Friday, March 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసముద్ర గర్భ కేబుళ్లే లక్ష్యమా?

సముద్ర గర్భ కేబుళ్లే లక్ష్యమా?

- Advertisement -

ఆర్థిక మూలాలపై విరుచుకుపడేందుకు ఇరాన్‌ ప్లాన్‌

టెహ్రాన్‌: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు ఎప్పుడో తెలియని అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాల నెత్తిన మరో కత్తి వేలాడుతోంది..! ఇప్పటికే హార్ముజ్‌ అంతరాయాలు, గ్యాస్‌, చమురు క్షేత్రాలపై దాడులతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చమురు క్షేత్రాలపై దాడులతో యుద్ధం మరోస్థాయికి చేరిన నేపథ్యంలో ఇంటర్నెట్‌పై ఇరాన్‌ గురిపెట్టనున్నట్టు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి హార్ముజ్‌లో ఇరాన్‌..

ఎర్ర సముద్రం దక్షిణ ముఖద్వారం బాబ్‌ అల్‌ మందేబ్‌ జలసంధిలోని సముద్రగర్భ కేబుళ్లను హూతీలు టార్గెట్‌ చేస్తారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండుచోట్ల సముద్రం అడుగున వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కేబుళ్లు.. ప్రపంచ ఇంటర్నెట్‌కు అత్యంత కీలకం. వీడియో కాల్స్‌, ఈమెయిల్స్‌, బ్యాంకింగ్‌ లావాదేవీలు, ఏఐ సర్వీసులకు సంబంధించిన డేటానంతా మోసుకెళ్తాయి. ఎర్రసముద్రం అడుగునుంచి 17 కేబుళ్లు వెళ్తున్నాయి. ఐరోపా, ఆసియా, ఆఫ్రికాలోని ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌లో వీటిదే ప్రధానపాత్ర. అలాగే పర్షియన్‌ గల్ఫ్‌లో కూడా భారతదేశ విదేశీ డేటా కనెక్షన్లకు ఇవి కీలకం.

ఇంటర్నెట్‌ కట్‌ చేస్తే..
హమాస్‌పై ఇజ్రాయిల్‌ దాడులకు నిరసనగా 2024లో రెడ్‌సీలో పలు కేబుళ్లపై దాడులు చేసింది. దాంతో ఆసియా, ఆఫ్రికాలో ఇంటర్నెట్‌ వేగం నెమ్మదించింది. వాటిని సరిచేయడానికి నెలల సమయం పట్టింది. ఇప్పుడు హార్ముజ్‌లో ఇరాన్‌ సీమైన్స్‌ను పరిచిన సంగతి తెలిసిందే. ఇవి ఇంటర్నెట్‌కు ప్రమాదంగా పరిణమించాయి.

యాక్సెస్‌ పాయింట్లు ఉన్నా..
ప్రస్తుతం సముద్రగర్భంలో 300కుపైగా కీలక ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్లు ఉన్నాయి. ఫోన్‌కాల్స్‌, రోజువారీ జరిగే బిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ నగదు లావాదేవీలు, దౌత్య సందేశాలు వంటివి వీటి నుంచే సాగుతుంటాయి. ప్రపంచ కమ్యూనికషన్లలో 90శాతానికి ఇవే ఆధారం. శాటిలైట్‌ కనెక్షన్‌, ఉపరితల కేబుళ్లతోపాటు ప్రపంచ కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు సముద్రగర్భ కేబుళ్లు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి. సాధారణంగా, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు బహుళ యాక్సెస్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ఏదైనా సమస్య వల్ల ఒకటి విఫలమైనా.. మిగిలిన పాయింట్ల నుంచి వినియోగదారులకు ఇంటర్నెట్‌ అందుతుంది. అయితే ఈ సేవలు కూడా నెమ్మదిస్తాయి.

టెక్‌ కంపెనీల్లో వణుకు..
అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి సంస్థలు గల్ఫ్‌ దేశాల్లో డేటాసెంటర్ల కోసం బిలియన్ల కొద్ది డాలర్లను కుమ్మరించాయి. ఈ ప్రాంతాన్ని కృత్రిమ మేధకు ఒక ముఖ్య కేంద్రంగా మార్చాలన్నది ఆ టెక్‌ సంస్థల ప్రణాళిక. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని యూజర్లు, మార్కెట్లను డేటా సెంటర్లతో ఈ కేబుళ్లు అనుసంధానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీమైన్స్‌ పేలుడు, ఉద్దేశపూర్వకంగా కత్తిరించడం, ఏదైనా ప్రమాదం వంటివి వాటిని కొన్ని వారాలు లేక నెలలు పని చేయకుండా చేస్తాయి. ఎందుకంటే.. దెబ్బతిన్న కేబుళ్లను సరిచేసేందుకు ప్రత్యేక నౌకలు ఆ జలసంధుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అలా వెళ్లడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇరాన్‌ అనుబంధ గ్రూప్‌ హూతీ తన మిత్రులకు మద్దతుగా ఎప్పటికప్పుడు ఎర్రసముద్రంపై విరుచుకుపడుతుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -