్యారు. అదే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలత తెచ్చిపెట్టింది. ఇక అరచేతిలో స్వర్గం చూపించే సామర్థ్యం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు అసంతృప్తితో ఉన్న ఉద్యోగ వర్గాలను ఆకట్టుకోవ డానికి అనేక వరాలు ప్రకటించింది, అలవి కాని వాగ్దానాలు చేసింది. పెండింగ్‌ ఉన్న డిఏలు అన్నీ వెంటనే ప్రకటిస్తామని ఆరు నెలల్లోనే పీఆర్సీని అమలుపరచుతామని, 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని, ఉద్యోగుల బిల్లులన్నీ తక్షణమే విడుదల చేస్తామంటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది. కానీ 22 నెలల తర్వాత కూడా ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు ఏమాత్రం పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నది. ఐదు డిఏలు పెండింగ్‌ ఉంచిన ఏకైక రాష్ట్రంగా భారతదేశంలో అవతరించింది. పీఆర్సీ గురించి కనీసంగానైనా మాట్లాడడం లేదు. ఆరోగ్య పథకానికి సుస్తి చేసింది. ఉద్యోగులు పెన్షనర్లు తమ ఆరోగ్యానికి చేసిన ఖర్చు తాలూకు బిల్లులు విడుదల కావడం లేదు.

2024 మార్చి నుండి గత నెల వరకు దాదాపు 18500 మంది ఉద్యోగులు పదవీ విరమణ కాగా వారి గ్రాట్యూటీ, కమ్యూటేషన్‌ బకాయిలు అలాగే పేరుకుపోయాయి. పదివేల కోట్ల రూపాయలు పెన్షనర్లకు బాకీ పడింది ప్రభుత్వం. దాచుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌ సొమ్ము గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సొమ్ము కూడా నోచుకోలేదు పెన్షనర్లు. అన్నింటికీ ఒకటే సమాధానం – ఖాళీ ఖజానా మరి ఎన్నికల సమయంలో వాగ్దానాల వర్షం కురిపించిన నాడు ఖజానా ఖాళీగా ఉందని కాంగ్రెస్‌ నేతలకు తెలి యదా? అంటే ఇది కేవలం ఓట్లు దండుకోవడానికి, ఉద్యోగులను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికేనా? అడపాదడపా కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తూ సమస్యలకు కాలదోషం పట్టించడం సమంజసం కాదు. మూడు దశాబ్దాల కాలం ప్రభుత్వానికి విశ్వాసంగా పని చేసినందుకు ఉద్యోగి పదవీ విరమణ సమయంలో గ్రాట్యూటీ ఇస్తారు. ఆ డబ్బు 16 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగుల సర్వీస్‌లో మిగిలిన సంపాదిత సెలవును సొమ్ము చేసుకునే అవకాశం కల్పించారు. ఇది ఉద్యోగి స్థాయిని బట్టి 15 నుండి 25 లక్షల వరకు వస్తుంది.

కానీ ఆ సొమ్మును కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఇక కమ్యూటేషన్‌ సొమ్ము పెన్షనర్‌ తీసుకునే డబ్బులో నలభై శాతం ప్రభుత్వం రిటైర్‌ కాగానే ఇచ్చి ఆసొమ్మును పదిహేనేండ్లలోపు అంటే 180 నెలలు నెలవారీగా మినహాయించుకుంటుంది. అంటే ఒక రకంగా ఇచ్చిన సొమ్ము కంటే ప్రభుత్వం పెన్షనర్‌ నుండి ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసు కుంటున్నది. సుప్రీంకోర్టు ఈ మధ్య ఆ కాలాన్ని 135 నెలలకు పరిమితం చేసింది. పెన్షనర్లు ఈ సొమ్ముకు కూడా కనీసం ఏండ్ల కొద్ది వేచి చూడవలసి వస్తున్నది. ఇది కూడా 25 నుండి 35 లక్షల వరకు ఉంటుంది. కానీ ఇది ప్రభుత్వం తిరిగి నెలవారీగా పెన్షనర్‌ నుండి రికవరీ చేసుకుంటుంది. రిటైర్‌ అయ్యే ఉద్యోగి తన బిడ్డ పెళ్లికో లేక ఇంటి కొనుగోలుకో వేసుకున్న పథకాలు నేడు చెల్లాచెదరై పోతున్నాయి. ఆశించిన డబ్బు సకాలంలో రాకపోవడంతో పెన్షనర్లు మనోవేదకు గురై రోగాల పాలవుతున్నారు.

దాదాపు 15మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు పేపర్లలో చదువుతున్నాం. నిజంగా ఇవి ప్రభుత్వం చేసే హత్యలుగానే భావించాలి. 30 ఏండ్ల నిస్వార్థ సేవకు ప్రభుత్వం ఇస్తున్న బహుమతి ఇదేనా? పెన్షనర్లకు ప్రభుత్వాలు కేవలం గ్రాట్యూటీ మాత్రమే ఇస్తాయి. మిగిలినవన్నీ వారు దాచుకున్నవి లేదా రికవరీ చేసుకునే డబ్బులు మాత్రమే. కానీ ప్రభుత్వాలు పెన్షనర్లు చాలా భారంగా పరిణమిం చారని ప్రచారం చేయడం దురదృష్టకరం. దీన్ని ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు కూడా తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసేవారు ఉద్యోగులు. పథకాల అమలుకు సంబంధించి విధానాలు రూపొందించినా వీరే. ప్రజలకు చేర్చడం వీరి ద్వారానే అది సాధ్యం. అలాంటి ప్రభుత్వ సేవకులను ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేయడం శోచనీయం. వారి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి అవసర మైతే కుటుంబాలకు దూరంగా ఉండి కరువు కాటకాల్లోనూ, తుఫాన్‌లు, వరద ల్లోనూ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఉద్యోగులు నేడు నిరాదరణకు గురవుతున్నారు.

‘మీకు డబ్బులివ్వడం కోసం ఏ సంక్షేమ పథకాన్ని ఆపేయాలి’ అంటూ ప్రభుత్వమే ఉద్యోగ నేతలను ప్రశ్నించడం ద్వారా ప్రజలకు ఉద్యోగులకు మధ్య వైరం సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. వారిని ప్రజల నుండి దూరం చేస్తు న్నది. ప్రజలను ఉద్యోగులపై ఉసిగొల్పే ప్రయత్నం కూడా జరుగుతున్నది. ఉద్యోగులు ఎప్పుడూ ప్రజా సంక్షేమాన్ని కోరి పనిచేసేవారే. అందు కోసం తమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయరు. కానీ పదవీ విరమణ తర్వాత కూడా వారి సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే వారిని ఆదుకునేదెవరు? చెట్టుకు కాయ భారం కాదు, తండ్రికి పిల్లలు భారం కాదు, ప్రభుత్వానికి ఉద్యోగులు ఎన్నడూ భారం కాదు. ప్రభుత్వానికి అప్పుపుట్టకపోతే ఐదేండ్ల్లకొక ప్రాంతం లో పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయులను నమ్మి అప్పు ఎవరిస్తారు? ప్రభుత్వాలకు తమ పథకాల కోసం విధానాల అమలు కోసం ఉద్యోగులు కావాలి. కానీ వారి సంక్షేమం మాత్రం అవసరం లేదా? ఇది ఎంత అన్యాయం? రిటైర్‌ అయిన వారి స్థానంలో కనీసం నియామకాలు కూడా లేకపోవడంతో ఉన్నవారే అదనంగాఆ బాధ్యతల్ని కూడా మోస్తున్నారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామన్న పాలకులు ఇప్పటివరకూ భర్తీచేయలేదు.

ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నుండి నడుస్తుంది లేదా జిల్లా కేంద్రాల నుండి నడుస్తుంది. కానీ ప్రభుత్వ ప్రతినిధులుగా ఉద్యోగులు రాజధాని మొదలు మారుమూల గ్రామం వరకు వ్యాపించి ఉంటారు. ప్రభుత్వ పనితనం ప్రతిబింబించేది పల్లెల్లోనే. ప్రభుత్వ పథకాలు నచ్చక పోయినా సరిగా అమలు కాకపోయినా వారి ఆగ్రహాన్ని మొదట చవిచూసేది ప్రభుత్వ ఉద్యోగులే. వీరే ప్రజలకు ప్రభుత్వం. వీరే సర్కార్‌ తరఫున సమాధాన మిచ్చుకోవాలి, వారిని సంతృప్తి పరచాలి. ఉద్యోగుల విఫలమైతే మొత్తం ప్రభుత్వం విఫలమైనట్లే. ఉద్యోగులంటే ప్రభుత్వం ఇంకా ప్రజలు అనేది పాలకులు గుర్తించాలి.

కొన్నిసార్లు అవసరమైనప్పుడు పెన్షనర్ల సేవలు కూడా ప్రభుత్వం తీసుకుంటున్నది. వారు కూడా ఉత్సాహంగా తమ అనుభవాన్ని జోడించి ప్రభుత్వాన్ని అల్లకల్లోలం నుండి క్షేమ తీరాలకు చేర్చుతున్నారు. ప్రభుత్వాలకు ప్రజలు ఉద్యోగులు రెండు కండ్లలాంటివారు. వారి అసంతృప్తి, ఆగ్రహం ప్రభుత్వ మనుగడకు శ్రేయస్కరం కాదు. వారి సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసినా లేదా విస్మరించినా అది ప్రభుత్వ పనితనంపై ప్రతిబింబిస్తుంది. అది ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే దాకా పోతుంది. సమ్మెలు చేయడం, రోడ్డున పడడం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కొత్తేమీ కాదు, అలాగని వారికి అది సరదా కూడా కాదు. కానీ వారి సహనానికి పరీక్ష పెట్టడం ప్రభుత్వాలకు క్షేమదాయకం కాదని పాలకులు గుర్తించాలి.

శ్రీశ్రీ కుమార్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -