ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం భారత ప్రజలను కలవరపెడుతున్నది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు, ఉపాధి నిమిత్తం వలసెళ్లిన ప్రజలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతున్నది. రోజు రోజుకూ ఆందోళనకరంగా మారుతున్న యుద్ధ బీభత్సం ఇక్కడి కుటుంబాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. తెలంగాణకు చెందిన వలసకూలీ రవీందర్ ఇజ్రాయిల్‌లో బాంబుల శబ్దానికి గుండెపోటుతో మృతిచెందిన వార్త ఆందోళనలను మరింత తీవ్రం చేస్తున్నది.శాంతి చర్చలకు తావులేకుండా సాగుతున్న భీకర యుద్ధం పలు ప్రాంతాలను శ్మశానాలుగా మారుస్తోంది. వందలాది మంది ప్రజలు, చిన్నారులు మృత్యుఒడికి చేరుతున్న దారుణస్థితి నెలకొంది. అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్య రాజ్య సమితి జోక్యం చేసుకున్నా ఇజ్రాయిల్ మాత్రం నరమేధాన్ని సాగిస్తూనే ఉంది. యుద్ధంలో చిక్కుకున్న భారతీ యుల్ని దేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు కృషిచేయాల్సిన ప్రధాని మోడీ విదేశీ పర్యటనల్లో నిమగమవ్వడం, బాధితుల యోగక్షేమాలు పట్టించుకోకపోవడం మరింత ఆందోళనకరం.
2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ మైనప్పుడు.. ‘ఆపరేషన్ గంగా’ కింద కేంద్రం వేలాది మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించింది. కానీ ఇప్పుడా ప్రయత్నం కూడా కేంద్రం చేయడం లేదు. ఇరాన్‌లో పదివేల మంది భారతీయ పౌరులున్నారు. వీరి రక్షణ ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. వీరిలో రెండు వేల వరకు విద్యార్థులు చాలాకాలంగా అక్కడే చదువుకుంటూ ఉపాధి కూడా పొందుతూ, కుటుంబాలకూ ఆసరాగా ఉంటున్నారు. ఇంకా ఉపాధి కోసం వెళ్లినవాళ్లు, నావికులు, షిప్పింగ్ రంగంలో పనిచేసేవారు చాలామందే. కానీ, యుద్ధంతో వారి జీవన భద్రత గాలిలో దీపంగా మారింది. ఇజ్రాయిల్ ఏకధాటిగా సాగిస్తున్న బాంబుల వర్షం, రాకెట్ల ప్రయోగంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక సతమతమవుతున్న పరిస్థితి ఉంది. కనీసం వారితో ఫోన్‌లో మాట్లాడి క్షేమసమాచారం తెలుసుకుందామంటే నెట్‌వర్క్ కూడా లేదని కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. మరి భారత ప్రభుత్వం కనీసం అక్కడి కేంద్ర రాయబార కార్యాల యంతోనైనా సంప్రదింపులు చేసుం టే బాగుండేది. అది చేయకపోవడం ఇక్కడి కుటుంబీకులను మరింత వేదనకు గురిచేస్తున్నది. ఈ సమయంలోనే మన దేశంలో ఉపాధి సరిగ్గా ఉంటే వారు ఇతర దేశాలను ఆశ్రయించాల్సిన ఉండేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
భారతీయుల తరలింపుపై యుద్ధ పిపాసి, ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహూతో ప్రధాని మోడీ నుండి కనీస సంప్రదింపులు లేవు. ఇందులో ఏమాత్రం తలదూర్చినా ట్రంప్‌తో స్నేహం చెడుతుందనేది ఆయన భయం. అయితే ఇరాన్‌తోనైనా మాట్లాడి మనవారిని సురక్షితంగా స్వదేశానికి తరలించాలన్నా దానికి కూడా భౌగోళిక, దౌత్యపరమైన అడ్డంకులు అనేకం. వాటిని పరిష్కరించుకునే దిశగా మనవారి అడుగులు ఎప్పుడూ వెనుకే. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు తీసుకున్న చర్యల్లో పావువంతు కూడా చేయడం లేదు. దీనికి తోడు ఇరాన్ తూర్పు దేశాలైన పాకిస్తాన్, అప్ఘనిస్తాన్‌తో వ్యూహాత్మకమైన అంశాల్లో చాలా సమస్యలుండటంతో రవాణా పెద్ద సవాల్‌గా మారింది. ఇటీవల పాకిస్థాన్‌తో యుద్ధం దాన్ని మరింత క్లిష్టం చేసింది. పాకిస్థాన్ భారత్‌కు తన వైమానిక మార్గాన్ని మూసివేసింది. అప్ఘనిస్తాన్‌తో సంబంధాలు ఉన్నప్పటికీ అది కూడా పాకిస్థాన్ గగనతలం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో భారతీయుల తరలింపుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రధాని మోడీనే సౌదీకి వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గం అన్వేషించక తప్పలేదంటే యుద్ధ వాతవరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఏ దేశానికైనా ఇరుగుపొరుగు ఉన్న దేశాలతో సత్సంబంధాలు తప్పనిసరి. కానీ, ఈ విషయంలో కేంద్రం వైఫల్యం ఇప్పుడు సమస్యగా మారింది. ముందుచూపుతో వ్యవహరించలేదన్న విమర్శ వ్యక్తమవుతున్నది. దాని ఫలితమే ఇజ్రాయిల్, ఇరాన్‌లో భారతీయులు అవస్థలనేది స్పష్టం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ రోజుల్లో, ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దు సాపేక్షంగా, సురక్షితంగా ఉంది. దాంతో భారతీయు లతో సహా వేలాది మంది ప్రజలు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టడం సాధ్యమైంది. కానీ ఇరాన్‌లో అలా కాదు. ఇజ్రాయిల్ వైమానిక దాడులు అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండటం తో ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఇంకెంత తీవ్రస్థాయికి చేరుకుంటుందోనన్న భయం భారతీ యుల్ని వెంటాడుతోంది. ఇది తరలింపు మార్గాల్ని కూడా మూసేసే అవకాశం ఉన్నది. ఇన్ని అడ్డంకుల మధ్య ఎంత మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటారన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీ యాంశమైంది. ఏమైనా ఇరు దేశాల్లో చిక్కుకున్న వారి భద్రత ముమ్మాటికే కేంద్రానిదే. ఇందులో ఏమాత్రం అపశృతి చోటుచేసుకున్నా బాధ్యత కేంద్ర సర్కార్‌దే.
భారతీయులు సురక్షితమేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES